'తెలంగాణను టెన్‌ జన్‌పథ్‌లో అమ్మేసిన కేసీఆర్‌'

హైదరాబాద్‌, 7 జనవరి 2013: టిఆర్ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణ అంశాన్ని ‌ఢిల్లీలోని టెన్‌ జన్‌పథ్‌లో పదిసార్లు అమ్మేశారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు, అధికార ప్రతినిధి హెచ్‌ఎ రెహ్మాన్‌ ఆరోపించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎంఐఎంతో సంబంధాన్ని అంటగడుతూ కేసిఆర్‌ కుమారుడు కేటిఆర్‌, అల్లుడు హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలను రెహ్మాన్‌ తీవ్రంగా ఖండించారు. ఎంఐఎంతో వైయస్‌ఆర్‌సిపితో పొత్తు కేసీఆర్‌ ఇంటిలో ఖరారైందా? అని ఆయన నిలదీశారు. ఎంఐఎం పార్టీతో తమ పార్టీకి పొత్తు కుదిరిందని‌ కేసీఆర్‌కు శ్రీ జగన్మోహన్‌రెడ్డి చెప్పారా? లేక అసదుద్దీన్‌ ఒవైసీ చెప్పారా? అని నిలదీశారు. తమది పార్టీ లౌకిక వాద పార్టీ అని ఆయన వివరించారు. వైయస్‌ఆర్‌సిపి - ఎంఐఎం పార్టీల మధ్య సంబంధం ఉందంటూ కేసీఆర్‌ మాట్లాడడంపై రెహ్మాన్‌ తీవ్రంగా ప్రతిస్పందించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

టిఆర్‌ఎస్‌ పార్టీ పెట్టినప్పుడు తన కొడుకు, కూతురు అమెరికాలో ఉన్నారని, రాజకీయాల్లోకి రావద్దని వారికి చెబుతానన్నారు. అయితే, ఇప్పుడు కేసీఆర్‌కు, హరీష్‌రావుకు, కేటిఆర్‌, కవితకు ఒక్కటే పనిగా మారిందన్నారు. అది 'ఎలక్షన్‌, కలెక్షన్‌'‌ అని ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యను వారు గాలికి వదిలేశారని రెహ్మాన్‌ విమర్శించారు. తెలంగాణను పదిసార్లు తీసుకుపోయి టెన్‌ జన్‌పథ్‌లో అమ్మేశారని ఆరోపించారు. అదిగో తెలంగాణ ఇదిగో తెలంగాణ అంటూ అనేకసార్లు ప్రజలను అమాయకులను చేశారన్నారు. కేసీఆర్‌ మాయమాటల వల్ల తెలంగాణ యువకులు, విద్యార్థులు ఎంతోమంది యువకులు ప్రాణాలు విడిచిపెట్టారని రెహ్మాన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు కేసీఆర్ మీద సుమోటో కేసు నమోదు చేయాలని ఆయన అన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో బలంగా తయారవుతుండడంతో తట్టుకోలేక కేసీఆర్‌, కేటిఆర్‌, హరీష్‌రావు ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కులాలు మతాలకు అతీతంగా వ్యవహరించే లౌకిక వాద పార్టీ అని రెహ్మాన్‌ పేర్కొన్నారు. బీబీ నాంచారమ్మ ఎవరన్నది ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ తెలుసుకోవాలన్నారు. తాము తిరుపతి వెళతామన్నారు. అందులో తప్పుందా? అన్నారు. అన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించాలని, అందరు దేవుళ్ళను  మొక్కాలని ఆయన అన్నారు. అక్బరుద్దీన్‌ ఒవైసీ మాట్లాడిన తీరును తాము ఖండిస్తున్నామన్నారు. తమకు మక్కా మదీనా తరువాత మన దేశమే ముఖ్యమన్నారు.
Back to Top