పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు?

హైదరాబాద్, 13 జూన్‌ 2013:‌

శాసనసభ స్పీకర్ మీద అవిశ్వాసం పెడతామని టిడిపి నాయకులు ప్రకటించడాన్ని చూస్తుంటే 'పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లు'గా ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డాక్టర్‌ ఎం.వి. మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీని సజావుగా నడిపించడంలో అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉందో ప్రధాన ప్రతిపక్షానికీ అంతే బాధ్యత ఉందని అన్నారు. ఆ బాధ్యతను విస్మరించి కేవలం స్పీకర్‌ మీద అవిశ్వాసం అనడం సమస్యను పక్కదారి పట్టించడం తప్ప మరొకటి కాదన్నారు. ప్రధాన ప్రతిపక్షం టిడిపికి నిజంగా ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే ప్రజా కంటక కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం కూలిపోతే దానితో పాటే స్పీకర్‌ పదవి కూడా పోతుంది కదా అని అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఇంతకు ముందు ఈ కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని రక్షించారు కాబట్టి ఆ అపవాదును తొలగించుకునే ఎత్తుగడగా మాత్రమే స్పీకర్‌ అవిశ్వాసం అంటున్నారా అని టిడిపి నాయకులను మైసూరా ఎద్దేవా చేశారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌ పార్టీలో విలీనం అయిన తరువా సంఖ్యాబలాన్ని బేరీజు వేసుకుని, ఇక ఈ ప్రభుత్వం కూలిపోదని నిర్ధారించుకున్న తరువాతే టిడిపి ఇంతకు ముందు అవిశ్వాసం పెట్టిందని ఆయన దుయ్యబట్టారు. రెండవ సారి ప్రతిపక్షాలన్నీ ఏకమై అవిశ్వాసం పెట్టినప్పుడు కల్లబొల్లి కబుర్లు చెప్పి, దానికి మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉండి ప్రభుత్వాన్ని గట్టెక్కించింది టిడిపి కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఒక పక్కన ప్రభుత్వానికి మెజారిటి ఉందనీ, అవిశ్వాసం పెట్టినా ఫలితం ఏమిటని చంద్రబాబు అన్నట్లు పత్రికలలో చదివినట్లు మైసూరారెడ్డి తెలిపారు. ప్రభుత్వానికి మెజారిటీ ఉందంటే స్పీకర్‌కు మెజారిటీ ఉన్నట్లే కదా అని మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని, దీన్ని సముద్రంలోకి విసిరేయాలని బయట ప్రగల్భాలు పలుకుతారని, అవకాశం వచ్చినప్పుడు మాత్రం ప్రభుత్వానికి రక్షణ కవచంలా నిలబడుతున్నారని ఆయన దుయ్యబట్టారు.

టిడిపి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే.. అధికార పార్టీ వైఫల్యాలకు విసిగిపోయి, అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేసిన ఆ 15 మంది ఎమ్మెల్యేలు అనర్హత వేటుకు గురికాక ముందు అవిశ్వాసం పెట్టి ఉండాల్సిందని మైసూరారెడ్డి అన్నారు. ప్రభుత్వంతో కుమ్మక్కు అయ్యారని, తెర వెనుక కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయి అని ప్రజలు భావిస్తున్నారనే ఉద్దేశంతో ఇప్పుడు టిడిపి వారు స్పీకర్‌పై నామ్‌కే వాస్తే అవిశ్వాసం పెడతామంటున్నారని ఎద్దేవా చేశారు. టిడిపి ఆలోచన సమస్యను పక్కదారి పట్టించడమే తప్ప చిత్తశుద్ధి లేదని అన్నారు.

శాసనసభ కార్యకలాపాలు జరగకుండా అడ్డుకుంటున్న సభ్యులను సస్పెండ్ చేసేలా తీర్మానం చేయాల‌ని మైసూరారెడ్డి అన్నారు. ఫెడరల్ లేదా మూడో ఫ్రం‌ట్‌లో భాగస్వాములవుతామని... పిలవని పేరంటానికి చంద్రబాబు ఆరాట పడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఒకటి, రెండు సీట్లు కూడా రాని చంద్రబాబును ఎవరు చేర్చుకుంటారని మైసూరారెడ్డి ప్రశ్నించారు. లౌకికవాద పార్టీలతో తాము కలిసి పనిచేస్తామని మైసూరారెడ్డి చెప్పారు.

Back to Top