అభిమానం నింపుకున్న ఆత్మీయ జనకెరటం

వీధులన్నీ జనకెరటాలే! ఊళ్ళన్నీ ఉరకలెత్తిన ఆత్మీయసంద్రాలే! మహానేత తనయ, జగనన్న సోదరి శ్రీమతి షర్మిల ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర పొడవునా జనం జాతరే.. శ్రీమతి షర్మిలకు ప్రతి హృదయం ప్రేమ కుసుమమై స్వాగతం పలుకుతోంది. రాజన్న రాజ్యమే ధ్యేయం అంటూ.. ప్రజా సంక్షేమమే లక్ష్యం అంటూ జగనన్న ఎక్కుపెట్టిన బాణం శ్రీమతి షర్మిల చెబుతున్న మాటలు విని పల్లెలన్నీ పులకిస్తున్నాయి. రాజన్న నాటి స్వర్ణయుగం మళ్ళీ రావడం ఖాయం అంటూ మురిసిపోతున్నాయి.

పెనుగంచిప్రోలు (కృష్ణాజిల్లా) : మరో ప్రజాప్రస్థానంలో శ్రీమతి షర్మిల శనివారంనాడు అనిగండ్లపాడు నుంచి పెనుగంచిప్రోలు, మక్కపేట శివారు వరకు పాదయాత్ర చేశారు. దారిలో మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడులో శ్రీమతి షర్మిలను కలిసిన రైతులు చెరుకూరి నాగేశ్వరరావు, రామకృష్ణ, కోలా శ్రీనివాసరావు ధాన్యం ధర దక్కక అప్పుల పాలు అవుతున్నామని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు.

వారి కష్టాలు సావధానంగా విన్న శ్రీమతి షర్మిల స్పందిస్తూ.. మనందరం కోరుకునే రాజన్న రాజ్యం సాధించే దిశగా జగనన్న మనలను ముందుకు నడిపిస్తారని భరోసా ఇచ్చారు. పెనుగంచిప్రోలు మండలంలోని శివాపురం రైతులు ధరవతు చిట్టెమ్మ, భాణావతు భద్రమ్మ, నూనావతు చిన్నా శ్రీమతి షర్మిలను కలిసి ఖమ్మం జిల్లా మధిరలోని కోల్డు స్టోరేజీలో గత ఏడాది జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 30 వేల టిక్కీల మిర్చి నష్టపోతే ఇంతవరకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వలేదని వాపోయారు. ఈ ప్రభుత్వానికి మనసు లేదని, జగనన్న రాకతో మన కష్టాలు తీరతాయని శ్రీమతి షర్మిల వారికి ధైర్యం చెప్పారు.

అభిమానానికి శ్రీమతి షర్మిల అభివాదం :
శ్రీమతి షర్మిల తమ గ్రామానికి రావాల్సిందే అంటూ ముచ్చింతల వాసులు పాదయాత్ర మార్గానికి ఎడ్లబండ్లను అడ్డుపెట్టారు. తమ ఊరికి శ్రీమతి షర్మిల వచ్చి తీరాల్సిందే అంటూ పట్టుబట్టారు. తాను ఇంకా చాలా దూరం పాదయాత్ర చేయాల్సి ఉందని నచ్చజెప్పడంతో వారు దారిచ్చారు. వారి అభిమానానికి అభివాదం చేసుకుంటూ శ్రీమతి షర్మిల ముందుకు సాగారు. దారిలో ఇటుకబట్టీ కూలీల పరిస్థితిని ఆమె అడిగి తెలుసుకున్నారు. పాదయాత్ర ముందుభాగంలో యువకులు బైక్‌లపై హుషారుగా వెళుతుంటే.. మహిళలు పెద్ద సంఖ్యలో శ్రీమతి షర్మిల వెంటే నడిచారు.

