విద్యుత్‌ చార్జీలపై ఉద్యమం ఉధృతం

హైదరాబాద్, 30 మార్చి  2013: విద్యుత్‌ చార్జీల పెంపుపై గ్రామీణ స్థాయి నుంచి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమాలు మరింత తీవ్రతరం చేస్తుందని కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్‌ హెచ్చరించారు. విద్యుత్‌ చార్జీలు పెంచి ప్రజలపై రూ. 6,500 కోట్ల ఆర్థిక భారం మోపిన ఈ ప్రజాకంటక ప్రభుత్వం కళ్ళు తెరుచుకునేలా చేస్తామని ఆయన ప్రకటించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యుత్‌ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆయన ప్రజలు, పార్టీలకు పిలుపునిచ్చారు. విద్యుత్‌చార్జీలను పెంచుతూ ఈఆర్‌సీ శనివారం ప్రకటన చేసిన వెంటనే బాజిరెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వం తీరును తీవ్రంగా ఖండించారు. ఈ ప్రభుత్వానికి ఒక్కక్షణం కూడా అధికారంలో కొనసాగే అర్హత లేదన్నారు.

పెంచిన విద్యుత్‌ చార్జీలు పెంచాలంటూ ఒక పక్క ప్రతిపక్షాలన్నీ తీవ్రంగా ఉద్యమాలు చేస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని బాజిరెడ్డి గోవర్ధన్‌ దుయ్యబట్టారు. విద్యుత్‌ చార్జీలను రూ. 3,500 కోట్లు పెంచుతామని ఈఆర్‌సీ విజ్క్షప్తి చేస్తే అంతే కాదు మొత్తం రూ. 6,500 కోట్లు పెంచమని రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రజా కంటక కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరు కారణంగా రాష్ట్ర ప్రజలపై ఈ అధిక ఆర్థిక భారం పడుతున్నదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత 2009 ఫిబ్రవరి 9న ఇచ్చిన ప్రకటనలో చెప్పిన మాటలను బాజిరెడ్డి చదివి వినిపించారు. 'ఇచ్చిన మాట తప్పలేదు. తొలి ఐదేళ్ళూ కరెంటు చార్జీలు పెంచలేదు. మళ్ళీ మాట ఇస్తున్నా.. ప్రజానీకమే నా ఆరాధ్య దైవం. వారి ఆశీస్సులతో మరో ఐదేళ్ళు పెంచేది లేదు' అని పేర్కొన్న విషయాన్ని బాజిరెడ్డి ప్రస్తావించారు.

ఆ రోజు ఆయన ఇచ్చిన మాటను ప్రస్తుత ప్రభుత్వం నిలబెట్టలేదని బాజిరెడ్డి దుయ్యబట్టారు. మహానేత పరిపాలనలో అనేక పథకాలను అమలు చేశారన్నారు. ఒక్క రూపాయి కూడా చార్జీలు పెంచకుండా, లైన్‌ లాసెస్‌ను నియంత్రించి  రూ.7,౦౦౦ కోట్లు ఆదా చేశారని పేర్కొన్నారు. ఇప్పటి ప్రభుత్వం ఆరు స్లాబులుగా ఉన్న విద్యుత్‌ చార్జీల్లో కేవలం కొన్ని స్లాబుల్లో ఉన్న వారికి మాత్రమే కొంత వెసులుబాటు కల్పించి, 500 పైబడి విద్యుత్‌ వినియోగించిన వారు రూ. 8.3౦ చొప్పు బిల్లు కట్టాలని నిర్ణయించడమేమిటని ఆయన ప్రశ్నించారు.

విద్యుత్‌ను సక్రమంగా సరఫరా చేయకుండానే దోపిడీ దొంగలా ఈ ప్రభుత్వం చార్జీలు పెంచిందని బాజిరెడ్డి దుయ్యబట్టారు. కరెంటు కోతల కారణంగా పరిశ్రమలు మూతపడి 20 లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఇంతలా ప్రజాద్రోహానికి పాల్పడిన కిరణ్‌ కుమార్‌రెడ్డి అధికారంలో ఏ ముఖంతో కొనసాగుతున్నారని నిలదీశారు. పెంచిన చార్జీలను భరించలేమని ప్రజలంతా ముక్తకంఠంతో మొత్తుకుంటుంటే చంద్రబాబు నాయుడు సిగ్గులేకుండా ఈ భారం మహానేత వైయస్‌ వల్లే అని చెప్పడం ఏమిటని దుమ్మెత్తిపోశారు. ఇలాంటి వ్యక్తులు అధికారంలో, ప్రతిపక్షంలో ఉండడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
Back to Top