అభిమాన వర్ణాలతో మెరిసిన షర్మిల యాత్ర

విజయవాడ:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర బుధవారం హోలీ సందోహం నడుమ సాగింది. ఈసారి వైయస్ఆర్‌ కాంగ్రెస్ అభిమానుల హరివిల్లై విరిసింది. ఆమెను చూసిన ప్రతి కన్ను ఆనందార్ణవమైంది. ఆమె మాట విన్న ప్రతి గుండె కొండంత భరోసాతో ఆనందభైరవి ఆలపించింది. ఈ హోలీ.. నిజమైన ప్రజాభిమాన హృదయానంద నృత్యకేళిగా పులకించింది.

తరతమ భేదం మరిచి కలిసిమెలిసి ఆనందంగా జీవించాలన్నదే హోలీ పండగ పరమార్థం. ఉన్నవాళ్ల మాదిరిగానే పేదలు కూడా గొప్పగా జీవించాలన్నది దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్  ఆశయం. ఆ మహోన్నత ఆశయం నెరవేర్చేందుకు మడమతిప్పని నైజంతో చరిత్ర సృష్టించిన జగనన్న సంకల్పాన్ని ప్రజల్లోకి తీసుకెళుతున్న శ్రీమతి షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర అభిమాన హోలీగా మారింది. చిన్నపెద్ద, బీదగొప్ప తేడాలేకుండా ఆనందంతో ఆమె వెంట పరుగులు తీసిన జనంతో మరోప్రజాప్రస్థానం రంగుల హరివిల్లు తలపించింది. ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు జనం సంబరం అంబరాన్ని తాకింది. ఆమె నడిచిన దారులన్నీ జనప్రవాహమయ్యాయి. ఆమెను చూసిన జనం హృదయానందానికి హద్దే లేకుండా పోయింది.

జిల్లాలో శ్రీమతి షర్మిల పాదయాత్ర రెండోరోజు బుధవారం సెంట్రల్ నియోజకవర్గంలో సాగింది. పాత రాజరాజేశ్వరిపేట, న్యూ రాజరాజేశ్వరీపేట, పైపుల రోడ్డు, ప్రకాష్‌నగర్, శాంతినగర్, సింగ్‌నగర్, గవర్నమెంట్‌ప్రెస్, శివాజీకేఫ్ సెంటర్, బీఆర్టీస్ రోడ్డు, జింఖానా మైదానం వరకు పాదయాత్ర సాగింది. దారి పొడవునా ప్రజలు పూల వర్షం కురిపిస్తూ, మహిళలు హారతులు పడుతూ ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ప్రత్యేకంగా అలంకరించిన అశ్వవాహనం పాదయాత్ర ముందు బాగాన సాగింది. సింగ్‌నగర్ బహిరంగ సభ ప్రాంతంలో సెంట్రల్ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త పి. గౌతంరెడ్డి ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం గాలిలో చక్కర్లు కొడుతూ మహానేత వైయస్ కుటుంబంపై ఎనలేని అభిమానానికి ఆకాశమే హద్దని చాటింది. పోలీసులు మాత్రం పాదయాత్రలో ప్రత్యేకంగా అలంకరించిన గుర్రాలను, వాహనాన్ని అనుమతించలేదు. ప్రత్యేక విమానం నుంచి పూలజల్లును కూడా పోలీసులు అడ్డుకోవడంతో అభిమానులు మండిపడ్డారు.

జగనన్న వదిలిన బాణంగా వచ్చిన శ్రీమతి షర్మిల పాదయాత్రలో విల్లు ఎక్కిపెట్టారు. సింగ్‌నగర్ సభ ప్రాంతంలో ప్రత్యేకంగా తయారు చేయించిన త్రిశూలాన్ని ఆమె చేతపట్టారు. పార్టీ గుర్తులతో ఉన్న మరో త్రిశూలాన్ని కూడా ఆమెకు గౌతంరెడ్డి అందించారు. విల్లు ఎక్కుపెట్టి, త్రిశూలాన్ని చేతపట్టిన శ్రీమతి షర్మిల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిలపై విమర్శల అస్త్రాలు సంధించారు.

Back to Top