స్టాంపుల కుంభకోణంలో బాబుకూ వాటా ఉందా?

హైదరాబాద్, 23 ఏప్రిల్‌ 2013: కోట్లాది రూపాయల స్టాంపుల కుంభకోణంతో, దొంగనోట్ల వ్యవహారంతో చంద్రబాబుకు సంబంధం ఉందని టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విచారణ కోరతారా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సూటిగా ప్రశ్నించింది. టిడిపి నాయకులు చేస్తున్న అక్రమాలన్నింటిలోనూ చంద్రబాబుకు ప్రమేయం ఉందని వాటిపైనా విచారణ జరగాలని రేవంత్‌రెడ్డికి డిమాండ్‌ చేసే దమ్ముందా? అని నిలదీసింది. రక్షణ స్టీల్సు బ్రదర్ అని‌ల్‌దే అంటూ టిడిపి గోబెల్సు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టింది. బాబు అబద్ధాల ఫ్యాక్టరీలో రేవంత్‌రెడ్డి మరింత అందంగా అబద్ధాలు ఆడుతున్నారని నిప్పులు చెరిగింది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు మంగళవారం సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ఒకే బిల్డింగ్‌లో ఉన్నంతమాత్రాన రక్షణ స్టీల్సు అనిల్‌ది అంటే ఎలా అని గట్టు ప్రశ్నించారు.

బయ్యారం గనులు కేటాయించింది చంద్రబాబే : 
నిజానికి బయ్యారం గనుల కేటాయింపు ప్రక్రియ 2003లోనే ప్రారంభమైన విషయాన్ని గట్టు రామచంద్రరావు వెల్లడించారు. అప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు అని, ఆయన హయాంలోనే దీని వ్యవహారం మొదలైందన్నారు. రక్షణ స్టీల్సు జగ్గయ్యపేటలో భూమి కోసం దరఖాస్తు చేసుకుందని.. స్టీల్ పైపుల తయారీ కోసమే‌ కానీ.. అది స్టీ‌ల్ ప్లాంట్ ఏర్పాటు కోసం కాదని గట్టు వివ‌రించారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని డిపాజిట్లు కూడా రాని ‌దుస్థితికి చంద్రబాబు తెచ్చారని.. చంద్రబాబును సవాల్ చేసేందుకు‌ శ్రీమతి షర్మిలే కాదు.. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లోని సాధారణ కార్యకర్తలు కూడా అర్హులే అని గట్టు పేర్కొన్నారు.

గిరిజనులను దగా చేసిందీ ఆయనే : 
వజ్రాల వేట కోసం రాయలసీమనే‌ అప్పనంగా రాసి ఇచ్చేసింది చంద్రబాబు అని గట్టు ఆరోపించారు. అందులో రేవంత్‌రెడ్డి వాటా ఎంత? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. గిరిజనుల భూములను అక్రమంగా అమ్ముకోవాలని చూసింది చంద్రబాబే అన్నారు. గిరిజన చట్టాలను ఉల్లంఘించిందీ ఆయనే అన్నారు. గిరిజనులను అన్యాయం చేసింది కూడా చంద్రబాబు నాయుడే అని రామచంద్రరావు ఆరోపణలు సంధించారు. దుబాయ్‌లో ఉన్న కోనేరు ప్రసాద్‌ను తీసుకువచ్చి అల్యూమినియం ఫ్యాక్టరీ పేరు మీద గిరిజన భూములను కొల్లగొట్టాలని చూసిందీ ఆయనే అన్నారు. గిరిజనుల భూములను గిరిజనేతరులకు ఎలా దోచిపెట్టాలో కూడా చూపించింది చంద్రబాబే అని గట్టు నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడి హయాంలో జరిగిన గనుల కేటాయింపుపైన విచారణ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని 50 సంస్థలను అప్పనంగా తన బినామీలకు అమ్మేసింది చంద్రబాబు అని గట్టు రామచంద్రరావు ఆరోపించారు.

