జనం పరువు తాకట్టు పెట్టిన చంద్రబాబు

హైదరాబాద్, 31 ఆగస్టు 2013: 

చంద్రబాబు తీసుకున్న నిర్ణయం, రాసిన లేఖల కారణంగానే రాష్ట్రం రెండు ముక్కలైందని ఉమ్మారెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన ఏ లేఖ రాసినప్పుడైనా.. రాష్ట్రాన్ని విభజించేటట్లయితే.. సీమాంధ్రలో ఉన్న ఇబ్బందులు... హైదరాబాద్‌ నుంచి సీమాంధ్రుల బయటికి వెళ్ళి వేరే రాజధాని ఏర్పర్చుకోండి అనే సమయంలో వారికి జరిగే ఇబ్బందుల గురించి ఏనాడైనా, ఎక్కడైనా ఆయన మాట్లాడి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారా? అని ప్రశ్నించారు. అదే జరిగి ఉంటే ఈ నాడు సీమాంధ్ర ప్రజానీకానికి ఈ తిప్పలు ఉండేవి కావన్నారు.  'రాష్ట్రాన్ని అడ్డంగా నరికింది కాంగ్రెస్', '‌చంద్రబాబు లేఖే గండ్రగొడ్డలి', 'సమైక్యంపై చంద్రబాంబు' అనే నినాదాలతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా విభాగం రూపొందించిన పోస్టర్‌ను పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారంనాడు ఉమ్మారెడ్డి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తమ్మినేని సీతారాం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.

తెలంగాణ ప్రజల సెంటిమెంటును మేం కూడా గౌరవిస్తామని మొదటి ప్లీనరీ నుంచీ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ స్పష్టంగా చెబుతోందని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గుర్తుచేశారు. విభజన చేయాలనుకుంటే రెండు ప్రాంతాలకూ సమన్యాయం చేసిన తరువాతే నిర్ణయం తీసుకోవాలని స్పష్టంగా చెప్పిందన్నారు. తెలంగాణకు న్యాయం జరిగిందని, సీమాంధ్రకు జరగలేదు కనుకే అక్కడ ఆందోళనలు జరుగుతున్నాయన్నారు. జూలై 31న విభజన ప్రకటన వచ్చేదానికి ముందు నుంచే సంకేతాలు వస్తున్నాయని, రాష్ట్రాన్ని విభజిస్తే వచ్చే నష్టం ఏమిటని అక్కడక్కడా అంటున్నారని, ఇది సరి కాదు సిడబ్ల్యుసి ప్రకటనను నిలుపుదల చేయండి అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎంపిలు రాజీనామాలు చేశారని గుర్తుచేశారు.

సెప్టెంబర్‌ 1 నుంచి చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా నుంచి బస్సు యాత్ర నిర్వహించబోతున్నారు. రాష్ట్రంలో ఒక ప్రాంతం వారికి జరుగుతున్న అన్యాయం గురించి ప్రజలకు వివరణ ఇవ్వాలి అని పదే పదే ఆయన ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నొక్కి చెప్పారన్నారు. ఆ ప్రాంతానికి అన్యాయం జరగకుండా ఉండాలనే మీరు మొదటి నుంచీ తెలంగాణ విషయంలో తీసుకున్న నిర్ణయం ఒక్కసారి చూసుకుంటే.. ఆత్మ పరిశీలన చేసుకుంటే.. జరిగిన అన్యాయానికి మొత్తం చంద్రబాబే కారణం కాదా అని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. చంద్రబాబు ఎప్పుడెప్పుడు తెలంగాణ రాష్ట్రం కావాలి, ఇవ్వాలని ఒకటికి పది సార్లు పది సందర్భాల్లో ఆయన చెప్పిన వైనాన్ని, ప్రణబ్‌ ముఖర్జీ కమిటీకి పంపిన లేఖను, తరువాత అనేక సందర్భాల్లో ఆయన పంపించిన లేఖలను, 2009 ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణపై స్పష్టంగా పేర్కొన్న తీరు చూస్తే ప్రత్యేక తెలంగాణ రావాలని మీరు ఈ నిర్ణయాలన్నీ తీసుకున్నారా? రావద్దని తీసుకున్నారా? అని ప్రశ్నించారు. 2009లో మహాకూటమి ఏర్పాటు చేసినప్పుడు ఈ ప్రాంత ప్రజానీకాన్ని ఏదో విధంగా మభ్య పెట్టి ఓట్లు వేయించుకోవాలని నిర్ణయం తీసుకున్నారా? అని నిలదీశారు.

