అభిమానం వాకిట షర్మిలమ్మ నడక

కారంపూడి(మాచర్ల):

రాజన్న బిడ్డను చూసేందుకు నడిచొచ్చిన ముదుసలులు.. జగనన్న చెల్లెల్ని చూడాలనే ఉత్సాహంతో మహిళలు.. యువతీయువకులు  కోలాహలంగా కదలి వచ్చారు. పాదయాత్రలో పాలుపంచుకున్నారు. శ్రీమతి షర్మిల చేపట్టిన పాదయాత్రలో మూడోరోజు పల్నాడు ప్రజల అభిమానం పొంగిపొర్లింది.
అక్కా.. నమస్తే..
శ్రీమతి షర్మిలకు గాదెవారిపల్లెలో చిన్నారులు నమస్తే అక్కా అంటూ అభివాదాలు చేశారు. తమ గ్రామానికి వచ్చిన ఆమెను చూసేందుకు రోడ్డుపైకి వచ్చి వేచి చూశారు. కొందరు డాబా ఎక్కి ఆమెను చూడగానే అబిమానంతో నమస్తే అక్కా అంటూ అభివాదం చేశారు.

పార్టీలో పలువురి చేరిక
జననేత శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల సమక్షంలో పలువురు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.  పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో దాచేపల్లి మాజీ మండలాధ్యక్షుడు అంబటి శేషగిరిరావు, తక్కెళ్ళపాడు మాజీ సర్పంచి, టీడీపీ నాయకుడు, కిచ్చంశెట్టి అంకయ్య, కేసానుపల్లికి చెందిన టీడీపీ నాయకులు బొల్లా శ్రీనివాసరావులను షర్మిల పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు. వీరితో పాటు 500 మంది పార్టీలో చేరారు. పార్టీలోకి చేరిన వారిలో నాయకులు జంగిలి నరసింహారావు, కిచ్చంశెట్టి లక్ష్మయ్య, టి.యలమందయ్య, టి.చలమయ్య, సాంబయ్య, జక్కా శ్రీనివాసరావు, సంజయ్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ షేక్ జాకీర్‌హుస్సేన్‌తోపాటు ముఖ్యనాయకులున్నారు.

రాజన్న బిడ్డను చూసేందుకు..
మహానేత రాజన్న కుమార్తె శ్రీమతి షర్మిలను చూసేందుకు గాదెవారిపల్లెకు చెందిన వికలాంగుడైన వెంకటేశ్వరనాయక్ వచ్చాడు. ఒంటికాలిపై అలాగే ఎదురు చూశాడు. రాజన్న చలువతో వికలాంగుల పింఛను అందుతోందని చెప్పారు.

మిర్చి రైతులకు భరోసా
పాదయాత్రగా నడుస్తున్న షర్మిల ఇనుపరాజుపల్లె గ్రామ సమీపాన ఆరబెట్టిన మిర్చి కల్లాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మిర్చి రైతులను పంట ఎలా పండిందని అడగ్గా.. రైతు కల్లాకుల కొండలు మాట్లాడుతూ నీటి, కరెంట్ సమస్యతో ఎకరాకు దిగుబడి పది క్వింటాలుకు మించి చేతికి దక్కలేదన్నారు. ఇప్పటికీ మిర్చికి సరైన ధర లేకపోవడంతో అప్పులతో ఆత్మహత్య చేసుకొనే పరిస్థితి ఏర్పడిందని రైతు ఆవేదనతో చెప్పారు. కొంతమంది రైతులు నీరు లేక ఎండి పోయిన మిర్చిమొక్కలను తీసుకొచ్చి శ్రీమతి షర్మిలకు చూపించారు. రైతు బాధలు జగనన్న అధికారంలోకి రాగానే తీరుతాయని ఆమె చెప్పారు.

చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు
శ్రీమతి షర్మిల పాదయాత్ర సందర్భంగా గాదెవారిపల్లె గ్రామంలోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రచ్చబండ కార్యక్రమం ముగించి ముందుకు నడిచిన ఆమె చర్చి వద్ద ఆగి లోపలికి వెళ్లారు. కొద్దిసేపు శిలువ ముందు మోకరిల్లి ప్రార్థనలు చేశారు.  షర్మిల చేపట్టిన పాదయాత్ర మూడోరోజు పల్నాడు ప్రజల అభిమానం మధ్య సాగింది.

తాజా వీడియోలు

Back to Top