చిరు ఉద్యోగి నామాకు ఫ్యాక్టరీని కొనే స్తోమతు ఉందా? :
రూ. 500 కోట్లతో రక్షణ స్టీల్సును ఏర్పాటు చేసే స్తోమత కొండలరావుకు లేదన్న రేవంత్‌ వ్యాఖ్యలను గట్టు తిప్పికొట్టారు. అలాంటప్పుడు చిరు ఉద్యోగిగా జీవితం వెళ్ళదీసిన నామా నాగేశ్వరరావుకు రూ. 9 కోట్లకు పాలేరు సుగర్సును కొనే ఆర్థిక స్తోమతు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు.
బయ్యారం గనులకు యజమాని ప్రభుత్వం సంస్థ అయిన ఎపిఎండిసి అని గట్టు వివరించారు. ఆ గనుల్లోని ఇనుప ఖనిజాన్ని తీసి రక్షణ స్టీల్సుకు విక్రయించడం ద్వారా వచ్చే లాభం ఆ సంస్థకే చెందేలా మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఏర్పాటు చేశారన్నారు. బయ్యారం గనులను యంత్రాల ద్వారా తవ్వడానికి వీలు కాదని, అందుకే ఆ ప్రాంతంలోని 10 వేల మంది గిరిజనులకు ఉపాధి కల్పించి ఆ సంపదను వెలికి తీయించాలని జిఓలో స్పష్టంగా పేర్కొన్నారని గుర్తు చేశారు.

శ్రీమతి షర్మిల సవాల్‌కు ‌ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం : 
చంద్రబాబుపై శ్రీమతి షర్మిల చేసిన సవాల్‌కు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికీ కట్టుబడి ఉందని గట్టు రామచంద్రరావు స్పష్టంచేశారు. వార్డు మెంబర్‌ కూడా కాని శ్రీమతి షర్మిల‌ కూడా చంద్రబాబును సవాల్ చేయడమేంటన్న రేవంత్‌ వ్యాఖ్యలను గట్టు తీవ్రంగా ఖండించారు. రేవంత్‌ వ్యాఖ్యల ద్వారా టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ను కూడా కించపరిచేవిగా ఉన్నాయని దుయ్యబట్టారు. శ్రీమతి షర్మిల క్యాట్‌వాక్‌ చేయాలంటూ రేవంత్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. మహిళలను కించపరిచే సంస్కృతి తమ పార్టీలో లేదని గట్టు అన్నారు.  శ్రీమతి షర్మిల మీద తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.

అసత్య ప్రచారం చేస్తున్న రేవంత్‌రెడ్డిపై ఖమ్మం జిల్లా వాసులు కూడా గుర్రుగా ఉన్నారని గట్టు తెలిపారు. బయ్యారంపై ఏమి జరిగిందన్నది ఖమ్మం జిల్లా టిడిపి నాయకులను అడిగినా చెబుతారని ఆయన సూచించారు. ఖమ్మం జిల్లాకు ఫ్యాక్టరీ రాకుండా చేసిన టిడిపి నాయకులను ఆ జిల్లా వాసులు క్షమించరని హెచ్చరించారు.

ప్రజల్లో తిరిగే దమ్మూ, ధైర్యం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకే ఉందని గట్టు తెలిపారు. పాదయాత్ర చేసే హక్కు శ్రీమతి షర్మిలకే ఉందన్నారు. చంద్రబాబు నాయుడు చెంపలేసుకుని పాదయాత్ర నుంచి వెనక్కి తిరిగివెళ్ళిపోవాలని గట్టు రామచంద్రరావు డిమాండ్‌ చేశారు. అబద్ధాలు చెబుతున్న టిడిపిని మూసేసుకోవాలని గట్టు హితవు పలికారు.

తాజా వీడియోలు

Back to Top