టిడిపి చెబితే చేస్తారా?

హైదరాబాద్, 9 జూన్‌ 2013 :

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి, ఆడిటర్‌ విజయసాయి రెడ్డిల్లో ఒకర్ని చంచల్‌గూడ జైలు నుంచి మరో జైలుకు పంపించాలంటూ శనివారం కోర్టులో సిబిఐ మెమో దాఖలు చేసిన తీరును వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. అంతకు రెండు రోజుల ముందు చంద్రబాబు నాయుడి చెంబు బ్యాచ్‌కు చెందిన రేవంత్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడడిన విషయాన్నే సిబిఐ మెమోలో చేర్చడంపై అనుమానాలు వ్యక్తంచేసింది. ముద్దాయిలను వేర్వేరు జైళ్ళలో ఉంచాలని సిబిఐ ఇప్పటి వరకూ కోరని వైనాన్ని గుర్తుచేసింది. చంద్రబాబు, అతని చెంబు బ్యాచ్‌ ఏది చెబితే అది సిబిఐ చేస్తుందా? అని నిలదీసింది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆదివారం సాయంత్రం పార్టీ కేంద్ర‌ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సిబిఐ తీరుపై నిప్పులు చెరిగారు.

శ్రీ జగన్‌ను మానసికంగా హింసించి, రాజకీయంగా లబ్ధి పొందాలని కాంగ్రెస్‌, టిడిపిలు చూస్తున్నాయని అంబటి రాంబాబు ఆరోపించారు. అందుకోసం సిబిఐని, జైలు అధికారులను, పోలీసు యంత్రాంగాన్ని పావుగా వాడుకుంటున్నాయని దుమ్మెత్తిపోశారు. దమ్ము, ధైర్యం ఉంటే శ్రీ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోండి పిరికిపందల్లారా! అని ఆయన సవాల్‌ చేశారు. కేవలం సాక్ష్యాలు తారుమారు చేస్తారనే నెపంతోనే శ్రీ జగన్‌ను జైలులో నిర్బంధించించారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని చీల్చి మానవత్వ విలువలను మంట కలిపిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఆనం సోదరులకు పిచ్చి ముదిరినట్లుందని, 2014లో ఆ పిచ్చి అంతా వదులుతుందని అంబటి హెచ్చరించారు.

శ్రీ జగన్‌, విజయసాయిరెడ్డి, సునీల్‌రెడ్డి ఒకే జైలులో ఉంటే కేసు నుంచి ఎలా తప్పుకోవాలని మాట్లాడేసుకుంటారని, అలా తప్పుకునే ప్రయత్నం చేస్తారని, ఒకే జైలులో వారు ఉండడానికి వీల్లేదని చంద్రబాబు ఆదేశం మేరకు ఆయన చెంబు గ్యాంగ్‌ సభ్యుడు పత్రికా ముఖంగా మాట్లాడారన్నారు. అంతకు ముందొక పెద్ద మనిషి చంచల్‌గూడలో ఏమి జరుగుతున్నది? ఆ జైలులో శ్రీ జగన్‌ అన్ని సుఖాలనూ అనుభవిస్తున్నారని, ములాఖాత్‌లు జరుగుతున్నవ్యక్తుల వివరాలు కావాలని, అనేక మంది రాజకీయ నాయకులు ఆ వ్యక్తులను కలుసుకుంటున్నారనే విషయాలను వ్యక్తం చేశారన్నారు. ఇవన్నీ జరిగిన తరువాతే సిబిఐ మెమో ఫైల్‌ చేయడాన్ని అంబటి తప్పుపట్టారు. దీనితో జైలు అధికారులు నిర్బంధాన్ని మరింతగా పెంచివేశారని ఆయన ఆరోపించారు.

