విద్యుత్‌ చార్జీలపై త్వరలో ఉద్యమ కార్యాచరణ

హైదరాబాద్‌, 5 జనవరి 2013:‌ విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదన విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజల పక్షాన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టనున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి బి. జనక్‌ప్రసాద్‌ తెలిపారు. వైయస్‌ఆర్‌సిపి అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సూచనలతో త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలోని పేదలు, మధ్య తరగతి వర్గాలపై పెను భారం మోపేందుకు స్లాబులు కుదించి చార్జీల మోత మోగించేందుకు కిరణ్‌ కుమార్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కరెంటు బిల్లులతో పాటు సర్దుబాటు చార్జీల పేరుతో ఇప్పటికే విద్యుత్‌ వినియోగదారుల నడ్డి విరిచేస్తున్న కిరణ్ ప్రభుత్వం‌ మళ్ళీ 10 వేల కోట్ల రూపాయల భారం మోపుతుండడంపై జనక్‌ ప్రసాద్‌ నిప్పులు చెరిగారు. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి విద్యుత్‌ చార్జీలు పెంచాలని ప్రభుత్వం చేస్తున్న కసరత్తుకు, దాని తీరుకు నిరసగా పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.

కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వం మన రాష్ట్ర ప్రజల మీద 2013-13లో రూ. 15 వేల కోట్ల రూపాయలు విద్యుత్‌ చార్జీలు పెంచిన వైనాన్ని జనక్‌ ప్రసాద్‌ తెలిపారు. మళ్ళీ 2013- 14వ సంవత్సరానికి వచ్చే ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి రూ.10 వేల కోట్ల రూపాయల విద్యుత్‌ చార్జీల పెంచి బాదాలని యత్నం చేస్తోందన్నారు. ప్రజల పట్ల కనీస సానుభూతి కూడా లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రజల పక్షాన నిలిచే పార్టీగా, ప్రజల పార్టీగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కొన్ని వాస్తవాలను రాష్ట్ర ప్రజలకు వివరించాలని నిర్ణయించిందన్నారు.

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత అధికారంలో ఉన్న రోశయ్య, కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వాలు ఇతర ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్ర ప్రజలపై రూ. 30 వేల కోట్ల భారాన్ని మోపాయని జనక్‌ ప్రసాద్‌ స్పష్టంచేశారు. ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి 'చీకలి కిరణ్'‌, 'కోతల కిరణ్'‌, 'బాదుడు కిరణ్'‌ అని పేరు మార్చుకుంటే మంచిదని ఆయన సలహా ఇచ్చారు. విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుకోకుండా ప్రజలపై ఆర్థిక భారం మోపడాన్ని వ్యతిరేకిం‌చే శక్తి లేని విధంగా విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ వ్యవహరిస్తోందని జనక్‌ ప్రసాద్‌ ఎద్దేవా చేశారు. సింహాద్రి, ఇతర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు ఒక్క యూనిట్‌ కూడా అదనంగా ఉత్పత్తి చేసే స్థితిలో లేవని ఆయన పేర్కొన్నారు. విద్యుత్‌ భారాన్ని ప్రజలు మోయాల్సిందే అంటూ సిఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి చెప్పడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. విద్యుత్‌ రంగానికి 16 వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్నాయని, 6 వేల కోట్లు ప్రభత్వం సబ్సిడీగా ఇస్తుందని, ఆపైన రూ. 10 వేల కోట్లు ప్రజలు భరించాల్సిందే అనడాన్ని ఆయన తప్పుపట్టారు. విద్యుత్‌ చార్జీల పెంపు కారణంగా అనేక చిన్న చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు మూతపడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వాన్ని నిలదీయని ప్రధాన ప్రతిపక్షం:
ఒక పక్కన ప్రభుత్వం ప్రజల మీద భారాల మీద భారాలు మోపుతూ నడ్డి విరిచేస్తుంటే, నిలదీసి ఖండించాల్సిన ప్రధాన ప్రతిపక్షం గాని, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గాని ఒక్క మాట కూడా మాట్లాడలేదేమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  జనక్ ప్రశ్నిస్తోందని జనక్‌ ప్రసాద్‌ తెలిపారు. కిరణ్‌ ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు కనునే ఆయన ఈ విషయంలో మాట్లాడడంలేదా? అని నిలదీశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని, దానికి టిడిపి పరోక్షంగా మద్దతుగా నిలుస్తోందని ఆయన ఆరోపించారు.

ఒక్క రూపాయి విద్యుత్‌ చార్జీలు పెంచని మహానేత వైయస్‌:
దివంగత మహానేత డాక్టర్‌‌ వైయస్ రాజశేఖరరెడ్డి తన పరిపాలనా కాలంలో ఒక్క రూపాయి కూడా విద్యుత్‌ చార్జీ పెంచని వైనాన్ని ఈ సందర్భంగా జనక్‌ ప్రసాద్‌ గుర్తు చేశారు. విద్యుత్‌ బిల్లు దాచిపెట్టుకున్నవారు వాటిని పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లం అవుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వైయస్‌ఆర్‌సిపి త్వరలోనే ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తుందని చెప్పారు.

రాష్ట్రంలో అంతర్యుద్ధం వచ్చే పరిస్థితి తెస్తున్న ప్రభుత్వం:
కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ రాష్ట్రంలో అంతర్యుద్ధం వచ్చే పరిస్థితి తీసుకువస్తోందని జనక్‌ ప్రసాద్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యార్థుల చదువుకోవాలంటే రోజులో 20 గంటలు విద్యుత్‌ ఉండడంలేదని, రైతు పంటలు పండించాలంటే విద్యుత్‌ కోతలు అడ్డంకిగా మారాయని జనక్‌ ప్రసాద్‌ తెలిపారు. రాష్ట్రంలో ఏ రంగం చూసినా విద్యుత్‌ సమస్యతో అల్లాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికి, ప్రతిపక్షం ఏమాత్రం పట్టించుకోకుండా బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందన్నారు. అధికార, ప్రతిపక్షాల తీరును రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, త్వరలోనే వాటిని తుంగలో తొక్కేందుకు సంసిద్ధం అవుతున్నారన్నారు. విద్యుత్‌ చార్జీల పెంపుపై ప్రభుత్వం, రెగ్యులేటరీ కమిషన్‌ పునరాలోచించాలని జనక్‌ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.

తాజా వీడియోలు

Back to Top