నిధుల కోసమే బాబు విదేశీ యాత్ర

హైదరాబాద్, 24 జూన్‌ 2013:

నవంబర్‌లో సార్వత్రిక ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున హవాలా మార్గంలో విదేశాల నుంచి ఎన్నికల నిధులు తెచ్చుకునేందుకే చంద్రబాబునాయుడు అమెరికా పర్యటన చేశారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఆరోపించింది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌, బడ్జెట్‌ తదితర అత్యంత ప్రాధాన్యత ఉన్న అంశాలు సభ ఆమోదానికి వచ్చిన సందర్భంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు తన సొంత పనులంటూ విదేశాలకు వెళ్ళిపోవడంలోని ఆంతర్యం హవాలా మార్గంలో సొమ్ములు తెచ్చుకోవడానికే అని పార్టీ అధికార ప్రతినిధి బి. జనక్‌ ప్రసాద్‌ విమర్శించారు. ఈ ఏడాది తొలి విడత బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నప్పుడు దేశంలోనే ఉన్నప్పటికీ బాధ్యత గల ప్రతిపక్ష నేతగా ఒక్క రోజు కూడా చంద్రబాబు సభకు హాజరు కాలేదన్నారు. రెండో విడత సమావేశాల్లో కేవలం నాలుగు నిమిషాలు మాత్రమే మాట్లాడి వ్యక్తిగత పనులున్నాయంటూ అమెరికా వెళ్ళిపోవడాన్ని జనక్‌ ప్రసాద్‌ తప్పపు పట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు ఒక హోదా ఇచ్చారని, ప్రభుత్వం జెడ్ ప్లస్‌ కేటగిరీ, కేబినెట్‌ ర్యాంకు ఇచ్చిందని అయినప్పటికీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌పై చర్చ జరిగినప్పుడు ఒక్క రోజు కూడా హాజరు కాలేదని జనక్‌ ప్రసాద్‌ విమర్శించారు. 2004, 09 సంవత్సరాలలో కూడా చంద్రబాబు విదేశీ పర్యటనలు చేసి హవాలా మార్గంలో ఎన్నికల నిధులు తరలించుకు వచ్చారని, ఆ డబ్బులను ఎన్నికల్లో వెదజల్లారని ఆయన ఆరోపించారు. మొన్న 13వ తేదీ అర్ధరాత్రి అసెంబ్లీ సమావేశాలను విడిచిపెట్టిపోయి కేవలం నాలుగు రోజులే తన విదేశీ పర్యటన అని చెప్పి, అమెరికా వెళ్ళారన్నారు. విదేశీ నిధులను ఎన్నికల ఖర్చు కోసం హవాలా మార్గంలో తేవాలనే చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్ళారని పత్రికలు రాస్తున్నాయన్నారు.

గతంలో చంద్రబాబు నాయుడు తన బినామీ సుజనా చౌదరి కంపెనీల ద్వారా, వంద బినామీ కంపెనీల ద్వారా వందల కోట్ల రూపాయలు డ్రా చేశారని జనక్‌ ప్రసాద్‌ ఆరోపించారు. బినామీ కంపెనీల ద్వారా చంద్రబాబు నిధులను డ్రా చేసిన విషయాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ తన పిటిషన్‌లో పేర్కొన్నారని చెప్పారు. అయితే.. ఆ విషయంపై విచారణ జరగలేదన్నారు. ఇన్ని రకాల కేసులు ఒకటిగా వేయకూడదని విడివిడిగా దర్యాప్తు చేయమని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. 2004లో గాని, 2009లో గాని హవాలా మార్గంలో సుజనా చౌదరి కంపెనీల ద్వారా తీసుకువచ్చి డ్రా చేసుకున్నారో వెల్లడించాలని చంద్రబాబును జనక్‌ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. ఈసారి 500 మిలియన్‌ డాలర్లు హవాలా మార్గంలో తెచ్చుకునేందుకే చంద్రబాబు విదేశీ పర్యటన చేశారని ఆయన ఆరోపించారు.

నిజంగా చంద్రబాబుకు విదేశాల్లో వ్యక్తిగత పనులే ఉండి ఉంటే 23వ తేదీన ఢిల్లీలోని ఎపి భవన్‌లో హైడ్రామా ఎందుకు చేశారని జనక్‌ ప్రసాద్‌ నిలదీశారు. ఉత్తరాఖండ్‌లో చిక్కుకుపోయి, ఇబ్బందుల్లో ఉన్న వేలాది మంది తెలుగువారి పట్ల చంద్రబాబుకు ప్రేమే ఉంటే వరదలు వచ్చిన రోజునే వచ్చి మాట్లాడాల్సిందన్నారు. తన హవాలా వ్యవహారాలు బయటికి వస్తాయని, ఆ విషయాన్ని పక్కదారి పట్టించేందుకే చంద్రబాబు ఇలా హైడ్రామాకు తెరతీశారని విమర్శించారు. చంద్రబాబుకు వ్యక్తిగత ప్రయోజనాలే కాని ప్రజల కష్టాలు పట్టవని జనక్‌ ప్రసాద్‌ ఆరోపించారు. 2004, 2009 ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబును తిరస్కరించారని, ఆ తరువాత వచ్చిన అన్ని ఉప ఎన్నికల్లోతూ చంద్రబాబును టిడిపి ఓడించారన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోకపోతే పార్టీ ఉనికే గల్లంతవుతుందని చంద్రబాబు హవాలా నిధులతో ఎలాగైనా గెలవాలని పన్నాగాలు పన్నుతున్నారని విమర్శించారు.

చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయన గాని, ఆయన కుటుంబ సభ్యులు గాని ఎన్ని దేశాల్లో పర్యటించారు, ఆ దేశాల్లో వారు చేసిన లావాదేవీలు ఏమిటో నిగ్గు తేల్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను‌ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున జనక్‌ప్రసాద్ డిమాండ్‌ చేశారు. చంద్రబాబుకు ఎన్ని దేశాల్లో బినామీ పేర్లతో ఆస్తులు ఉన్నాయో తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ఏ రాచ కార్యాలు ఉన్నాయని ఆ దేశంలో ఇన్ని రోజులు పర్యటించారని చంద్రబాబును ఆయన నిలదీశారు. ఎన్నికలు వచ్చే ప్రతిసారీ చంద్రబాబు స్విట్జర్లాండ్, దుబాయ్, సింగపూర్‌ దేశాలకు వెళ్ళి అక్కడ ఉన్న బినామీ కంపెనీల ద్వారా హవాలా ద్వారా డబ్బులు తీసుకువస్తున్నారని టిడిపి నాయకులే చెబుతున్నారని జనక్‌ ప్రసాద్‌ తెలిపారు. కొన్ని జాతీయ పత్రికలు కూడా ఈ విషయాన్నే కథనాలుగా రాస్తున్న వైనాన్ని ఆయన ప్రస్తావించారు. ఇన్నిసార్లు విదేశాలకు ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో చంద్రబాబు నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత శ్రీ జగన్మోహన్‌రెడ్డిని ఆదరించవద్దని బాధ్యత గల కేంద్ర మంత్రి పదవిలో ఉన్న చిరంజీవి చెప్పడాన్ని జనక్‌ ప్రసాద్‌ తీవ్రంగా ఖండించారు. ప్రజా రాజ్యం పార్టీని కాంగ్రెస్‌కు హోల్‌సేల్‌గా తాకట్టు పెట్టిన చిరంజీవి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు. చిరంజీవి బంధువు ఇంటిలో మంచం కింద లెక్కల్లో చూపని కోట్లాది రూపాయలకు సంబంధించిన కేసు ఏమైందో అంతు చిక్కడంలేదన్నారు.‌ అంటే శ్రీ జగన్మోహన్‌రెడ్డిని అవినీతిపరుడన్న చిరంజీవి అవినీతికి పాల్పడలేదా? అని జనక్‌ ప్రసాద్ నిలదీశారు.‌ సంవత్సరం నుంచి దర్యాప్తు చేస్తున్నప్పటికీ‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డిపై ఒక్క ఆరోపణనైనా నిరూపించగలిగారా అని ఆయన ప్రశ్నించారు. జననాయకుడు, జనాదరణ ఉన్న నాయకుడు శ్రీ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక కాంగ్రెస్‌, టిడిపిలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఈ విధంగా కుట్రలో చేస్తే.. ప్రజలు చూస్తూ ఊరుకోరని ఆయన హెచ్చరించారు. ఆయనకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశం ఇబ్బందుల్లో ఉంటే చంద్రబాబు వ్యక్తిగత పనులని చెప్పి విదేశాల్లో తిరుగుతారా? అని ప్రశ్నించారు. అంటే ప్రజల పట్ల చంద్రబాబుకు ఉన్న జవాబుదారీతనం ఇదేనా అని అన్నారు.

రాష్ట్రంలో ఉన్న అసమర్థ ప్రభుత్వం అధికారంలో ఉండరాదని చెబుతున్న చంద్రబాబు దాన్ని ఆచరణలో పెట్టడంలేదేమని జనక్‌ ప్రసాద్‌ విమర్శించారు. నీతిమాలి ప్రవర్తిస్తున్న కారణంగానే చంద్రబాబును ప్రజలు విశ్వసించడంలేదన్నారు. 2014లో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌, టిడిపిలను బంగాళాఖాతంలో కలిపేసి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కడతారన్న ధీమాను జనక్‌ప్రసాద్‌ వ్యక్తంచేశారు.

Back to Top