ఢిల్లీ చిన్నారి ఘటనపై నిరసన దీక్ష :
దేశ రాజధాని ఢిల్లీలో ఐదేళ్ల చిన్నారిపై జరిగిన అఘాయిత్యాన్ని నిరసిస్తూ వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ,‌ శ్రీమతి షర్మిల నిరసన దీక్ష చేశారు. అనిగండ్లపాడులో మహిళలతో నిర్వహించాల్సిన రచ్చబండ కార్యక్రమాన్ని రద్దుచేసుకుని, అక్కడే నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని పది నిమిషాల పాటు మౌనదీక్ష చేశారు. ఢిల్లీలో చిన్నారిపై జరిగిన దారుణాన్ని తెలుసుకుని వారు చలించిపోయారు. మహిళలకు రక్షణ కల్పించడంలో పాలకులు విఫలమవుతున్నారని వారు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.

చిరుజల్లులతో చల్లబడిన పుడమితల్లి :
ఒక్కసారిగా మారిన వాతావరణంతో కొద్దిసేపు గాలులతో కూడిన చిరుజల్లులు పడ్డాయి. దీనితో పుడమితల్లి చల్లబడింది. అనిగండ్లపాడు నుంచి పెనుగంచిప్రోలు వస్తూ మార్గ మధ్యంలో మధ్యాహ్నం శ్రీమతి షర్మిల కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. అదే సమయంలో గాలివాన వచ్చింది. శ్రీమతి షర్మిల బస చేసిన ప్రాంతంలో వేసిన టెంట్‌లు నేలకూలాయి. పాదయాత్ర ప్రారంభించే సమయానికి వాతావరణం కాస్త అనుకూలించింది. గాలివాన వచ్చినా అభిమాన జనం వెళ్లిపోకుండా శ్రీమతి షర్మిల రాక కోసం గంటల తరబడి ఎదురుచూశారు.

'బాబు 420' చలోక్తికి జనం నుంచి విశేష స్పందన :
పెనుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ సాక్షిగా చంద్రబాబును శ్రీమతి షర్మిల తూర్పారబట్టారు. తిరుపతమ్మ ఆలయం సమీపంలో జరిగిన సభలో శ్రీమతి షర్మిల మాట్లాడుతూ బాబుపై నిప్పులు చెరిగారు. ఈ రోజు చంద్రబాబు పుట్టిన రోజు అని, ఇది 4వ (ఏప్రిల్) నెల అని, 20వ తేదీ అని .. అంటే చంద్రబాబు 420 అని శ్రీమతి షర్మిల చలోక్తి విసరడంతో ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. జర్మన్ నియంత హిట్ల‌ర్‌ పుట్టింది కూడా ఇదే తేదీన అని, ఇద్దరూ అబద్ధాలను ప్రచారం చేయడంలో ఉద్దండులని శ్రీమతి షర్మిల విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. అబద్ధాలు ప్రచారం చేయడానికే గోబెల్సు అనే వ్యక్తిని మంత్రిగా నియమించింది హిట్లర్‌ అయితే.. చంద్రబాబు యెల్లో మీడియా ద్వారా అదే విధంగా అసత్య ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు.

బాబు చేసిన గ్లోబెల్సు ప్రచారాన్ని యెల్లో మీడియా ప్రచురించడం, వాటినే సిబిఐ, ఈడీలు తీసుకుని జగనన్నను ఇబ్బందిపెట్టేలా వ్యవహరించడాన్ని జనం గమనిస్తున్నారని హెచ్చరించారు. అధికార కాంగ్రెస్ అమ్ముడుపోయి‌న చరిత్రహీనుడు చంద్రబాబు అని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. బాబు, కిరణ్ కలిసి కుమ్మక్కు కుట్రలతో ప్రజలను మోసం చేస్తున్నారని, వారికి ప్రజలే తగిన గుణపాఠం నేర్పుతారని‌ శ్రీమతి షర్మిల అన్నారు.

తాజా వీడియోలు

Back to Top