481 ఎకరాలకు పక్కా స్కెచ్‌

* సీఆర్‌డీఏ అధికారుల అండతో దోచుకునే యత్నం
* సేకరణకూ, కేటాయింపులకు భారీ వ్యత్యాసం 
* పాపాల పుట్టగా అమరావతి భూసేకరణ


మళ్లీ గెలవడం అసాధ్యమని బాబుకు అర్థమైపోయింది. అందుకేనేమో యథేశ్చగా రాష్ట్రాన్ని దోచేస్తున్నారు.  ఎవరేమన్నా అనుకోనీ..మేం చేయాల్సింది చేస్తాం... మాక్కావాల్సింది మేం దక్కించుకుంటామంటూ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. బాబు దుబారా ఖర్చులపై జోరుగా విమర్శలు వెల్లువెత్తినా ఆయన ఏమాత్రం వెనక్కితగ్గడం లేదు. అన్నీ వదిలేసినోడికి సిగ్గుదేనికని నిన్నటికి నిన్న ఐదు క్యాంపు కార్యాలయాలకు రూ. 80 కోట్లు ఖర్చు చేశాడని వార్తలు వచ్చినా తెల్లారగానే మరో రూ. 90 లక్షలు జూబ్లీహిల్స్‌ క్యాంపు ఆఫీస్‌కు కేటాయిస్తూ జీవో విడుదలైంది. ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. ఇదంతా బాబు తన సొంత అవసరాల కోసం చేస్తున్న ఖర్చు. ఇక కుంభకోణాల విషయానికొస్తే ఎన్నిలక్షల కోట్లు అవినీతి జరుగుతుందో చెప్పాల్సిన పనిలేదు. 

కేటాయింపుల్లో భారీ తేడాలు..
రాజధానిలో తాజాగా మరో భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రాజధానిలో మొత్తం భూమిలో 481 ఎకరాలకు లెక్కలు తేలడం లేదు. ఇటీవల వివిధ సంస్థలకు చేసిన కేటాయింపుల్లో ఈ వ్యవహారం బయటపడింది. రాజధాని నగరంలో 53,747 ఎకరాల భూములున్నాయి. వీటిని ఎలక్ట్రానిక్‌ సిటీ, ఐటీ సిటీ అంటూ తొమ్మిది నగరాలకు కేటాయించారు. కేటాయించిన మొత్తం భూమిని  ఎక్కడా తేడా రాకుండా సీఆర్‌డీఏ అధికారులు మాయ చేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం తొమ్మిది నగరాలకు 53,779 ఎకరాలు కేటాయించారు. ఇక్కడ సుమారు 32 ఎకరాలు అదనంగా జొప్పించారు. ఇదెక్కడి నుండి వచ్చిందనే దానిపై స్పష్టత లేదు. అదనంగా ఎందుకు కలిపారనే దానిపైనా అధికారుల వద్ద సమాధానం లేదు. 53,266 ఎకరాలను మాత్రమే కేటాయింపుల్లో చూపారు. అంటే 481 ఎకరాలను రికార్డుల్లో కనబడకుండా చేశారు. రాజధానిలో తొమ్మిది నగరాల్లోనూ ప్రతి నగరంలో భవిష్యత్‌ అవసరాలు, నివాసాలు, ఓపెన్‌స్పేస్, రిక్రియేషన్, వాణిజ్యం, స్పెషల్‌జోన్ల పేరుతో భూమిని విభజించారు. ఉన్న గ్రామాలతో సహా మొత్తం భూమిని పంచేసిన అధికారులు, 481 ఎకరాలు ఎందుకు ఎవరి కోసం మిగిల్చారనేది తేలాల్సి ఉంది.  కేటాయించిన ఈ భూముల్లో ఉన్నదానికంటే 32 ఎకరాలు అదనంగా కలిపిన అధికారులు విభజనకు వచ్చేసరికి లెక్కలతో జిమ్మిక్కు చేశారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన భూ కేటాయింపుల నివేదికలో ఎలక్ట్రానిక్స్‌ సిటీకి 6582 ఎకరాలు కేటాయించారు. దీనిలో నివాస ప్రాంతాలకు 1862 ఎకరాలు, పరిశ్రమలకు 1618, ఓపెన్‌ స్పేస్‌ అండ్‌ రిక్రియేషన్‌కు 757, కమర్షియల్‌కు 682, స్పెషల్‌ జోన్లకు 645, రిజర్వుకు 503 ఎకరాలు కేటాయించారు. ఈ మొత్తం కలిపితే 6067 ఎకరాలు మాత్రమే వచ్చింది. ఇక్కడే అధికారులు తమ చాతుర్యాన్ని ప్రదర్శించారు. మిగుల భూమి 515 ఎకరాలను రికార్డుల్లో చూపించాల్సి ఉన్నా అటువంటిదేమీ చేయకుండా వదిలేశారు. భవిష్యత్‌లో వాటాలు పంచుకుని అమ్ముకున్నా కేటాయించిన భూమి లెక్కలు చూపించి భూమి మిగల్లేదని నమ్మించొచ్చనే ఎత్తుగడ వేసినట్లు స్పష్టమవుతోంది. 

