విజయమ్మ దీక్ష భగ్నానికి ప్రభుత్వం కుట్ర

హైదరాబాద్, 18 ఆగస్టు 2013:

‌శ్రీమతి వైయస్ విజయమ్మ సోమవారం నుంచి చేయనున్న 'సమర భేరీ దీక్ష'ను భగ్నం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అవనిగడ్డ ఉప ఎన్నికలలో పోటీ చేయని తమకు ఎన్నికల నిబంధన (కోడ్) ఎలా వర్తిస్తుందని ప్రశ్నించింది. ఎన్నికల కోడ్‌ లేదా మరేదో కారణం చెప్పి విజయవాడలో శ్రీమతి  విజయమ్మ దీక్షకు అనుమతి నిరాకరించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్రిక్తతలకు తావివ్వరాదనే శ్రీమతి విజయమ్మ తన దీక్షా వేదికను విజయవాడ నుంచి గుంటూరుకు మార్చుకున్నారని పేర్కొంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ‌అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

రాజకీయ డ్రామాలాడుతున్న సీమాంధ్ర కాంగ్రెస్‌ నాయకులను ప్రజలు తరిమికొట్టే రోజు త్వరలోనే వస్తుందని వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. సీమాంధ్ర ప్రజలను ఎన్ని రోజలు మోసం చేస్తారని ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నించారు. ప్రజల నుంచి పుట్టిన సమైక్య ఉద్యమాన్ని సొంతం చేసుకోవాలని కాంగ్రెస్‌ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఓట్లు, సీట్ల కోసమే టిడిపి దీక్షలకు దిగుతోందని విమర్శించారు. చంద్రబాబు నాయుడు కేంద్రంలో చక్రం కాదు కదా కనీసం బొంగరం కూడా తిప్పలేదని ఎద్దేవా చేశారు. సీమాంధ్ర ప్రజలను కాంగ్రెస్, టిడిపి నాయకులంతా కలిసి బలిపీఠం ఎక్కించారని ఆవేదన వ్యక్తంచేశారు.

అందరికీ సమన్యాయం కోసం జరుగుతున్న ఉద్యమంలో అన్ని పార్టీల కంటే వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌యే ముందు ఉందని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. సిడబ్ల్యుసి సమావేశం కంటే ముందే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్‌ అధిష్టానం తెలుగు ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని ముందే ఊహించి, పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ కేంద్ర హోం మంత్రి షిండేకి చాలా ముందుగానే ఒక లేఖ రాశారని చెప్పారు. రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకుంటున్నట్లు స్థానిక, జాతీయ చానెళ్ళకు కచ్చితమైన లీకులు ఇచ్చిన నేపథ్యంలో లేఖ రాశారన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడాన్ని అడ్డుకోవాలంటూ ఆ లేఖలో శ్రీమతి విజయమ్మ విజ్ఞప్తి చేసిన వైనాన్ని తెలిపారు. కానీ మన రాష్ట్రానికి జరగాల్సిన అన్యాయం జరిగిపోయిందని ఆవేద వ్యక్తంచేశారు. విభజన నిర్ణయం తీసేసుకుని, యుపిఎ భాగస్వామ్య పక్షాలను ఒప్పించడం, రేపో మాపో దాన్ని ప్రభుత్వ నిర్ణయంగా ప్రకటించడానికి కూడా సిద్ధమై, పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు దూకుడుగా వెళుతున్న పరిస్థితుల్లో శ్రీమతి విజయమ్మ సోమవారం నుంచి గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారని పద్మ తెలిపారు.

తెలుగు ప్రజలకు జరిగిన ఈ అన్యాయాన్ని చూసి భరించలేక బాధతో శ్రీమతి విజయమ్మ షిండేకు లేఖ రాశారని, తరువాత పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారని, అనంతరం శ్రీ జగన్మోహన్‌రెడ్డి, శ్రీమతి విజయమ్మ తమ పదవులను త్యజించారని, ఒక ప్రాంతానికి అన్యాయం జరగకూడదంటూ అన్ని ఆందోళనల్లోనూ పార్టీ ఉద్యమిస్తున్నదన్నారు. అడ్డగోలు విభజనపై ప్రభుత్వాన్ని హెచ్చరించడం, కేంద్రానికి విజ్ఞప్తి చేయడంలో, ఎమ్మెల్యేల రాజీనామా విషయంలో, సమస్యను లేవనెత్తడంలో కానీ, సీమాంధ్ర ఉద్యమంలో గొంతెత్తి మాట్లాడడంలో కాని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ముందుచూపుతో వ్యవహరిస్తోందని వాసిరెడ్డి పద్మ చెప్పారు. తెలుగు ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని తిప్పికొట్టడానికి శ్రీమతి విజయమ్మ తన ప్రాణాలకు తెగించి ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధపడ్డారని చెప్పారు.