ఈ విషయాల మీద చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకుని బస్సు యాత్రకు వెళ్ళినప్పుడు తాను రాసిన ప్రతి లేఖ మీదా వివరణ ఇవ్వాలని, ఆయన ఎందుకు మనసు మార్జుకున్నారో కూడా చెప్పాలని ఉమ్మారెడ్డి డిమాండ్‌ చేశారు. చంద్రబాబు ఇచ్చిన లేఖల గురించి ప్రజలకు తెలియాలని ఒక పోస్టర్‌ వేసి విడుదల చేస్తున్నట్లు ఆయన చెప్పారు. సీమాంధ్ర ప్రాంతం అంతా కూడా ఈ పోస్టర్‌ను పంపిస్తున్నామన్నారు. చంద్రబాబు నిజ స్వరూపం సీమాంధ్రులకు తెలియాలని అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని నెల రోజులుగా ఆందోళన చేస్తున్న సీమాంధ్రులకు చంద్రబాబు నుంచి వివరణ రావాలన్నారు.

రాష్ట్ర విభజనను ఆమోదిస్తూ.. నాలుగైదు లక్షల కోట్లు ఇస్తే.. సీమాంధ్రలో కొత్త రాజధానిని ఏర్పాటు చేస్తామంటూ బేరాలు చేసిన చంద్రబాబు మీడియా ద్వారా చెప్పిన తీరును ఉమ్మారెడ్డి తూర్పారపట్టారు. అంటే కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయాన్ని ఆమోదించామని చెప్పడానికి సమయం కూడా తీసుకోకుండా తొందరపడి మాట్లాడారని ఎద్దేవా చేశారు. విభజన నిర్ణయం తరువాత సీమాంధ్రలో ఆందోళనలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్న వైనాన్ని వారం రోజుల పాటు చూసి ప్రధానికి చంద్రబాబు మూడు పేజీల లేఖ రాశారన్నారు. రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తుంటే చంద్రబాబు లేఖ రాశారని విమర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు రాసిన లేఖలను చదివి వినిపించారు. ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా టిడిపి పొలిట్‌ బ్యూరో తీర్మానాన్ని ప్రణబ్‌కు రాసిన లేఖలో వివరించారన్నారు. మహాకూటమి ఏర్పాటు చేసుకున్నప్పుడు 'తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ ఏర్పాటుకు అవసరమైన రాజకీయ, చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది' అంటూ 2009 టిడిపి ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టం పేర్కొన్న వైనాన్ని ఉమ్మారెడ్డి చదివి వినిపించారు. ఇప్పటికే తెలంగాణ అంశం ఆలస్యం అయిందని, ఉద్యమాలు వస్తున్నాయని, అఖిలపక్షాన్ని పిలిచి త్వరగా పరిష్కరించాలని ప్రధానికి రాసిన లేఖలోని అంశాన్ని కూడా చదివి వినిపించారు.

రాష్ట్రం పరువు ప్రతిష్టలు, సీమాంధ్రులను ఇబ్బందులను తాకట్టు పెట్టి, నాలుగైదు లక్షల కోట్లు కావాలని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఆత్మగౌరవ యాత్ర అంటూ ప్రజల ముందుకు ఎలా వెళతారని ఉమ్మారెడ్డి ప్రశ్నించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినడానికి ప్రధాన కారకుడు అయి ఉండీ దానిని కప్పి పుచ్చుకోవడానికి చంద్రబాబు బస్సు యాత్రకు బయలుదేరుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలను అనేక సందర్భాల్లో మభ్యపెట్టి, మోసపుచ్చి ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని తాను బస్సు యాత్ర చేస్తానని మీడియాలో హెడ్‌లైన్సులో చంద్రబాబు వేయించుకున్నారని ఎద్దేవా చేశారు.

రెండవ ఎస్సార్సీ తప్ప దివంగత మహానే డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఎక్కడా తెలంగాణకు అనుకూలం అని చెప్పలేదని ఉమ్మారెడ్డి స్పష్టంచేశారు. రాష్ట్ర విభజనకు వైయస్సే కారణం అంటూ దిగ్విజయ్‌సింగ్‌ చెప్పిన మాటలకు తమ పార్టీ వివరణ కోరిందన్నారు. వైయస్ఆర్‌ సిఎల్పీ నాయకుడిగా ఉన్న సమయంలో తెలంగాణకు చెందిన 40 మంది నాయకులు ఆయన దగ్గరకు వచ్చారని, తెలంగాణ రాష్ట్రం కోసం ఢిల్లీ పెద్దలను కలిసేందుకు వెళుతున్నామని, సిఎల్పీ నాయకుడిగా ఫార్వర్డు చేస్తూ సంతకం చేయమని వారు కోరితే చేశారని ఉమ్మారెడ్డి వివరణ ఇచ్చారు. అయితే, తెలంగాణ బృందాన్ని వైయస్సే తీసుకువెళ్ళారంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మరణించిన వైయస్ఆర్‌ తెలంగాణ రికమెండ్‌ చేశారంటూ దిగ్విజయ్‌ సింగ్‌ చెప్పారంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడడం అంటే.. ఆత్మ వంచనే అన్నారు. చంద్రబాబుది ఎదుటి వారిపైన బురద జల్లడానికి చేసే ప్రయత్నమే అన్నారు.

