మరో ప్రజాప్రస్థానంకు నాలుగు వసంతాలు

()దేశ చరిత్రలోనే సంచలన రికార్డ్..!
()9నెలల పాటు వేల కి.మీ.యాత్ర..!
()రాజన్న తనయ, జగనన్నసోదరికి జననీరాజనం

దివంగత ముఖ్యమంత్రి ప్రియతమ నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయ, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి  వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం యాత్ర  నాలుగు వంసతాలు పూర్తిచేసుకుంది. ఇడుపుల పాయ నుంచి ఇచ్చాపురం వరకు వైయస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం యాత్ర ప్రభంజనం సృష్టించింది. వైయస్ఆర్ స్ఫూర్తితో వైయస్ జగన్ వదిలిన బాణంగా 18-10-2012న షర్మిల తన యాత్రను నిర్విరామంగా కొనసాగించారు. ఆనాడు కాంగ్రెస్, టీడీపీలు చేసిన కుట్రలపై  ఎలుగెత్తుతూ ఆమె సాగించిన ప్రజాప్రస్థానం యాత్ర అప్పట్లో రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. పల్లెపల్లెన గడగడపలో రాజన్న బిడ్డ, జగన్ అన్న సోదరిని అక్కున చేర్చుకొని ఆదరించింది.  షర్మిల 9 నెలలపాటు 14 జిల్లాల్లో 116 నియోజకవర్గాల మీదుగా 3,112 కిలోమీటర్లు పాదయాత్ర చేసి... దేశ రాజకీయ చరిత్రలోనే సంచలన రికార్డు నెలకొల్పారు. 

మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర తుది మజిలీ అయినా, తనయుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండో విడత ఓదార్పు యాత్ర ప్రారంభ ప్రాంతమైనా, తనయ షర్మిల మరో ప్రజాప్రస్థానం ముగింపు అన్నీ ఇచ్చాపురంలో జరగడం ఆశ్చర్యదాయకం. అలా వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంతో బంధం పెనవేసుకుంది. షర్మిల పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభ, స్తూపావిష్కరణ కార్యక్రమాల సందర్భంగా ఇచ్ఛాపురం జనసంద్రంగా మారింది. 
 
వైయస్ఆర్ పాదయాత్ర స్ఫూర్తితో..!
 ‘‘ప్రజా సమస్యలు పట్టించుకోని ఆనాటి ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం కాంగ్రెస్‌తో కుమ్మక్కై చేస్తున్న నీచమైన రాజకీయాలను ఎండగడుతూ, దేవుని దీవెనలతో, నాన్న ఆశీస్సులతో ఇడుపులపాయ నుంచి జగనన్న వదిలిన ఈ బాణం 3,112 కిలో మీటర్లు ప్రయాణించి ఈ రోజు గమ్యం చేరుకుంది. వైయస్సార్ చేసిన ప్రజాప్రస్థానమే జగనన్న తరఫున చేసిన ఈ మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు స్ఫూర్తి. సరిగ్గా 10 ఏళ్ల కిందట వైయస్సార్ తన పాదయాత్రను ఒక మహాయజ్ఞంలా, మండుటెండలో రోజుకు 20 నుంచి 25  కిలోమీటర్లకుపైగా నడిచి ప్రజలతో మమేకమయ్యారు. ప్రజల కష్టాలను కళ్లారా చూశారు. అందుకే వైయస్సార్ ముఖ్యమంత్రి అయిన మరు నిమిషం నుంచి ప్రతి క్షణం ప్రజల గురించే ఆలోచన చేశారు. కులాలకు, మతాలకు, పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా ఆలోచన చేసి అద్భుత పథకాలు ప్రవేశపెట్టారు. మహానేత వైయస్సార్ ఆ వేళ  చేసిన ప్రజాప్రస్థానం పాదయాత్రకు కొనసాగింపే మా పాదయాత్ర. ఈ 230 రోజులు, ఈ 3,112 కిలోమీటర్లు, ఆయా ప్రాంతాల్లో, ఆయా జిల్లాల్లో  ఆయా గ్రామాల్లో మాతో పాటు కదంతొక్కి, మాకు అండగా నిలబడిన ప్రతి అక్కకూ, చెల్లికి, అవ్వకూ, తాతకు, ప్రతి సోదరునికి, సిబ్బందికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.’’ అని షర్మిల ముగింపు సభలో పేర్కొన్నారు. 
 
 మహానేత జ్ఞాపకాలు.. ఉద్విగ్న క్షణాలు..
 అక్టోబర్ 18న వైయస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి మొదలైన షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోని వైయస్సార్ ‘విజయవాటిక’ వద్ద ముగిసింది.  అది వైయస్సార్ నడిచిన ప్రాంతం. ‘ప్రజాప్రస్థానం’ పేరుతో వైయస్సార్ 68 రోజుల్లో 1,473 కిలోమీటర్లు నడిచి జయకేతనం ఎగురవేసిన స్థలం. వైయస్సార్‌కు జయజయధ్వానాలు పలికిన ప్రదేశం. వైయస్ జ్ఞాపకాలన్నింటినీ పదిలంగా దాచుకున్న ఆ ప్రదేశానికి రాగానే షర్మిల ఉద్వేగానికి గురయ్యారు. ఉబికి వస్తున్న ఉద్వేగాన్ని గుండెల్లో దాచుకొని, చెరగని చిరునవ్వుతో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వైయస్సార్ విజయ వాటిక వద్దకు చేరుకొని ఆయనకు నివాళి అర్పించారు. అక్కడితో 3,112 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయింది. అక్కడ్నుంచి ‘విజయవాటిక’కు ఎదురుగా ఏర్పాటు చేసిన మరో ప్రజాప్రస్థానం ముగింపు చిహ్నం ‘విజయ ప్రస్థానం’ స్తూపం వద్దకు వెళ్లారు. స్తూపాన్ని ఆవిష్కరించారు. అనంతరం వేదిక మీదకు వచ్చి బహిరంగ సభలో ప్రసంగించారు.

Back to Top