బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పుపై విజయమ్మ ధర్నాలు

హైదరాబాద్, 3 డిసెంబర్ 2013:

కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యున‌ల్ ఇచ్చిన తీర్పుకు నిరసనగా వై‌యస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు ప్రాజెక్టుల దగ్గర ధర్నాలు చేపడుతున్నట్లు పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు‌ శ్రీమతి వైయస్ విజయమ్మతో పాటు ఆయా జిల్లాల రైతాంగం కూడా పెద్ద ఎత్తున పాల్గొననున్నారని చెప్పారు. కృష్ణా - గుంటూరు జిల్లాల మధ్యన ఉన్న పులిచింతల ప్రాజెక్టు వద్ద బుధవారంనాడు ధర్నా చేపట్టనున్నారు. వైయస్ఆర్‌ జిల్లా గండికోట ప్రాజెక్టు సమీపంలో గురువారంనాడు, 6వ తేదీన మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు వద్ద ఆమె ధర్నాలు చేస్తారని ఉమ్మారెడ్డి తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పార్టీ నాయకులు గుర్నాథ్‌రెడ్డి, గట్టు రామచంద్రరావుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఈ ధర్నాల సందర్భంగా బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు పూర్వాపరాలు, బచావత్‌ అవార్డు, అంతకు ముందు నుంచీ కృష్ణా నదీ జలాల విషయంలో ఉన్న వివాదాల పరిష్కారానికి ప్రభుత్వాలు చేపట్టిన కార్యాచరణ లాంటి పలు అంశాలను వివరించనున్నట్లు తెలిపారు. బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పుపై తీవ్ర నిరసన తెలియజేస్తామన్నారు. బ్రిజేష్‌కుమార్‌ తీర్పుపై ప్రభుత్వం వెంటనే స్పందించి, అది అమలు కాకుండా సుప్రీం కోర్టు నుంచి స్టే తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం దీనిని గెజెట్‌లో ప్రకటించకుండా ఉండేలా స్టే తీసుకోవాలనే డిమాండ్లతో ప్రాజెక్టుల వద్ద తమ పార్టీ ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించిందని చెప్పారు.
ఈ ధర్నాల్లో ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా ప్రజలు, రైతులు పాల్గొని మన రాష్ట్రానికి జరగబోతున్న నష్టాన్ని అడ్డుకోవాలని ఉమ్మారెడ్డి విజ్ఞప్తి చేశారు.

తాజా వీడియోలు

Back to Top