శ్రీమతి విజయమ్మ విజయవాడలో ఆమరణ దీక్ష చేయడానికి ముందుగా నిర్ణయించారని, అయితే ఆమె దీక్షను అడ్డుకోవడానికి ఇప్పటికే పోలీసులు రకరకాల ప్రయత్నాలు చేశారని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ఎన్నికల కోడ్‌ అంటూ అడ్డంకులు కల్పించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసిందన్నారు. ప్రజల కోసం చేసే ఉద్యమం పట్ల బాధ్యత గల నాయకురాలిగా శ్రీమతి విజయమ్మ దీక్షా కేంద్రాన్ని విజయవాడ నుంచి గుంటూరుకు మార్చుకున్నారని అన్నారు. అయినప్పటికీ ఆమె దీక్షను ఏదో విధంగా ఆపించాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదన్న అనుమానాలు తమకు ఉన్నాయని పద్మ తెలిపారు.

సీమాంధ్ర కాంగ్రెస్‌ నాయకులు నిన్న నిర్వహించిన సమావేశాన్ని చూస్తే.. ఇంతగా రాజకీయ డ్రామాలు ఆడేవాళ్ళు కూడా ఉంటారా? అనే అనుమానాన్ని పద్మ వ్యక్తంచేశారు. సిఎం కిరణ్, పిసిసి చీఫ్‌ బొత్స, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్న ఆ సమావేశంలో కాంగ్రెస్‌ అధిష్టానాన్ని సమర్థిస్తూ మాట్లాడిన వారు కొందరైతే.. విమర్శించిన వారు మరికొందరుండగా వారిని కట్టడి చేస్తూ ప్రసంగించిన వారు ఇంకొందరని ఎద్దేవా చేశారు. ఒకే ప్రాంతంలోని నాయకులు ఇన్ని రకాలుగా మాట్లాడడం వెనుక కాంగ్రెస్‌ అధిష్టానం దర్శకత్వం ఉందని ఆమె ఆరోపించారు. ఇన్ని డ్రామాలకు సూత్రధారి సోనియా గాంధీ కాదా? అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. విభజనపై సిడబ్ల్యుసి నిర్ణయం తీసుకునే ముందు రోజు కూడా తాము అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తామన్నారని, శిరసావహిస్తూనే ఇప్పుడు ఈ డ్రామాలు ఆడుతున్నారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల బాగును కోరుకునే ఉంటే సిడబ్ల్యసి సమావేశం జరిగిన రోజునే సిఎం కిరణ్‌ రాజీనామా చేసి ఉండేవారని వ్యాఖ్యానించారు. టెన్‌ జన్‌పథ్‌ నుంచి సంకేతం వచ్చిన తరువాత కిరణ్‌ ఇప్పుడు సీమాంధ్ర ప్రజల మీద చిత్తశుద్ధి ఉన్నట్లు ప్రేమ ఒలకబోస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆ రోజునే ఎందుకు రాజీనామా చేయలేదని సిఎం కిరణ్‌ను నిలదీశారు.

సీమాంధ్ర కాంగ్రెస్‌ నాయకుల సమావేశంలో 'సమైక్యాంధ్ర' తప్ప మరేదైనా మాట్లాడమని బొత్స అనడాన్ని వాసిరెడ్డి పద్మ తప్పుపట్టారు. విభజన ప్రక్రియకు ఇంకా ఏడాది సమయం ఉంది.. ఈ లోపు ఏదైనా అద్భుతం జరగవచ్చనే పద్దతిలో మాట్లాడడాన్ని వేలెత్తి చూపారు. ఎన్ని రోజులు సీమాంధ్ర ప్రజలను నమ్మిస్తారని, మోసం చేస్తారని ఆమె నిలదీశారు. సిడబ్ల్యుసి నిర్ణయం శిలాశాసనం అంటూ మరొకరు మాట్లాడతారని, మరొకరేమో శిలాశాసనం కాదని, ఏదో మాయా మర్మం ఉండవచ్చంటారని ఇలా తలా ఒక రకంగా మాట్లాడి గందరగోళం సృష్టిస్తున్నారని పద్మ తూర్పారపట్టారు. సీమాంధ్రలో తలెత్తుకు తిరగలేమని, ఓట్లూ సీట్లూ రావనే బాధ తప్ప సీమాంధ్ర ఎడారిగా మారిపోతుందన్న భావన ఏ ఒక్కరికీ లేదా? అని అమె నిలదీశారు. సీటు కింద సెగ తగిలితే తప్ప సీమాంధ్ర ప్రజల గుండె మంటల వేడి అర్థం కావడంలేదా? అని ప్రశ్నించారు. సిడబ్ల్యుసి నిర్ణయం ప్రకటించిన రోజున గంగిరెద్దుల్లా తలూపుతూ రాష్ట్రానికి తిరిగివచ్చారని దుయ్యబట్టారు. ప్రజలు తిరగబడ్డాక, అనేక మంది గుండెలు ఆగిపోయిన తరువాత, సీమాంధ్ర మొత్తం చివరికి తిరుమలలో దేవుని దర్శనంతో సహా సమస్తం స్తంభించిపోయిన తరువాత సీమాంధ్ర గురించి నోరెత్తుతారా? అని ప్రశ్నించారు. సిఎం కిరణ్‌కు అసలు చీమూ నెత్తురూ ఉన్నాయా? అని పద్మ ఎద్దేవా చేశారు.

