ఆపద మొక్కులపై రాజకీయ దృక్కులు

ఆనంద నిలయం ఆవరణలో ఒక్క క్షణం పాటు స్వామిని చూసిన అనుభూతిని నెమరేసుకుంటున్న సామాన్యుడికి  ఎంతో తృప్తి మిగులుతుంది.  తరచి చూసుకుంటే 2000కోట్ల రూపాయల వార్షిక ప్రణాళికతో ప్రపంచంలోనే సంపన్నుడైన దేవుడిగా పేరొందిన వేంకటేశ్వరస్వామిని తనవి తీరా కొలుచుకునే భాగ్యం ప్రస్తుతం సామాన్యుడికి లేదని అంశం తెలిసివస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో దైవత్వం కంటే రాజకీయం ఎక్కువగా రాజ్యమేలడం కనిపిస్తుంది. భక్తి ప్రపత్తులతో స్వామిని కొలవాల్సిన పాలకమండలి నియామకంలో దీని ప్రభావం గోచరిస్తుంది. తాజాగా శనివారం రాత్రి ప్రకటించిన ట్రస్టు బోర్డు కూడా దీనినే రుజువు చేసింది. ముఖ్యమంత్రి జేబు సంస్థగా మారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తాయి.

వారి శత్రుత్వం.. ఆయనకు వరం


చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన జి. వి. శ్రీనాధరెడ్డి నియామకం వెనుక పెద్ద కథే ఉంది.  పుంగనూరు ప్రస్తుత  ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డితో ముఖ్యమంత్రి కిరణ్­కుమార్ రెడ్డికి ఉన్న శత్రుత్వం శ్రీనాధరెడ్డికి వరంగా పరిణమించింది. రెండేళ్ళ క్రితం తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన ద్వారా రామచంద్రారెడ్డికి చెక్ పెట్టాలనేది ముఖ్యమంత్రి వ్యూహం. 1999, 2004 ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీచేసిన శ్రీనాధ్ రామచంద్రారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. నియోజకవర్గాల వికేంద్రీకరణ నేపథ్యంలో వాయల్పాడు నియోజకవర్గం పీలేరులో కలిసిపోయింది. కిరణ్ కోసం రామచంద్రారెడ్డి 2009లో పుంగనూరుకు మారారు. తదుపరి  ఆయన వైయస్ జగన్‌మోహనరెడ్డి పక్షం వహించారు. ఇది ముఖ్యమంత్రికీ ఆయనకు మధ్య అగాధాన్ని సృష్టించింది. తత్ఫలితంగా తాజా టీటీడీ బోర్డు నియామకాల్లో శ్రీనాధరెడ్డికి అవకాశం దక్కింది.

చిరంజీవి బంధుప్రీతి
ప్రజారాజ్యం పార్టీని గంపగుత్తగా కాంగ్రెసులో కలిపేసి భారాన్ని దించేసుకున్న మాజీ మెగాస్టార్ చిరంజీవి బోర్డులో తన బంధువుకు ఎర్ర తివాచీ పరి‌పింప చేసుకున్నారు. తన వియ్యంకుడు  ఎల్.ఆర్. శివప్రసాద్‌ను బోర్డు సభ్యునిగా నియమింపజేసుకున్నారు. ఈ ఏడాది మే నెలలో ఆదాయ పన్ను శాఖ నిర్వహించిన దాడులలో చెన్నయిలోని ఆయన ఇంట్లో లెక్కలు చూపని రూ. 35 కోట్ల రూపాయలను పట్టుబడిన సంగతి తెలిసిందే. శివప్రసాద్ టీటీడీ బోర్డు సభ్యుడుగా నియమితులు కావడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. ఉప్పల్, మంగళగిరి, పి.గన్నవరం ఎమ్మెల్ల్యేలు రాజిరెడ్డి, కె.కమల, పి. రాజేశ్వరి కూడా సభ్యులుగా నియమితులయ్యారు. గుంటూరు జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు రాయపాటి సాంబశివరావుకు టీటీడీ బోర్డు అధ్యక్ష పదవి దక్కుతుందని ఎంతో మంది ఊహించారు. అలా కాకుండా ఈసారి అదే జిల్లాకు చెందిన కమలను సభ్యురాలిగా తీసుకోవడం ఆసక్తి కలిగించింది.

ముఖ్యమంత్రులకు అనుయాయులుగా పేరుపడ్డవారికి మాత్రమే ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో అధికారాన్ని చెలాయించే అవకాశం దక్కుతూ వస్తోంది. అందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి కూడా. ఈ అంశంలో ఎన్టీరామారావుకు కూడా మినహాయింపు లేదు. ఆయన బంధువైన కాకతీయ సిమెంట్ అధినేత వెంకటేశ్వర్లును బోర్డు అధ్యక్షునిగా నియమించారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా తన అనుయాయులు శ్రీనివాసులు, మహదేవనాయుడులకు బోర్డు సభ్యులుగా అవకాశం కల్పించారు. అమెరికాతో న్యూక్లియార్ బిల్లు ఒప్పందానికి సంబంధించిన అంశంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు తిరుపతి ఎంపీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన డి.కె. ఆదికేశవులునాయుడు  అధికార పక్షానికి ఓటేసి, తదుపరి టీటీడీ బోర్డు అధ్యక్ష పదవిని కానుకగా అందుకున్నారు.


శ్రీవారికి అధ్యక్షుని పంగనామాలు

బోర్డులో ఆధ్యాత్మికతకు తావే లేకపోయిందని భారతీయ జనతా పార్టీకి చెందిన భానుప్రకాశ్ ఆవేదన ఎంత హేతుబద్ధమో తాజా నియామకాలు రుజువుచేశాయి. ఛైర్మన్ కనుమూరి బాపిరాజు పద్మావతి అతిథి గృహంలో తన పేర 9 గదులను కేటాయించుకున్నారనీ, దీనివల్ల దేవస్థానానికి ఏటా కోటి రూపాయల నష్టం వాటిల్లుతోందనేది ఆయన ఆరోపణ. ఆ గదులను విడిచిపెట్టాలని మూడు నెలలుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ ఆయన నుంచి కనీస స్పందన లేదని భానుప్రకాశ్ ధ్వజమెత్తారు. బోర్డు సభ్యులకు  సిఫార్సు లేఖలు ఇచ్చే అధికారం మినహా మరేమీ లేదనీ, వీరికి వాహనాలు, వీఐపీ కాటేజీలు కేటాయించుకుంటారనీ దీనివల్ల దేవస్థానానికి కోట్లాది రూపాయలు నష్టం మినహా ఒరిగేదేమీ లేదని టీటీడీ బోర్డు మాజీ సభ్యుడయిన భానుప్రకాశ్ విశ్లేషించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం పేరు వింటేనే ఆధ్యాత్మిక భావన వెల్లువెత్తుతుంది. గోవింద నామం అప్రయత్నంగా నోటి వెంట జాలువారుతుంది. ఓం నమో వెంకటేశాయ.. ఓం  నమో వెంకటేశాయ అనే పదాలు చెవుల్లో మార్మోగుతూ భక్తిభావాన్ని అప్రయత్నంగానే కలిగించే వాతావరణం రాజ్యమేలే పరిసరాలు రాజకీయ సర్ప పరిష్వంగంలో నలిగిపోతున్నాయి.  ఆపదమొక్కుల వాడికి ఏం మొక్కుకుంటే ఈ సప్తగిరులకు ఈ కౌగిలినుంచి విముక్తి లభిస్తోందో ఆయనే సూచించాలి.

 

Back to Top