ప్రశ్నిస్తా అని వచ్చిన వ్యక్తి లాలూచీ పడ్డాడు

ట్విటర్‌లో వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
 

 హైదరాబాద్‌ : ప్రశ్నిస్తానని వచ్చిన వ్యక్తి దొంగతో కలిసిపోయాడని పరోక్షంగా జనసేనాని పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ట్విటర్‌ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్‌ల రహస్య ఒప్పందంపై ధ్వజమెత్తారు. ‘నిటారుగా, నిక్కచ్చిగా నిలబడాల్సిన ప్రశ్న...మోచేతి నీళ్లు తాగేందుకు అడ్డంగా వంగి పోయింది. ప్రశ్నిస్తా అని వచ్చిన వ్యక్తి లాలూచీ పడ్డాడు. పోలీసులాగా వ్యవహరించాల్సిన వాడు దొంగతో కలిసి పోయాడు.  దోపిడీ సొమ్ముకు కాపలా కుక్కలా మారాడు. ప్రజలు వదుల్తారా? దుడ్డు కర్రలతో వెంటపడ్డారు.’ అని ఘాటుగా ట్వీట్‌ చేశారు.

ఇక ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో వైయ‌స్ఆర్‌ సీపీ సైనికులు అప్రమత్తంగా ఉండాలని విజయసాయి రెడ్డి సూచించారు. చంద్రబాబు ఆయన అనుబంధ పార్టీలు దేనికైనా తెగించడానికి సిద్ధమయ్యాయని, ఓటమి తప్పదని భావించి హింసాత్మక దాడులకు కుట్రపన్నుతున్నాయన్నారు. ఎన్నికలను వాయిదా వేయించే ప్రయత్నం చేస్తున్నాయని, సహనంతో దాడులను అడ్డుకోవాలని, ప్రజలకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

జనసేన, బిఎస్పీ,సీపీఐ, కాంగ్రెస్ అభర్థుల జాబితా చంద్రబాబే తయారు చేశారని ఆరోపించారు. వైయ‌స్ఆర్‌ సీపీ ఓట్లు చీల్చడానికి నిధులు సమకూర్చి బరిలోకి దించుతున్నారన్నారు. ఇదంతా 30-40 ఏళ్ల కిందటి పనికి రాని ఫార్ములానని, చిల్లర పార్టీలకు ఓటేసి తమ హక్కును వృథా చేసుకునేంత అమాయకులేం కాదన్నారు.

ప్యాకేజీలు తీసుకుని ఎన్నికల వేళ వచ్చిపోయే పార్టీలకు, నాయకులకు గట్టి గుణ పాఠం చెప్పాలని, ఇంకో సారి ప్రజల ముందుకు రావడానికి భయపడేలా తీర్పు ఉండాలని పిలుపునిచ్చారు. పవన్ కల్యాణ్ ఉన్మాదం కట్టలు తెంచుకుందని, ప్యాకేజీ ముట్ట చెప్పిన యజమానికి సర్వీస్ ఇవ్వలేక పోతున్నానని టెన్షన్ పడుతున్నాడని, తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టయినా చంద్రబాబు కళ్లలో ఆనందం చూడాలనుకుంటున్నాడని మండిపడ్డారు. ఇద్దరు కలిసినా,ఇంకో నలుగురు వచ్చినా ఫలితం ఏక పక్షంగానే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top