అభిమానపుటడుగులు.. ఆప్యాయతకు గురుతులు

అభిమానానికి హద్దులుండవు. దేశమైనా.. విదేశమైనా ఆప్యాయతను పంచుకోవడానికీ అంతే. ఇదే పునాదిగా వారు శ్రీమతి షర్మిల వెంట నడుస్తున్నారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.  రాష్ర్టంలో రాజన్న పాలన మళ్లీ రావాలన్నదే వారి కోరిక. సుదూర ప్రాంతాల్నుంచి వచ్చి.. కుటుంబాలకు దూరంగా... తిండితిప్పలను సైతం పక్కనపెట్టి డాక్టర్ వైయస్ఆర్ కుటుంబంతో చేయి కలిపారు.  మరోప్రజా ప్రస్థానం మైలురాయిలో తాము భాగస్వాములమవ్వాలని భావించారు. ఇడుపుల పాయనుంచి ఇచ్చాపురం వరకు తాము ఆమె వెన్నంటే ఉంటామని చెబుతున్నారు.

జగనన్న కోసమే: ఉప్పు వరప్రసాద్, దేవవరం, విశాఖ జిల్లా
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి కోసమే శ్రీమతి షర్మిల చేపట్టిన పాదయాత్ర లో పాల్గొంటున్నానని ఉప్పు వరప్రసాద్ చెప్పారు. ఆయన్ను ముఖ్యమంత్రిగా చూడాలనేదే తన కోరికన్నారు.  ఇడుపులపాయ నుంచి యాత్రలో పాల్గొంటున్నట్లు తెలిపారు. తన వృత్తి టైలరింగనీ, వైజాగ్ నుంచి కుటుంబానికి దూరంగా వుండి పాదయాత్రలో పాల్గొంటున్నాననీ వివరించారు. డాక్టర్ వైయస్‌ఆర్ మా పాలిటదైవమని చెప్పారు.  శ్రీ జగన్మోహన్‌ రెడ్డితో కలిసి పోలవరం దీక్షలో పాల్గొన్నాననీ, మరో ప్రజాప్రస్థానం పూర్తయ్యేవరకు యాత్రతోపాటే వుంటాననీ స్పష్టం చేశారు. శ్రీ జగన్ జైలునుంచి వచ్చిననాడే ఈ రాష్ట్రానికి సంపూర్ణ న్యాయం చేకూరుతుందని ప్రసాద్ స్పష్టంచేశారు.

ఆడబిడ్డకు తోడుండాలని: సన్నపురెడ్డి రమణమ్మ, నేలటూరు, ప్రకాశం జిల్లా
     నాన్న డాక్టర్ వైయస్ఆర్ ఆశయ సాధనకోసం.. అన్న శ్రీ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన మాటకోసం ఓ ఆడబిడ్డ పాదయాత్ర చేస్తూ ప్రజల్లో తిరుగుతుంటే.. నేనూ ఒక ఆడబిడ్డగా ఆమెతో కలిసి పనిచేస్తున్నానని సన్నపురెడ్డి రమణమ్మ చెప్పారు. ప్రతిమహిళా లక్షాధికారి కావాలని కలలుగన్న మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబం ప్రస్తుతం ఆపత్కాలంలో వుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి సమయంలో మాలాంటి సామాన్య ప్రజానీకం మద్దతు వారికి కావాలనీ, ప్రజాప్రస్థానం మొదలైనప్పట్నుంచీ నేను శ్రీమతి షర్మిలతో పాటే వుంటున్నాననీ చెప్పారు. యాత్ర ముగిసే వరకు ఆమెతోనే వుంటానని స్పష్టంచేశారు.

