హైదరాబాద్, 6 మార్చి 2013: మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై అసత్య ప్రచారం చేసినా, వారి జోలికి వచ్చినా సహించేది లేదని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. దమ్ముంటే బ్రదర్ అనిల్ కుమార్ పంపించే క్రిమినల్, పరువునష్టం నోటీసులకు సమాధానం చెప్పాలని అసత్య ప్రచారం చేసేవారికి ఆయన సవాల్ విసిరారు. మహానేత వైయస్ కుటుంబంలో ఎవ్వరినీ అసత్య ప్రచారకులు బ్రతకనివ్వరా? అని జూపూడి నిలదీశారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు బినామీలా కారుకూతలు కూసే ముందు బిజెపి అధికార ప్రతినిధి ప్రభాకర్ ఇంగ్లీషు అక్షరాలు నేర్చుకోవాలని హితవు పలికారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో జూపూడి టిడిపి నాయకులు, బిజెపి ప్రభాకర్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహానేత వైయస్ ఆశయాలను ముందుకు తీసుకువెళుతున్న కుటుంబంపై విషప్రచారం చేయడం తగదని అన్నారు.
కొన్ని పార్టీలు విలువలను మరిచిపోయాయని, మానవతా దృక్పథాన్ని విస్మరించిన కొందరు ఆ పార్టీల నాయకులు అసహ్యకరమైన రీతిలో వ్యక్తిగత ఆరోపణలకు పాల్పడుతున్నారని జూపూడి ప్రభాకరరావు ఆరోపించారు. రాజకీయాలకు టిడిపి పనికిరాదని విజ్ఞులైన రాష్ట్ర ప్రజలు 2004, 09 ఎన్నికల్లో ఓడించారని వ్యాఖ్యానించారు. అయినా అసత్య ప్రచారాలు చేసి ఏదో విధంగా గెలవాలని చూసిన ఆ పార్టీని ప్రజలు మరింత దూరం విసిరేశారని అన్నారు. నిస్సిగ్గుగా అధికార పక్షంతో చేతులు కలిపిన చంద్రబాబు నాయుడు మరణించిన మహానేత డాక్టర్ రాజశేఖరరెడ్డి కుటుంబం మీద అసత్య ప్రచారం చేయిస్తూనే ఉన్నారని దుయ్యబట్టారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు టిడిపిని ప్రతిపక్షంగా కూడా పనికిరాదని నిరూపించారన్నారు. తన అనుకూల పత్రికలో, మీడియాలో వైయస్ కుటుంబంపై రోజూ విష ప్రచారం చేయిస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
జననేత శ్రీ జగన్మోహన్‌రెడ్డిపై తాను చెప్పే అబద్ధాలను విజ్ఞులైన ప్రజలు విశ్వసించకపోవడంతో తన బినామీలతో కూడా దుష్ప్రచారం చేయిస్తున్నారని జూపూడి ప్రభాకర్‌రావు దుయ్యబట్టారు. శ్రీ జగన్‌ను జైలుకు పంపించే వరకూ చంద్రబాబు ఏడ్చారని, ఆయన కుటుంబ సభ్యుడైన బ్రదర్ అనిల్ కుమార్‌పై ఇప్పుడు విషప్రచారం చేస్తున్నారన్నారు. బ్రదర్ అనిల్ స్నేహితులకు ఏవో కంపెనీలుంటే వారంతా బినామీలే అని ఆరోపించడాన్ని జూపూడి తీవ్రంగా ఖండించారు. బ్రదర్ అనిల్‌కు అసలు స్నేహితులే ఉండకూడదని వారంతా భావిస్తున్నారా? అని నిలదీశారు. శ్రీమతి షర్మిల రెండవసారి పాదయాత్రకు వెళుతున్న సమయంలోనే ఈ ఆరోపణలు ఎందుకు చేయాల్సి వచ్చిందని నిలదీశారు. శ్రీమతి షర్మిల పాదయాత్రకు వస్తున్న విశేష ఆదరణ చూసి ఈ దుర్మార్గమైన ప్రచారానికి తెరతీశారని ఆరోపించారు. చివరికి బ్రదర్ అనిల్ కుమార్ తన బిడ్డల మీద ప్రమాణం చేయించే వరకూ తీసుకువెళ్ళారని విమర్శించారు. తమ బిడ్డలపై ప్రమాణం చేసి తాము చెప్పేది నిజమే అని వైయస్ కుటుంబంపై అభాండాలు వేసేవారు చెప్పగలరా అని జూపూడి ప్రశ్నించారు.
ప్రజల సమస్యలు పట్టించుకోని నేతలంతా మహానేత కుటుంబంపై విమర్శలు చేస్తున్నారని జూపూడి దుయ్యబట్టారు. చంద్రబాబు బినామీగా మాట్లాడుతున్న బిజెపి అధికార ప్రతినిధి ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ చెప్పేవన్నీ అబద్ధాలే అన్నారు. గతంలో టిడిపి చేసిన ఆరోపణలనే ఇప్పుడు ప్రభాకర్ 'కొత్త సీసాలో పాత సారా' మాదిరిగా ఇప్పుడు చేస్తున్నారన్నారు. మత ప్రచారకులు వ్యాపారాలు చేయకూడదా? అని ప్రశ్నించారు. క్రైస్తవులు ప్రార్థనలే చేయకూడదన్నట్లు ప్రభాకర్ మాట్లాడే తీరు ఉందని దుయ్యబట్టారు. బిజెపితో వైయస్‌ఆర్‌సిపికి ఎలాంటి విభేదాలూ లేవని చెబుతూ, ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ తీరును జూపూడి తప్పుపట్టారు. బ్రదర్ అనిల్‌కుమార్‌పై ఆరోపణలు చేసే అధికారం ఆయనకు ఎవరిచ్చారని నిలదీశారు.
రానున్న ఎన్నికల్లో టిడిపికి 26 కు మించి స్థానాలు వచ్చే పరిస్థితి లేదని అనేక సర్వేలు తేల్చి చెబుతున్న వైనాన్ని జూపూడి ప్రభాకర్ ప్రస్తావించారు. ఈ సర్వేల ఫలితాలతో దిమ్మదిరిగిన చంద్రబాబు ఇప్పుడు బిజెపితో పొత్తు పెట్టుకునే క్రమంలోనే ప్రభాకర్‌ను బినామీగా వాడుకుంటున్నారని ఆరోపించారు. మహానేత వైయస్ కుటుంబంపై ఆరోపణలు చేస్తున్న వారికి అసలు గుండె ఉందా? అన్న అనుమానాన్ని జూపూడి ప్రభాకర్‌రావు వ్యక్తంచేశారు. చేతనైతే ప్రజల పక్షాన పోరాటం చేయాలని టిడిపి, బిజెపిలకు జూపూడి సూచించారు.
ప్రజల పక్షాన ధైర్యంగా నిలబడి పోరాటాలు చేసింది, చేస్తున్నదీ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి అని ఆయన పేర్కొన్నారు. వైయస్ కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారందరికీ మరో వారం రోజుల్లో క్రిమినల్, పరువునష్టం నోటీసులు రానున్నాయని జూపూడి తెలిపారు. రాజకీయాలతో ఎలాంటి సంబంధమూ లేని బ్రదర్ అనిల్‌కుమార్‌పై రాజకీయ పార్టీలు విష ప్రచారం చేస్తే వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సహించబోదని జూపూడి ప్రభాకర్‌రావు హెచ్చరించారు.