తెలుగు ప్రజలకు వైయస్‌ జగన్‌ ఉగాది శుభాకాంక్షలు

రేపు అమరావతిలోని స్వగృహంలో వేడుకలు

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక పత్రికా ప్రకటన విడుదలైంది. శ్రీ వికారి నామ సంవత్సరం పర్వదినం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఈ ఉగాది రాష్ట్ర ప్రజల జీవితాల్లో అంతులేని ఆనందం తీసుకురావాలని, రైతులు, నిరుపేదలు, సామాన్యులు, కార్మికులు సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరం అంతా సుఖశాంతులతో వర్థిల్లాలని వైయస్‌ జగన్‌ ఆకాంక్షించారు. 

నూతన సంవత్సరంలో సకాలంలో వానలు పడి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని జననేత అన్నారు. పాడి పంటలతో రైతులు వర్థిల్లాలని, పల్లెలు కళకళలాడాలని, సకల వృత్తులూ పరిఢవిల్లాలని తెలుగు రాష్ట్రల ప్రజలంతా అభివృద్ధి ఫలాలను మెండుగా అందుకోవాలని ఆకాంక్షించారు. షడ్రుచుల ఉగాది తెలుగువారి ఎనలేని జీవితాల్లో ఆనందం, ఐశ్యర్యం తీసుకురావాలని కాంక్షించారు. 

ఉగాది పండుగ సందర్భంగా ఏప్రిల్‌ 6వ తేదీన వైయస్‌ జగన్, పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ, వైయస్‌ షర్మిల ప్రచార సభలకు విరామం ప్రకటించారు. అమరావతిలోని తన స్వగృహంలో ఉగాది పండుగను వైయస్‌ జగన్‌ జరుపుకోనున్నారు. 

 

Back to Top