కాళ్లకు చెప్పుల్లేకుండా నడుస్తున్నా: గజ్జెల కృష్ణారెడ్డి, రొంపిచర్ల, గుంటూరు జిల్లా
     ప్రజా ప్రయోజనం కోసం పాదయాత్ర చేస్తున్న శ్రీమతి షర్మిలమ్మతో కలసి ఇడుపులపాయ నుంచి వస్తున్నానని గజ్జెల కృష్ణారెడ్డి చెప్పారు. ఇంతమంచి కార్యంలో కాళ్లకు చెప్పుల్లేకుండా పాల్గొనాలని నిర్ణయించుకున్నాననీ, అలాగే నడుస్తున్నాననీ తెలిపారు. గతంలో దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డితో కలిసి పాదయాత్రలో పాల్గొన్నాననీ, 560కిలో మీటర్లు ఆయనతో కలిసి చెప్పుల్లేకుండా నడిచాననీ వివరించారు. ఇలా నడిస్తేనే నాకు సంతృప్తిగా వుంటుందని కృష్ణారెడ్డి చెప్పారు.

వైయస్‌ఆర్‌తో కలిసి 750 కిలోమీటర్లు: బి. తిమ్మయ్య, పావురాలగుట్ట
     గతంలో దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఆయనతోపాటు 750 కిలోమీటర్ల దూరం నడిచానని తిమ్మయ్య చెప్పారు. ఆయనతో నాది ఆత్మీయానుబంధమని తెలిపారు. తనను చూడగానే మహానేత ఆప్యాయంగా పలకరించేవారన్నారు. ఆ మహానేత మనకు దూరమయ్యేసరికి ప్రభుత్వ, ప్రతిపక్షాలు కుట్రతో ఆయన కుటుంబాన్ని వేధిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. వెటర్నరీ విభాగంలో ఉద్యోగం చేస్తూ ఇటీవలే రిటైర్ అయ్యానన్నారు. తనలాంటి ఎందరో శ్రీమతి షర్మిలతో పాదయాత్రలో పాల్గొంటున్నారని చెప్పారు.

త్వరలో రాజన్న రాజ్యం: ముడిమారం మంగమ్మ, కీసర
     శ్రీమతి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర తలిరోజు నుంచి పాల్గొంటున్నట్లు ముడియారం మంగమ్మ తెలిపారు. నాలుగేళ్ళుగా డాక్టర్ రాజశేఖరరెడ్డి కుటుంబంతో కలిసి పనిచేస్తున్నానన్నారు. పాదయాత్రతో త్వరలో రాజన్న రాజ్యం రాబోతుందని చెప్పారు. అందులో ప్రజలే పాలకులన్నారు. ప్రజలమంతా ఏకమై నేడు స్వచ్ఛందంగా పాదయాత్రలో పాల్గొనేది ప్రజాధికార సాధన కోసమేనని పేర్కొన్నారు. 2014లో శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి  ముఖ్యమంత్రయి సమస్యలను పరిష్కరిస్తారని మంగమ్మ చెప్పారు.

లండన్ వదిలి.. పాదయాత్రకు: దవళి గిరిబాబు(ఎన్నారై)
     లండన్‌లో  సాఫ్టువేర్ ఇంజినీరుగా పనిచేసేవాడిననీ, సదాశయం కోసం శ్రీమతి షర్మిల చేపట్టిన పాదయాత్రకు మద్దతు తెలిపి ఆ కార్యక్రమంలో భాగస్వామిని కావాలనుకున్నాననీ దవళి గిరిబాబు అనే ఎన్నార్ఐ చెప్పారు. అందుకే  ఉద్యోగానికి రాజీనామా చేసి ఇక్కడకు వచ్చానన్నారు. విద్యావైద్య రంగాల్లో దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తెచ్చిన విప్లవాత్మక మార్పులను ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు.  వైయస్ పథకాలను కొనసాగించాలంటే శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. అప్పటివరకు పాదయాత్రలాంటి ఎలాంటి కార్యక్రమానికైనా పనిచేస్తానని గిరిబాబు చెప్పారు.

Back to Top