ప్రజల మధ్యకు వెళ్ళేందుకు సిద్ధమైన చంద్రబాబు తాను రాసిన లేఖలన్నీ ఒక దాని తరువాత ఒకటి చదివి ప్రజలకు వినిపించి, తాను చేసిన తప్పులకు పశ్చాత్తాపం ప్రకటించాలని ఉమ్మారెడ్డి డిమాండ్‌ చేశారు. పోయిన తన గౌరవ పరిరక్షణ యాత్ర చేస్తున్నానని చెప్పాలని అన్నారు.

ఏ ముఖం పెట్టుకుని బస్సు యాత్ర చేస్తారు ?: పిన్నెల్లి :
సీమాంధ్రులకు తీరని ద్రోహం చేసిన చంద్రబాబు నాయుడు ఏ ముఖం పెట్టుకుని ఆత్మ గౌరవ బస్సు యాత్ర చేస్తారని పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. సీమాంధ్రకు అన్యాయం జరుగుతుందనే తామంతా ముందుగానే పసిగట్టి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశామన్నారు. చంద్రబాబు నాయుడు, టిడిపి ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేయాలని తాము డిమాండ్‌ చేశామన్నారు. ప్రణబ్‌ ముఖర్జీ కమిటీకి, ప్రధానికి రాసిన లేఖలు, తెలంగాణకు అనుకూలంగా పొలిట్‌బ్యూరోలో చేసిన తీర్మానాన్నిఎన్నికల ఎజెండా పెట్టిన అంశాలపై సీమాంధ్రులకు సమాధానం చెప్పిన తరువాతే బస్సు యాత్ర చేయాలని డిమాండ్‌ చేశారు. లేఖలు, ఎజెండాపై సీమాంధ్రలో అడుగడునా నిలదీసే ప్రజలకు సమాధానాలు చెప్పాల్సి అగత్యం వస్తుందన్నారు. సమైక్య వాదానికి అనుకూలంగా ఒక మాట చెప్పిన తరువాతే బస్సు యాత్రకు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు.

చంద్రబాబు ముందుగా ఆత్మపరిశీలన చేసుకోవాలి : తమ్మినేని :
బస్సు యాత్ర చేసే ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలని పార్టీ నాయకుడు తమ్మినేని సీతారాం డిమాండ్‌ చేశారు. 2008లో ప్రణబ్‌ ముఖర్జీకి రాసిన లేఖ చంద్రబాబే రాశారా లేదా? 2009 ఎన్నికల మేనిఫెస్టోలో 'ఎన్నికల అనంతరం మేం అధికారంలోకి వస్తే.. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు చట్టపరమైన, రాజకీయ పరమైన అన్ని నిర్ణయాలూ తీసుకుంటామని చాలా స్పష్టంగా చెప్పారని అది టిడిపి మేనిఫెస్టోనా కాదా ముందు తేల్చండని ఆయన డిమాండ్‌ చేశారు. అబద్ధాలు చెప్పే చంద్రబాబు ఇప్పుడైనా నిజం చెప్పాలని ఆయన కోరారు. తెలంగాణకు అడ్డు పడవద్దని సీమాంధ్రులకు నచ్చజెప్పేందుకు చంద్రబాబు బస్సు యాత్ర చేస్తారని తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలు చేసిన ప్రకటన నిజమా? కాదా చంద్రబాబు వివరణ ఇవ్వాలన్నారు. రాష్ట్ర విభజనను చంద్రబాబు సమర్థిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? స్పష్టంచేయాలన్నారు. రాష్ట్ర విభజన విషయంలో ఏయే పార్టీలు ఏయే సందర్భాల్లో ఎలాంటి లేఖలు ఇచ్చాయో బహిర్గతం చేయాలని దిగ్విజయ్‌ సింగ్‌ను తమ్మినేని డిమాండ్‌ చేశారు. కోట్లాది మంది రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కంటే తన ప్రాణాలు ముఖ్యం కాదంటూ శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేస్తుంటే కనీసం పట్టించుకోలేని స్థితిలో ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. తీసుకున్న నిర్ణయానికి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఆందోళన చేస్తే.. విజ్ఞత గల ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేసి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందన్నారు. సమన్యాయం చేయలేని ప్రభుత్వం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు.

Back to Top