బాబు నిర్వాకం ... రోడ్డున పడిన 20 వేల కుటుంబాలు

 –  దాదాపు 21 వేల సాక్షర భారత్‌ కార్యకర్తలను తొలగించిన ప్రభుత్వం

– కేంద్రం ఇచ్చిన నిధులు దారి మళ్లించిన బాబు సర్కార్‌

– టీడీపీ కార్యకర్తలను నియమించే యోచన 

 బాబొస్తే జాబొస్తది అని ప్రచారం
చేసుకుని అధికారమైతే చేపట్టాడు కానీ.. నాలుగేళ్లుగా నిరుద్యోగులకు, ఉద్యోగులకు
చంద్రబాబు నిద్రలేకుండా చేస్తున్నాడు. ఐటీ సిటీలు, భారీ పరిశ్రమలు, కోట్లల్లో
ఉద్యోగాలని నాలుగేళ్లు ఊదరగొట్టిన లోకేష్, చంద్రబాబు ద్వయం.. చివరకు ఉన్న
ఉద్యోగాలను పీకేసి పాపం మూటగట్టుకుంటున్నారు. వయోజనులను అక్షరాస్యులుగా
తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ సాక్షర భారత్‌ పథకంలో పనిచేస్తున్న
సిబ్బందిపైనా చంద్రబాబు కన్ను పడింది.  భాగంగా రాష్ట్రంలోని ‘ఏపీ స్టేట్‌ లిటరసీ
మిషన్‌ అథారిటీ’ పరిధిలో పని చేస్తున్న సుమారు 21 వేల మంది జిల్లా, మండల, గ్రామ సమన్వయకర్తలను
నిర్దాక్షిణ్యంగా విధుల నుంచి తొలగించింది. ఆ స్థానంలో అధికార పార్టీ కార్యకర్తలను
నియమించి, వచ్చే ఎన్నికల్లో ప్రయోజనం పొందేలా వ్యూహం రచించింది. 

 నిధులు కేంద్ర ప్రభుత్వానివే అయినా...

 సాక్షర భారత్‌ సమన్వయకర్తలు 15 ఏళ్లుగా తాత్కాలిక
ప్రాతిపదికన పని చేస్తున్నారు. గ్రామ సమన్వయకర్తలకు నెలకు రూ.2,000, మండల, జిల్లా సమన్వయకర్తలకు రూ.6,000 చొప్పున గౌరవ
వేతనం అందుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల నుంచే రాష్ట్ర ప్రభుత్వం ఈ వేతనాలు
చెల్లిస్తోంది. తొలగింపునకు గురైన సమన్వయకర్తల్లో 15 నుంచి 20 ఏళ్లకుపైగా
సేవలందిస్తున్నవారు ఉన్నారు. తమకొచ్చే వేతనం అత్యంత స్వల్పమే అయినా ఏనాటికైనా
పెరుగుతుందని ఆశగా ఎదురు చూస్తున్న వారిని ప్రభుత్వం ఒక్క కలం పోటుతో తొలగించింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఉభయ గోదావరి,
కృష్ణా జిల్లాలు తప్ప మిగిలిన 10 జిల్లాల్లో సాక్షర
భారత్‌ కార్యక్రమం అమలవుతోంది. 

 నెలకు రూ.4.5 కోట్లు ఇవ్వలేరా? 

 రాష్ట్రవ్యాప్తంగా 9,979 సాక్షర భారత్‌ కేంద్రాల్లో పనిచేస్తున్న 19,959 గ్రామ, 504 మంది మండల, 40 మంది జిల్లా సమన్వయకర్తలను తొలగించారు. విచిత్రం ఏమిటంటే ఈ
ఉద్యోగులను మార్చి 31 నుంచి తొలగించేలా రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ 1న ఆదేశాలు ఇవ్వగా, జూన్‌ 14న వయోజన విద్యా
విభాగం డైరక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 31 నుంచి తొలగించినట్లు ఉత్తర్వులు
ఇచ్చినా ఈ మూడు నెలల కాలంలో వీరితో ప్రభుత్వం పనులు చేయించుకుంది. వీరికి గతేడాది
అక్టోబర్‌ నుంచి ఈ ఏడాది మార్చి వరకు రూ.25 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి
ఉంది. మార్చి 31 నుంచి విధుల నుంచి తొలగిస్తున్నట్లు మూడు రోజుల క్రితం ప్రభుత్వం
ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏప్రిల్, మే నెలలతోపాటు జూన్‌లో పనిచేసిన
రోజులకు వేతనాన్ని కోల్పోనున్నారు. మొత్తం బకాయిలు కలిపితే రూ.33 కోట్లు అవుతుంది.
ఈ బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం అకస్మాత్తుగా రోడ్డున పడేసింది.

 సాక్షర భారత్‌ ఉద్యోగులందరికీ ఇచ్చే
వేతనం నెలకు రూ.4.5 కోట్లు మాత్రమే. ప్రత్యేక విమానాల్లో విదేశీ యాత్రల కోసం రూ.వందల
కోట్లు ఖర్చు పెడుతున్న పాలకులు తమకు అరకొర వేతనాలు సైతం ఇవ్వకుండా, విధుల నుంచి
తొలగించడం ఏమిటని సాక్షర భారత్‌ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక టీడీపీ కార్యకర్తలే సమన్వయకర్తలు

 కేంద్రం నిధులు ఇవ్వకపోవడం వల్లే సాక్షర భారత్‌
సమన్వయకర్తలను తొలగించామని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం
యూసీలు ఇవ్వనందువల్లే కేంద్రం నుంచి నిధులు రావడం లేదు. సాక్షర భారత్‌ అమలు కోసం
కేంద్రం ఇచ్చిన సొమ్మును రాష్ట్ర సర్కారు దారి మళ్లించింది. ఈ సంగతి బయటపడుతుందనే
భయంతోనే యూసీలు ఇవ్వకుండా జాప్యం చేస్తోంది. పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర
రాష్ట్రాల్లో సాక్షర భారత్‌ కార్యక్రమం యథాతథంగా కొనసాగుతోంది. కేంద్రం నిధులు
విడుదల చేయకున్నా అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలే నిధులు సమకూరుస్తూ సమన్వయకర్తలకు
వేతనాలు చెల్లిస్తున్నాయి. కానీ,
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 8 నెలలుగా జీతాలు
ఇవ్వకుండా మొండిచేయి చూపింది. ఏకంగా విధుల నుంచి తొలగించింది.

Back to Top