1500 రోజులవంచన

 చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి నేటికి 1499 రోజులు పూర్తి
అయ్యింది. 1500 రోజుల పాలనలో ప్రగతి అంటూ చంద్రబాబు పండుగ చేయడం విడ్డూరం. 600 హామీల మేనిఫెస్టో
ఏమైందో ఎవరికీ తెలీదు. నాలుగేళ్ల ముందు ఇచ్చిన హామీల్లో అరొకొర హామీలను ఎన్నికల వేళ
తీరుస్తున్నట్టు నటిస్తున్నారు. ప్రధాన హామీలైన రుణమాఫీ, నిరుద్యోగ
భృతి, ఉద్యోగాల కల్పన, రాజధాని నిర్మాణం
అన్నీ కలగానే మిగిలి పోయి ఉన్నాయి. ఇలాంటి సమయంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనా
అందించాం అంటూ డప్పు కొట్టుకుంటున్న చంద్రబాబు సర్కార్ తీరు చూసి ప్రజలు మండిపడుతున్నారు.

వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రజలు పాస్ మార్కులు మాత్రమే
వేశారని, వారిని మెప్పించేలా ప్రభుత్వం ఈసారి పరిపాలించాలని అన్నారు వైఎస్సార్. ప్రభుత్వం
పట్ల ప్రజల్లో విశ్వాసం ఉండాలని, ఉండేలా ప్రభుత్వ పనితీరు ఉండాలని భావించిన నాయకుడు ఆయన. సంతృప్తస్థాయి, అభివృద్ధి
సూచిలు, ఆనంద నగరాలూ అంటూ అబద్ధాలతో కాలం నెట్టుకొస్తున్న నయవంచకుడు
చంద్రబాబు. ఎవరైనా ఘనమైన చరిత్రలను మననం చేసుకుంటారు. గతంలో సాధించిన
విజయాలను నెమరేసుకుంటారు. కానీ చంద్రబాబు వేల కోట్లు, లక్షల మంది
లబ్దిదారులు అంటూ కాకమ్మ లెక్కలతో గత చరిత్రను లెక్కలు కడుతున్నాడు.

ఏం సాధించారని వేడుకలు?

బేషరతు రుణమాఫీలు అని చెప్పిన చంద్రబాబు, రైతు రుణమాఫీపై
తొలి సంతకం అన్న చంద్రబాబు రుణమాఫీ కమిటీ మీద మాత్రం తొలి సంతకం పెట్టి అధికాంరంలోకి
వచ్చిన తొలిరోజే వంచనకు శ్రీకారం చుట్టాడు. వివిధ కొర్రీలు పెట్టి, పరిమితులు
పెట్టి, షరతులు పెట్టి చేసిన రుణమాఫీ కూడా సంపూర్ణంగా జరగలేదు. దఫాలవారీగా
అంటూ నాలుగేళ్లుగా చేస్తున్నా ప్రస్తుతం 5వ దఫా రుణమాఫీ ఇంకా
కంప్లీట్ అయ్యింది లేదు. రుణమాఫీ విషయంలో బాబు సాధించిన ఘనతేంటయ్యా అంటే నాలుగేళ్లు గడిచినా
రైతు రుణం పూర్తిగా మాఫీ కాలేదు. తడవల తడవలుగా ఇచ్చిన సొమ్ము బ్యాంకు వడ్డీలకు కూడా సరిపోలేదు. రైతుకు కొత్త
అప్పు పుట్టలేదు. రుణమాఫీ వల్ల రైతులకు ఒరిగిందేం లేదు. ఇదే పద్ధతిలో
డ్వాక్రా రుణమాఫీకి కూడా గంట కొట్టేశాడు బాబు. తెలంగాణా
ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా లేకపోయినా డబ్బుతో ఆ పదవిని చేజిక్కించుకోడానికి బాబు చేసిన
కుటిల యత్నం భగ్నమై తెలుగు వారి పరువు తెలంగాణాలో తుడిచిపెట్టుకుపోయింది. ఓటుకు నోటు
కేసులో ఆడియో టేపుల్లో దొరికిపోయి, కేంద్ర మంత్రి జోక్యంతో గవర్నర్ దగ్గర జరిగిన పంచాయితీలో కెసిఆర్
కాళ్లు పట్టుకుని, పారిపోయి విజయవాడ వచ్చిన ఘనత చంద్రబాబు సాధించినదే. ఇదీ ఆయనగారి
పాలనలో వెలిగిపోయిన తెలుగు తేజం. ఇసుక రీచ్ లన్నిటినీ తెలుగు తమ్ముళ్ల పరం చేసి, ఇసుక ఉచితం
అని ప్రజల చెవుల్లో పూవులు పెట్టడం బాబు గారి ఘనతలన్నిటిలోకెల్లా ఘనమైన సంగతి. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపిలనూ ప్రలోభాలకు గురిచేసి
ఫిరాయింపులకు ప్రోత్సహించడం టిడిపి విజయంగానే చెప్పుకుంటున్నారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్, సెటిల్
మెంట్ దందాలతో రౌడీ రాజ్యాన్ని నడిపించడం చంద్రబాబు ఘనత కాదని ఎవరనగలరు? ఫిరాయింపు చట్టానికి తూట్లు పొడిచి, ఫిరాయింపు నేతలకు
మంత్రి పదవులు కూడా ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడమే బాబుగారి విజనరీ విజయం.
అవినీతి కమిటీలైన జన్మభూమి కమిటీల వీర విహారం, స్వైర విహారం కూడా చంద్రబాబుగారి ఘన చరిత్రలో భాగమే. పూర్తి కాని పోలవరం, పనికిరాని పట్టిసీమ, ఎప్పుడు అవుతుందో తెలియని హంద్రీ నీవా, కళ్లకు కనబడ కుండా
పోయిన ఎన్టీఆర్ సుజల స్రవంతి బాబుగారి ఘన చరిత్రల్లో కలికితురాళ్లు. ఇక 40ఏళ్ల ఇండస్ట్రీ, సీనియర్ నాయకుడు
అని చెప్పుకున్న తెలివితేటలేవీ రాజధాని నిర్మాణానికి పనికిరాకుండా పోయాయి. మిల్లీ మీటరు వర్షానికి సెంటీమీటరు తడిసిపోయే భవనాలు కట్టిన సత్తాని బైటపెట్టాయి.
విదేశీ ప్రయాణాలు, విచ్చలవిడి ఖర్చులు,
మించిపోయిన అప్పులు ఖజానాని ఖాళీ చేసాయి. ఇన్ని
ఘనత వహించిన చిత్రవిచిత్రాలను సాధించినందుకు బాబుగారు 1500 రోజుల
బ్రహ్మాండమైన పాలనను తలుచుకుని, మురుసుకుని, వేడుకలు చేసుకుని తీరాల్సిందే. అయితే అసలైన పండుగ ముందుంది
కనుక ఆ పండుగను వేడుకగా చేసేందుకు ప్రజలు కాచుకుని ఉన్నారు. ఆనాడు
బాబుగారి ఘన చరిత్రకు ఓటు తోనే మంగళం పాడుతారు. 

Back to Top