మా సవరణలకు ఒప్పుకుంటేనే భూ బిల్లుకు మద్దతు: మేకపాటి

హైదరాబాద్: ఆదివారం లోటస్పాండ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్లమెంటరీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రస్తుత పార్లమెంటు సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంపీలతో చర్చించారు. సమావేశాల వివరాలను ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మీడియాకు వివరించారు.

భూసేకరణ చట్టంపై అనుసరించాల్సిన వ్యూహాంపై ఈ సమావేశంలో చర్చించామన్నారు. బహుళ పంటలు పండే భూములను ఈ చట్టం ద్వారా సేకరించడానికి తాము వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. సామాజిక ప్రభావాన్ని అంచనా వేయకుండా చట్టాన్ని తీసుకొస్తే తాము మద్దతివ్వబోమని తేల్చి చెప్పారు. తాము చెప్పే ఈ రెండు సవరణలు చేస్తేనే బిల్లుకు మద్దతిస్తామన్నారు. ఇదే అంశాన్ని ప్రధానంగా సభలో లేవనెత్తుతామన్నారు.  ప్రభుత్వం అంగీకరించకుంటే సవరణలు ఇచ్చి డివిజన్ కోరుతామని చెప్పారు.

ఏపీకి ప్రత్యేక హోదాపై పార్లమెంటులో పోరాడాలని తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తమకు సూచించారని మేకపాటి తెలిపారు. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఇదే విషయాన్ని పార్లమెంటులో ప్రకటించారని.. అలాగే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్యనాయుడు కూడా ఐదేళ్లు కాకుండా పదేళ్లు ప్రత్యే హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయం మేకపాటి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

కాంగ్రెస్, బీజేపీలు ఒకే మాటపై ఉంటే ప్రత్యేక హోదా తప్పకుండా ఆంధ్రప్రదేశ్కు వస్తుందని ఆయన స్పష్టం చేశారు.  పోలవరం ప్రాజెక్టు అంశాన్ని కూడా పార్లమెంటులో లేవనెత్తుతామని చెప్పారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి అరకొర నిధులు కాకుండా మరిన్ని నిధులు కేటాయించి మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని మేకపాటి వెల్లడించారు.
Back to Top