సిబిఐ ఫైల్‌ చేసే చార్జిషీట్లలో అంతకు ముందు చంద్రబాబు నాయుడు తయారు చేసిన నోట్సునే పొందుపరిచే దుస్థితికి దర్యాప్తు సంస్థ దిగజారిపోయిందని అంబటి విమర్శించారు. దీన్ని చూస్తే ఈ మొత్తం కథంతా చంద్రబాబు నాయుడే నడిపిస్తున్నట్లుగా తమకు అర్థం అవుతోందన్నారు. ఉగ్రవాదులకు సంబంధించిన కేసుల్లో కూడా ముద్దాయిలను వేర్వేరు జైళ్ళలో ఉంచాలని ఏ దర్యాప్తు సంస్థ కూడా మెమో దాఖలు చేసిన సందర్భాలు లేవని అంబటి గుర్తుచేశారు. జైలులో ఉన్న శ్రీ జగన్మోహన్‌రెడ్డిని అనేక మంది రాజకీయ నాయకులు కలుసుకుంటున్నారని కాంగ్రెస్‌, టిడిపి నాయకులు బాధపడిపోతున్నారని వ్యాఖ్యానించారు.

అసెంబ్లీ స్పీకర్‌గా, అంతకు ముందు న్యాయవాదిగా పనిచేసిన టిడిపి నాయకుడు యనమల రామకృష్ణుడికి 'చదవేస్తే ఉన్న మతి పోయినట్లుగా ఉంద'ని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. శ్రీ వైయస్‌ జగన్‌ శిక్ష అనుభవిస్తున్న నేరస్థుడు కాదన్న విషయాన్ని యనమల గ్రహించాలని ఆయన సూచించారు. నేరారోపణ చేయబడిన నిందితుడు మాత్రమే శ్రీ జగన్‌ అనే జ్ఞానాన్ని కోల్పోవద్దని సలహా ఇచ్చారు. యనమల మాట్లాడే తీరును బట్టే చంద్రబాబు నాయుడి కక్ష స్వభావం అర్థం అవుతోందన్నారు. చంద్రబాబు కుట్రల్లో యనమల ఎప్పుడూ భాగస్వామి అవుతూనే ఉన్నారన్న విషయాన్ని అంబటి గుర్తుచేశారు.‌ ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచినప్పుడు చంద్రబాబును సిఎం చేయడంలో స్పీకర్‌గా ఉన్న యనమల కీలకమైన పాత్ర పోషించారని ఆరోపించారు. వెన్నుపోటు పొడిచింది చంద్రబాబే అయినా, కత్తి మాత్రం యనమలే అని ప్రజలందరికీ తెలుసన్నారు. అలాంటి యనమల ఇప్పుడు సమాచార హక్కు చట్టం కింద పోలీసులకు, కేంద్ర హోం మంత్రికి లేఖలు రాయడం సబబు కాదని హెచ్చరించారు.

నేరం రుజువై, శిక్ష అనుభవిస్తున్న వారికి ఎన్ని ములాఖత్‌లు ఇవ్వాలన్నది జైలు మాన్యువల్‌లో ఉంటుంది తప్ప, జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్న వ్యక్తికి ములాఖత్‌లు ఎన్ని ఇవ్వాలన్నది జైలు అధికారుల విచక్షణకు సంబంధించిన అంశం అని అంబటి తెలిపారు. శ్రీ జగన్‌, విజయసాయిరెడ్డి, సునీల్‌రెడ్డి ఒకే ప్రాంగణంలో ఉంటేనే సహించలేని విధంగా టిడిపి వ్యవహరిస్తున్నదని అంబటి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏడాది కాలంగా జైలులో ఉన్నప్పటికీ శ్రీ జగన్మోహన్‌రెడ్డి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పా‌ర్టీని ద్విగుణీకృత ఉత్సాహంతో నడిపిస్తున్నారని చంద్రబాబుకు బాధగా ఉందన్నారు. పాదయాత్ర పేరుతో రెండువేలకు పైబడి నడిచిన చంద్రబాబుకు కాళ్ళ నొప్పులే మిగిలాయని ఎద్దేవా చేశారు. అందుకే శ్రీ జగన్మోహన్‌రెడ్డిని వేరే చోటికి పంపిస్తేనన్నా తన పార్టీకి నూకలు మిగులుతాయన్న దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబుకు వచ్చిందన్నారు. సాధ్యం కావడంలేదు గాని శ్రీ జగన్‌ను అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని జైలుకు పంపించాలని కూడా కోరేటట్లుగా చంద్రబాబు వైఖరి ఉందన్నారు.