వాస్తవ కేటాయింపుల్లోనూ అస్పష్టత 
రాజధాని నగరంలో భూ కేటాయింపులపై ఇప్పటికీ స్పష్టత కరువవుతోంది. రాజధాని మొత్తంగా 53,747 ఎకరాలు ఉందని పేర్కొనగా ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన కేటాయింపుల్లో 53,779 ఎకరాలకు పంపకాలు చేసినట్లు చూపించారు. ప్రాజెక్టు లెక్కల ప్రకారం 15,671 ఎకరాలు నివాస ప్రాంతాలకుగానీ, ఉన్న నివాసాలకుగానీ వెళుతుంది. నూతన కేటాయింపుల్లో 17306 ఎకరాలు నివాస ప్రాంతాలకు కేటాయించినట్లు చూపించారు. ఇది ప్రాజెక్టు నిబంధనలకు విరుద్ధం. మొత్తం ప్రాజెక్టులో చూస్తే ఇది నివాస ప్రాంతాలకు కేటాయించాల్సిన దానికన్నా 1643 ఎకరాలు ఎక్కువగా ఉంది. ఎందులో కుదించినా అది మొత్తం ప్రాజెక్టు ప్లానుపై ప్రభావం పడుతుంది. వాణిజ్య అవసరాలకు 6143 ఎకరాలు కేటాయించాల్సి ఉండగా 5370 ఎకరాలు మాత్రమే కేటాయించినట్లు చూపించారు. 773 ఎకరాలు కుదించారు. రాజధానిలో వేసవి తీవ్రతను తగ్గిస్తామని, దీనికోసం పెద్ద ఎత్తున భూములు కేటాయిస్తున్నామని చెబుతున్నా ఆచరణలో మాత్రం నిబంధనల ప్రకారం కేటాయించాల్సిన భూమికంటే తక్కువ కేటాయించారు. ఓపెన్‌ స్పేస్‌ అండ్‌ రిక్రియేషన్‌కు 16,710 ఎకరాలు కేటాయించాల్సి ఉండగా 15,810 ఎకరాలు కేటాయించారు. 900 ఎకరాలు తగ్గించారు. ఉపాధిని కల్పించే పరిశ్రమల ఏర్పాటులోనూ ఇదే పద్ధతి అనుసరించారు. రాజధానిలో 2716 ఎకరాలు పరిశ్రమలకు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నా ప్రస్తుతం కేటాయింపుల్లో 2290 ఎకరాలు మాత్రమే ఇచ్చా రు. 426 ఎకరాలు తగ్గించారు. వాణిజ్య స్థలాలకు పూలింగు నిబంధనల ప్రకారం 6143 ఎకరాలు కేటాయించాల్సి ఉంది. అయితే 5,370 ఎకరాలు కేటాయించారు. దీనిలోనూ 573 ఎకరాలు కోతపెట్టారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రిజర్వు కోసం 7744 ఎకరాలు కేటాయిస్తున్నట్లు తొలుత ప్రకటించారు. ప్రస్తుతం దాన్ని 6576 ఎకరాలు కేటాయించి 1166 ఎకరాలను తగ్గించారు. స్పెషల్‌జోన్‌కు 2037 ఎకరాలు కేటాయించారు. ప్రస్తుతం దాన్ని 5,550 ఎకరాలకు పెంచారు. నిబంధనల ప్రకారం వేర్వేరు విభాగాల నుండి తగ్గించి స్పెషల్ జోన్‌కు కేటాయించారనుకున్నా ఆయా విభాగాల్లో తగ్గించిన భూమి 3,838 ఎకరాలుంది. దీన్ని స్పెషల్‌ జోన్‌కు కలిపారనుకున్నా 323 ఎకరాలు ఇంకా మిగిలే ఉంటుంది. ఈ భూమిని దేనికి కేటాయించారనే అంశంపై మొత్తం ప్రణాళికలో స్పష్టత లేదు. చట్ట ప్రకారం కేటాయించాల్సిన భూముల కేటాయింపులో కోత పెట్టే అధికారం సీఆర్‌డీఏకు లేదు. 
Back to Top