108 గొంతు కోసారు

డ్యాష్ బోర్డు సిఎమ్
చంద్రబాబుకు రాష్ట్రంలో ఏమూల ఏది జరిగినా తెలుస్తుంది. కానీ విజయవాడ నడిబొడ్డున
జరిగే దారుణాలు తెలియవు. పెచ్చు పెరిగిపోతున్న నేరాలతో ప్రజలు పడుతున్న బాధలు
తెలియవు. ప్రాణాపాయంలో ఉంటే కనీసం అంబులెన్సు అందుబాటులో లేని దుస్థితులు తెలియవు. సుందర నగరం, ఆనంద నగరం, ఆరోగ్య నగరం, అమరావతిలో ఉంటే ఆయుష్షు
పెరుగుతుందనే చంద్రబాబు మాటలు ఎంత బూటకాలో నిన్నటి విజయవాడ సత్యనారాయణపురంలోని సంఘటనే
సాక్ష్యం. నిత్యం రద్దీగా ఉండే కాలనీలో పట్ట పగలే నేరగాళ్లు దొంగతనాలకు, దోపిడీలకు, హత్యలకు తెగబడుతున్నారు. నగరంలో జరుగుతున్న నేరాలను
అరికట్టేందుకు పోలీసు వ్యవస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. అన్నిటికంటే అన్యాయమైన
విషయం ఏమంటే నేరగాళ్ల బారిన పడి, గాయాలయ్యో, ప్రాణాపాయ స్థితిలో ఉండో బాధితులు 108 అంబులెన్సుకు ఫోను చేస్తే
ఎలాంటి స్పందన ఉండటం లేదు. విజయవాడ సత్యనారాయణ పురంలో ఓ గృహిణి గొంతు కోసి దుండగులు
పారిపోతే, ఆమెను తక్షణం ఆసుపత్రికి తీసుకు వెళ్లేందుకు 108 కోసం ప్రయత్నించారు
స్థానికులు. కానీ ఆ సర్వీసు నుండి ఎలాంటి స్పందనా లేకపోవడంతో విధిలేక ఆటోలో ఆసుపత్రికి
తీసుకువెళ్లారు. ఇదీ అద్భుత అమరావతిలో ప్రజల దారుణ పరిస్థితి.

ఈ సంఘటనే కాదు రాష్ట్రవ్యాప్తంగా
ఎందరో అభాగ్యులు ఆపద సమయంలో 108 కి ఫోను చేసి సరైన సమయంలో ఆ సర్వీసు అందక ప్రాణాలు
పోగొట్టుకుంటున్నారు. గర్భిణీ స్త్రీలు, ప్రమాదానికి గురైన వారు 108కి ఫోను చేస్తే అది
వస్తుందని గ్యారెంటీ ఉండటం లేదు. వాహనాల కొరత, ఉన్న వాహనాలకు రిపేర్లు, సిబ్బంది కొరత, కొన్ని అంబులెన్సుల్లో
మందులు, ఆక్సిజన కొరత, సమాచార నిర్వాహణ లోపం వంటి వాటితో 108 సర్వీసు నిర్వీర్యం
అయిపోయింది. సమయానికి అంబులెన్సు అందక, అత్యవసర చికిత్సలు అందక ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

మహానేత మానస పుత్రి 108

2005లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన 108 లక్షల మందికి ప్రాణదానం
చేసింది. ఫోన్ చేసిన 20 నిమిషాల్లోపు బాధితుల వద్దకు చేరి తక్షణ వైద్య సహాయాన్ని
అందించి, సమీపంలోని వైద్యశాలకు తరలించడంలో 108 సంజీవనిలా పని చేసింది. కోట్లాది మందికి చేరువైన
ఈ సర్వీసు గురించి తెలుసుకుని వివిధ  రాష్ట్రాలు
కూడా 108ను ప్రారంభించాయి. మహానేత మరణం తర్వాత అటు కాంగ్రెస్ సర్కార్, ఆ తర్వాత అధికారంలోకి
వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం 108ని నామరూపాల్లేకుండా చేసారు. సిబ్బంది వేతనాలు పెరగలేదు. వారి సమస్యలపై ఎన్నో
సార్లు నిరసనలు తెలిపినా, సమ్మెలు చేసినా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు.

చంద్రబాబు ఏర్పాటు చేసిన
తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్, సంచార వైద్యాలయాలు మూన్నాళ్ల ముచ్చటే అయ్యాయి. అక్కడక్కడా తప్ప ఇవి
రెగ్యులర్ గా అందుబాటులో ఉన్నది లేదు.  ఆర్భాటంగా
ప్రచారం చేసుకోవడం, ఆ తర్వాత పథకాలను అటకెక్కించడం...ఇదీ చంద్రబాబు తీరు. రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉందని, అంతా బావుందని కబుర్లు
చెప్పే చంద్రబాబు వాస్తవాలను దాచి ప్రజల ప్రాధమిక అవసరాలను కూడా నిర్లక్ష్యం చేస్తున్నాడు. తక్షణ వైద్య సహాయంతో
ప్రజలకు ఆపద్భంధు లాంటి 108 సర్వీసులను ప్రజలకు అందుబాటు లో లేకుండా చేయడం ద్వారా
వైఎస్సార్ పేరును చెరిపేయాలనే చంద్రబాబు స్వార్థపు ఆలోచనకు ఫలితంగా ఎందరో అభాగ్యులు
అత్యవసర సేవలకు దూరమై, ప్రాణాలు విడుస్తున్నారు.

 

 

 

Back to Top