అభిమాన జనసంద్రం ఉరకలెత్తిన పొందుగల

పొందుగల (గుంటూరు జిల్లా) : అభిమాన జనసంద్రం ఉవ్వెత్తున ఉరకలెత్తింది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రకు ఘనస్వాగతం పలికింది. శనివారం సాయంత్రబ గుంటూరు జిల్లాలో అడుగు పెట్టిన శ్రీమతి షర్మిలకు జిల్లా నలుమూలల నుంచి ముఖ్యంగా పల్నాడు నుంచి అశేష సంఖ్యలో తరలివచ్చిన వైయస్‌ఆర్‌సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పొందుగల నేల ఈనిందా! అన్నట్లుగా నిండిపోయింది.

నల్గొండ జిల్లా నుంచి వాడపల్లి - పొందుగల వారధి మీదుగా శనివారం సాయంత్రం శ్రీమతి షర్మిల పాదయాత్ర గుంటూరు జిల్లాలోకి ప్రవేశించింది. శ్రీమతి షర్మిల ఎప్పుడెప్పుడు తమ ప్రాంతానికి వస్తుందా అనే ఉత్కంఠతో జిల్లా నుంచి అభిమానులు ఉదయం నుంచే భారీ సంఖ్యలో దాచేపల్లి మండలం పొందుగలకు చేరుకున్నారు. అద్దంకి, నార్కెట్‌పల్లి హైవేపైన నాలుగు కిలోమీటర్ల మేర జనంతో కిక్కిరిసిపోయింది. గురజాల, మాచర్ల నియోజకవర్గాల నుంచి వేల సంఖ్యలో అభిమానులు శ్రీమతి షర్మిల పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చారు. జిల్లాలోని మిగిలిన 15 నియోజకవర్గాల నుంచి కూడా భారీ సంఖ్యలో వాహనాలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు.

బాణా సంచా పేలుళ్లు, కనక తప్పెటలు, డప్పు వాయిద్యాలతో ప్రదర్శనలు నిర్వహిస్తూ కార్యకర్తలు హోరెత్తించారు. షర్మిలమ్మ రాక కోసం పొందుగల వారధి వద్ద గంటల తరబడి కార్యకర్తలు ఉత్సాహంగా నిరీక్షించారు. శనివారం సాయంత్రం 4.15 గంటల సమయంలో శ్రీమతి షర్మిల పాదయాత్ర వారధి మీదకు ప్రవేశించగానే అభిమానుల హర్షధ్వానాలు మిన్నంటాయి.‌ వైయస్‌సిపి జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, కేంద్రపాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి‌ శ్రీమతి షర్మిలకు ఎదురేగి స్వాగతం పలికారు.

రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన లారీలు, బస్సులు, కారులు తదితర వాహనాలపై కూర్చొని ఉన్న కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేసుకుంటూ శ్రీమతి షర్మిల ముందుకు సాగారు. ఈ సమయంలో సుమారు మూడు కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరారు. రోడ్డు పక్కన ఉన్న ఇళ్లు, దుకాణాలు మహిళలు, పిల్లలతో కిక్కిరిసిపోయాయి. అందరికీ శ్రీమతి షర్మిల అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. పొందుగల గ్రామ కూడలిలో ఉన్న మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి‌ ఆమె నివాళులర్పించారు. అనంతరం మరో ప్రజాప్రస్థానం వాహనంపై నుంచి శ్రీమతి షర్మిల ప్రసంగించారు. కిరణ్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

రైతుల సమస్యలను శ్రీమతి షర్మిల ఎక్కువగా ప్రస్తావించడంతో వారి నుంచి పెద్ద ఎత్తుర హర్షం వ్యక్తం అయింది. ముఖ్యంగా పులిచింతల ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న జాప్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. డెల్టా ఆధునికీకరణ, సాగర్ ఆధునికీకరణ ఆవశ్యకతను ‌ఈ ప్రభుత్వం గుర్తించడం లేదని దుయ్యబట్టారు. మహానేత వైయస్ హయాంలో పత్తి, మిర్చి రైతులకు అనేక రాయితీలు అందుబాటులోకి వచ్చాయని, కోల్డు స్టోరేజి ప్లాంట్ల నిర్మాణాల వల్ల రైతులు తమ ఉత్పత్తులను గిట్టుబాటు ధర వచ్చేవరకు నిల్వ చేసుకుని,‌ ఆ తరువాత అమ్ముకుని లబ్ధి పొందారని చెప్పారు. గుంటూరు మిర్చి యార్డు అగ్నిప్రమాదానికి గురైనప్పుడు, వెంటనే తిరిగి నిర్మించి, మహానేత రైతులను ఆదుకున్నారని గుర్తుచేశారు.

 ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై శ్రీమతి షర్మిల విమర్శల ఘాటు పెంచారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని పది‌ వేలకు పెంచుతానని సిఎం కిరణ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలే‌దని, నీలం తుపానులో రైతులు రూ. 600 కోట్లు నష్టపోతే, ఈ ప్రభుత్వం కేవలం రూ.17 కోట్లు ఇచ్చి సరిపెట్టుకుందని ఆరోపించారు. చంద్రబాబుపై శ్రీమతి షర్మిల వ్యంగ్యాస్త్రాలు విసిరినప్పుడు జనం ఈలలు, చప్పట్లతో తమ మద్దతు తెలిపారు. చంద్రబాబుకు మళ్లీ అధికారం ఇస్తే ప్రజల పరిస్థితి అధోగతే అన్నారు. అబద్ధాలు తప్ప నిజాలు చెప్పడం చంద్రబాబుకు చేతకాదన్నారు. బహిరంగ సభ తరువాత శ్రీమతి షర్మిల శ్రీనగర్ సమీపంలోని శ్రీనివాసపురం అడ్డరోడ్డు వద్ద ఏర్పాటు చేసిన బస వరకు పాదయాత్ర చేశారు.‌

శ్రీమతి షర్మిలకు స్వాగతం పలికిన వారిలో పార్టీ శాసన సభాపక్ష ఉపనేత మేకతోటి సుచరిత, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్‌కే), రావి వెంకట రమణ, కోన రఘుపతి, జిల్లా ఇన్‌చార్జి గౌతమ్‌రెడ్డి, గుంటూరు నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి, యువజన విభాగం జిల్లా కన్వీన‌ర్ కావటి మనోహ‌ర్‌ నాయుడు, నన్నపనేని సుధ, దేవళ్ళ రేవతి, మేరుగ నాగార్జున, యెనుముల మురళీధర్‌రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నూతలపాటి హనుమయ్య, షేక్ ముస్తఫా, షౌక‌త్, ఆరిమండ వరప్రసాదరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, చిట్టా విజయభాస్కరరెడ్డి, గుత్తికొండ అంజిరెడ్డి, మందపాటి శేషగిరిరావు, కొల్లిపర రాజేంద్రప్రసా‌ద్, అనూ‌ఫ్, చింతా సుబ్బారెడ్డి తదితరులు‌ ఉన్నారు.
Back to Top