సిబిఐ కోర్టు వద్ద పోలీసులను శ్రీ జగన్‌ సతీమణి శ్రీమతి భారతి కొట్టారంటూ చంద్రబాబు చెంబు గ్యాంగ్‌లోని మరో పెద్ద మనిషి మాట్లాడాడని అంబటి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ దెబ్బ తిన్న పోలీసు వెనక్కి తిరిగి చూడలేదని, శ్రీమతి భారతి దాడి చేశారంటూ వర్ల రామయ్య ఆరోపించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఏమిటీ ఈ అన్యాయం అని ఆయన ప్రశ్నించారు. తన తండ్రిని నెట్టేస్తున్న పోలీసుకు ఆయన తన తండ్రి అని చెప్పడాన్ని కూడా శ్రీమతి భారతి దాడిగా అభివర్ణించడాన్ని అంబటి ఖండించారు. ఇలా టిడిపి నాయకులు ఎంత నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారో అని ఆయన వ్యాఖ్యానించారు.

చంద్రబాబు ఏ రాజకీయ కక్షతో ఈ కేసును ప్రారంభించారో దాని మీద, సిబిఐ వెనక ఉండి నడిపిస్తున్న వ్యక్తులెవరో వారి మీద దర్యాప్తు జరగాలని అంబటి డిమాండ్‌ చేశారు. సిబిఐ ఎందుకు ఇలా వ్యవహరిస్తోంది? ఈ కుట్రలో పలుపంచుకున్న వ్యక్తి చంద్రబాబా? కిరణ్‌కుమారా? సోనియా గాంధీయా? అనే దానిపై దర్యాప్తు జరగాలన్నారు. 2014లో ఎన్నికలు పూర్తయిన తరువాత వాస్తవాలు బయటికి వస్తాయో చూద్దామన్నారు. న్యాయవ్యవస్థ మీద తమకు అపారమైన విశ్వాసం ఉందని, ఎప్పటికైనా వాస్తవాలు న్యాయవ్యవస్థ ద్వారా బయటికి వస్తాయని అన్నారు. మహానేత కుటుంబాన్ని కష్టాల పాలు చేయడానికి కుట్రలు, కుతంత్రాల్లో భాగం పంచుకున్న అందరి బాగోతాలూ బహిర్గతం అవుతాయని అన్నారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డి జైలులో ఉన్నా చంద్రబాబు నాయుడికి కక్ష తీరలేదని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. జైలులో ఉన్న శ్రీ జగన్‌ మద్యం తాగుతున్నారంటూ నీతిలేకుండా, బుద్ధి లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆయన తీవ్రంగా ఖండించారు. చంద్రబాబునాయుడు ఎప్పుడూ అధికార దాహంతో రాక్షసంగా వ్యవహరిస్తారని దుమ్మెత్తిపోశారు. అధికారం కోసం ఎంతటి నీచమైన కుట్రలు, కుతంత్రాలకైనా చంద్రబాబు ఒడిగడతారన్నారు. చంద్రబాబు లాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి, కుట్రలు, కుతంత్రాలతో పుచ్చిపోయిన వ్యక్తి శిరస్సు 2014 ఎన్నికల తరువాత ప్రజల చేతిలో వెయ్యి ముక్కలు కాక తప్పదని అంబటి హెచ్చరించారు. చంద్రబాబు, ఆయన గ్యాంగు, కాంగ్రెస్‌ పార్టీ, దాని గ్యాంగుకు ప్రతిఫలం అనుభవించక తప్పదని ఆయన వ్యాఖ్యానించారు.

Back to Top