'మద్యం'పై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఉద్యమం

హైదరాబాద్, 25 జూన్‌ 2013:

కొత్త మద్యం పాలసీని ఉపసంహరించుకునేలా, బెల్టు షాపులు ఎత్తివేసే విధంగా తమ పార్టీ తరఫున ఉద్యమాలు నిర్వహిస్తామని, ప్రజా క్షేత్రంలో పోరాటం చేస్తామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, తాజా మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో త్వరలోనే రాజన్న రాజ్యం ఏర్పాటు చేస్తామని, ప్రతి రాష్ట్రమూ ఆదర్శంగా తీసుకునేలా చక్కని మద్యం పాలసీని తీసుకువస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా ఒక్క బెల్టు షాపు కూడా లేకుండా ఉండేలా, మద్యం ధరలు సామాన్యులకు అందని విధంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వం సోమవారం ప్రకటించిన కొత్త మద్యం పాలసీ‌ ప్రజా వ్యతిరేకంగా ఉందని ప్రవీణ్ నిప్పులు చెరిగారు. ఈ ఓట్ల సంవత్సరంలో ప్రభుత్వానికి నోట్ల యావ ఎక్కువైందని మద్యం పాలసీ ద్వారా తేటతెల్లం అయిందని విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

నోట్ల యావ తగ్గించుకుని, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాన్ని కిరణ్‌ ప్రభుత్వం తీసుకువస్తుందని తామంతా ఆశించామని ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజల నుంచి కేవలం నోట్లు దండుకోవడమే పనిగా కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని రూపొందించిందని ఆరోపించారు. మద్యం వల్ల మన రాష్ట్రంలో ఎన్నో దురదృష్టకర సంఘటనలు జరుగుతున్నాయన్నారు. సాక్షాత్తూ అసెంబ్లీ స్పీకర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కూడా దీనికి మినహాయింపు లేదన్నారు. అత్యాచారాల్లో దేశంలోనే మన రాష్ట్రమే మొదటి స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. మద్యం సేవించి మహిళలను వేధిస్తున్న సంఘటనలు రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సుమారు 30 వేలు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. మద్యం తాగి ప్రమాదాలు చేయడంలో కూడా మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. మద్యం వల్ల జరుగుతున్న మరెన్నో వెలుగులోకి రాని దురదృష్టకర సంఘటనలు మన రాష్ట్రంలో జరుగుతున్నాయని ఆయన విచారం వ్యక్తంచేశారు.

మద్యం పాలసీపై కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఈ నెల 22 శనివారంనాడు 357, 358  నెంబర్లతో రెండు జి.ఓలను రహస్యంగా విడుదల చేసి, దాచిపెట్టుకున్నదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, తాజా మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం నిర్ణయించిందని మీడియాలో కథనాలు వచ్చిన తరువాత ప్రభుత్వం‌ హడావుడిగా సోమవారంనాడు బయటపెట్టిందన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో మద్యాన్ని నియంత్రించే ఒక మంచి విధానాన్ని ప్రభుత్వం తీసుకువస్తుందని ఆశించామని ప్రవీణ్‌రెడ్డి అన్నారు. అయితే, మద్య పానాన్ని మరింత ప్రోత్సహించేలా, మద్యం విక్రయాలు పెంచి, ఆదాయాన్ని మరింతగా పెంచే విధంగా కిరణ్‌ ప్రభుత్వం పాలసీని ప్రకటించిందని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న దాదాపు ఆరు వేల మద్యం దుకాణాలను బార్లుగా మార్చే విధంగా ప్రభుత్వం పాలసీ చేసిందని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో సుమారు రెండు లక్షల అనధికార బెల్టు దుకాణాలు రాష్ట్రంలో ఉండగా వాటి తొలగించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పకుండానే పాలసీ ప్రకటించడమేమిటని నిలదీశారు. అక్కడే తాగండి, అక్కడే దొర్లండి, అక్కడే చంపండి, అక్కడే తాగి చావండి అనే విధంగా కొత్త మద్యం పాలసీ ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో ఎప్పుడూ లేని విదంగా రికార్డు స్థాయిలో రెండేళ్ళలో 7.40 కోట్ల లీటర్ల మద్యం ఉత్పత్తి చేయడానికి దాదాపు 35 జిఓల ద్వారా  కిరణ్‌కుమార్‌రెడ్డి అనుమతి ఇచ్చారని దుయ్యబట్టారు.

మన రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా చేయాలని డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి కలలు కంటే ఆయన రెక్కల కష్టం మీద వచ్చిన అధికారాన్ని అనుభవిస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డి మద్యాంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారని ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. కిరణ్‌ ప్రభుత్వం విడుదల చేసిన కొత్త మద్యం పాలసీ బంగారుతల్లుల జీవితాలను చిదిమేసేలా లేదా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఎందుకు ఆడపిల్లగా పుట్టాను, ఎందుకు ఈ రాష్ట్రంలో పుట్టాను అని ప్రతి మహిళా సిగ్గుతో తల వంచుకునే విధంగా కిరణ్‌కుమార్‌రెడ్డి తీసుకువచ్చిన మద్యం పాలసీ ఉందని దుయ్యబట్టారు.

 ప్రజా వ్యతిరేక, మహిళా వ్యతిరేక పాలసీ తెచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్ష నేత, బెల్టు షాపుల సృష్టికర్త చంద్రబాబు నాయుడు టిడిపి అధికారంలోకి వస్తే సరసమైన ధరలకే మద్యాన్ని సరఫరా చేస్తామంటూ ప్రకటిస్తున్నారని ప్రవీణ్‌రెడ్డి విమర్శించారు. గాలిలో దీపంలా ఉండి, ప్రజావ్యతిరేక చర్యలు చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని చంద్రబాబు కాపాడుతున్నారని ఆరోపించారు.

Back to Top