అభిమాన తరంగం.. మమతల అనుబంధం

రాజానగరం, 07 జూన్ 2013: పల్లెల్లో  జనం ఉరకలెత్తారు.  మహానేత డాక్టర్ వైయస్ఆర్ కుమార్తెను చూసేందుకు  పరుగులు తీస్తూ వచ్చారు. శ్రీమతి షర్మిలను ఇంటి ఆడపడుచులా ఆదరించారు. కష్టాలు చెప్పుకొనేందుకు బారులు తీరారు.

ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న కాంగ్రెస్, ప్రతిపక్ష నేతగా దానికి మద్దతుగా నిలుస్తున్న చంద్రబాబుల కుటిల రాజకీయాలకు నిరసనగా వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ జిల్లాలో మూడోరోజు రాజానగరం నియోజకవర్గంలోని పల్లెల మీదుగా సాగింది. బుధవారం రాత్రి మధురపూడి ఎయిర్‌పోర్టు సమీపంలోని బత్తుల సత్తిరాజు తోటలో బస చేసిన శ్రీమతి షర్మిల గురువారం ఉదయం పదిగంటలకు పాదయాత్రను ప్రారంభించారు. వేలాదిగా తరలి వచ్చిన మెట్టవాసులు ఆమె వెంట అడుగులో అడుగు వేస్తూ కదం తొక్కారు. వందలాది ఆటోలు, మోటార్ బైకులతో ర్యాలీగా పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. యువకులుదారిపొడవు నా జగన్నినాదాలతో హోరెత్తించారు. జనం పలుచోట్ల షర్మిలపై పూలవర్షం కురిపించి, పూలబాటపై నడిపించి అభిమానాన్ని చాటుకున్నారు. బూరుగుపూడి, బూరుగుపూడి జంక్షన్ ల మీదుగా సాగిన పాదయాత్ర దోసకాయల పల్లిలో భోజన విరామానంతరం సాయంత్రం నాలుగున్నరకు తిరిగి ప్రారంభమై నందరాడ, నరేంద్రపురాల మీదుగా రాజానగరం చేరుకుంది.

దారిపొడవునా బస్సులు, ఆటోల్లో ప్రయాణికులతో పాటు ద్విచక్ర వాహనదారులు శ్రీమతి షర్మిలతో  కరచాలనానికి పోటీ పడ్డారు. ప్రతి చోటా మహిళలు, వృద్ధులు ఎదురేగి స్వాగతం పలికారు. పలుచోట్ల శ్రీమతి షర్మిల చిన్నారులను, మహిళలను అక్కున చేర్చుకుని ముద్దాడగానే వారి కళ్లల్లో ఆనందం తొణికిసలాడింది. మహిళలు ఆమెతో నడిచేందుకు పోటీ పడ్డారు. ప్రతి ఒక్కర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ, వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ  ముందుకు సాగారు. రాజానగరం గాంధీబొమ్మ సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆమె జగన్‌ను ఇబ్బందుల పాల్జేసేందుకు కాంగ్రెస్, టీడీపీలు చేస్తున్న కుట్రలను తూర్పారబట్టినప్పుడు ప్రజ లు హర్షధ్వానాలు చేశారు. చంద్రబాబుపై తనదైన రీతిలో విమర్శనాస్త్రాలు సంధించినప్పడు కేరింతలు కొట్టారు. షర్మిల మూడవరోజు పాదయాత్ర ముగించుకొని రాత్రి 7.30 గంటలకు రాజానగరం పోలీస్ స్టేషన్ సమీపంలోని పూసర్లరావుకు చెందిన స్థలం చేరుకుని అక్కడే బస చేశారు.

పింఛన్ ఆపేశారక్కా..
‘మహానేత మరణానంతరం నాకు పింఛన్ ఆపేశారక్కా’ అంటూ వన్నెం భవాని అనే 13 ఏళ్ల వికలాంగురాలు నందరాడ గ్రామంలో శ్రీమతి షర్మిలకు తన గోడు వెళ్లబోసుకుంది. ఆమె పరిస్థితిని చూసి చలించిపోయిన శ్రీమతి షర్మిల ‘త్వరలోనే రాజన్న రాజ్యంవస్తుంది.. మళ్లీ నీకు పింఛన్ వస్తుంది’ అని అనునయించారు. ‘నన్ను ఎవరూ చూడడం లేదు. పింఛన్ డబ్బుల పైనే ఆధారపడి జీవిస్తున్నాను. ఇప్పుడు ఆ డబ్బులు కూడా సరిగా ఇవ్వడం లేదు. ఆదుకోమ్మా’ అంటూ వక్కలగడ్డ రామలక్ష్మి అనే మహిళ దీనంగా కోరగా ఆమెను దగ్గరకు తీసుకొని ధైర్యం చెప్పారు. దోసకాయలపల్లి మామిడి తోటల్లో పనిచేసే కూలీలు శ్రీమతి షర్మిలకు ఎదురొచ్చి మామిడిపండ్లబుట్టను అందజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Back to Top