సీమాంధ్రకు అన్యాయం జరుగుతుంటే.. ఒక్క మంత్రి అయినా గవర్నర్‌కు రాజీనామాలు ఎందుకు పంపించలేదని వాసిరెడ్డి పద్మ సూటిగా ప్రశ్నించారు. గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు తమ భార్యలను పంపించడం ఏమిటని ఎద్దేవా చేశారు. సీమాంధ్ర రాష్ట్ర మంత్రులలో తమ భార్యలకు ఉన్న తెగువ కూడా లేదా? అని పద్మ నిలదీశారు. ఒక మంత్రి భార్య నిరాహార దీక్ష చేస్తే.. కొందరు మంత్రుల భార్యలు గవర్నర్‌ కలిస్తే.. మంత్రులు మాత్రం సోనియా కొంగుచాటున దాక్కుంటున్నారా? అని ఎద్దేవా చేశారు. రాజీనామాలు చేయకుండా సీమాంధ్ర మంత్రులు ఇప్పుడు ఆడుతున్న నాటకం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు సీమాంధ్రలో ఓట్లు రావు గనుక ఇప్పుడు ఇందిరాగాంధీ పేరును ఉపయోగించుకుని సీమాంధ్రలో కాంగ్రెస్‌ పార్టీ పెడతామంటూ మరో కొత్త డ్రామా మొదలుపెట్టారని విమర్శించారు. మనిషిని అడ్డంగా నరికి చంపేసి అదే శవాన్ని చూసి తానే కన్నీరు కార్చిన హంతకుని చందంగా కాంగ్రెస్‌ నాయకుల తీరు ఉందని దుయ్యబట్టారు. ఇంతలా నాటకాలాడుతున్న నాయకులను ప్రజలు చీపుళ్ళు తీసుకుని తంతారని, అదీ చాలదంటే చెప్పులతో సన్మానం చేస్తారని వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు.

సీమాంధ్ర ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని సీట్లు ఎలా తెచ్చుకోవాలని మరో కొత్త పార్టీ పెడతారా? అంటూ కాంగ్రెస్‌ నాయకులపై వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తంచేశారు. శవాల మీద పేలాలు ఏరుకునే విధంగా కాంగ్రెస్‌ నాయకుల తీరు ఉందన్నారు. సీమాంధ్ర ప్రజల మనోభావాను ఢిల్లీలో తాకట్టు పెట్టి కొత్త పార్టీ పేరుతో మరోసారి ఓట్లు ఏ విధంగా అడుగుతారని నిలదీశారు.

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన రోజునే ఆ బాటలో టిడిపి ఎమ్మెల్యేలు ఎందుకు నడవలేకపోయారని పద్మ నిలదీశారు. అప్పుడు చంద్రబాబు రెండు కళ్ళూ మూసుకుపోయాయా? అని నిలదీశారు. ప్రధానికి లేఖ రాసి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చెప్పిన సమస్యలనే ప్రస్తావించడం చంద్రబాబుకు సరికాదన్నారు. ఓట్లూ సీట్ల కోసమే విజయవాడలో దేవినేని ఉమను నిరాహార దీక్షకు చంద్రబాబు కూర్చోబెట్టారని ఆరోపించారు. శ్రీమతి విజయమ్మ దీక్ష చేస్తున్నారు కనుకే తానూ దీక్ష చేస్తానని ఉమ చెప్పిన వైనాన్ని ఆమె గుర్తుచేశారు. టిడిపి ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయరని, సీమాంధ్ర ఎడారైపోతుందని చంద్రబాబు మాట్లాడరని, పైపెచ్చు 4, 5 లక్షల కోట్లిస్తే కొత్త రాజధానిని నిర్మించుకుంటామంటూ ఒప్పుకుంటారని వేలెత్తి చూపారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాన్ని ఏ విధంగా హైజాక్‌ చేయాలని చూస్తున్న కాంగ్రెస్, టిడిపి రెండూ ద్రోహ పార్టీలని పద్మ అభివర్ణించారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ‌ఆంటోని కమిటీకి వైయస్ఆర్‌ కాంగ్రెస్ ‌పార్టీ చెప్పాల్సిందేమీ లేదని ఆమె స్ఫష్టం చేశారు.

తాజా ఫోటోలు

Back to Top