క్రికెట్‌ చరిత్రలో సచిన్‌ ఓ సువర్ణ అధ్యాయం

హైదరాబాద్, 16 నవంబర్ 2013:

ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో సచిన్‌ టెండూల్కర్ తన పేరిట ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించుకున్నారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి అభినందించారు. అసమాన ప్రతిభ, అసాధారణమైన బ్యాటింగ్‌ శైలితో క్రికెట్‌ అభిమానులను అలరించిన మాస్టర్‌ బ్లాస్టర్‌, భారతీయ క్రికెట్‌ లెజెండ్ శనివారంనాడు క్రికెట్‌ నుంచి తప్పుకున్న సందర్భంగా శ్రీ జగన్‌ శనివారం విడుదల చేసిన ప్రకటనలో మనసారా అభినందించారు.

16 ఏళ్ళ అతి చిన్న వయస్సులోనే భారత క్రికెట్‌ జట్టులో స్థానం సంపాదించిన సచిన్‌ 24 సంవత్సరాల క్రీడా ప్రస్థానంలో అనేక రికార్డులు అధిగమిస్తూ.. ముందుకు సాగారని శ్రీ జగన్‌ ప్రశంసించారు. ప్రపంచంలోనే టెస్టు మ్యాచ్‌లు, వన్డే మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు సాధించిన ఏకైక బ్యాట్సుమన్‌గా అనితర సాధ్యమైన రికార్డులను సచిన్‌ నెలకొల్పారని కొనియాడారు.

లక్ష్య సాధన కోసం పట్టుదల, దృఢచిత్తం, అంకితభావంతో సచిన్‌ సాగించిన కృషి భారత యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం అయిదని పేర్కొన్నారు. దేశంలో ఏ క్రీడాకారునికీ లేనంతగా కోట్లాది మందికి సచిన్‌ ఆరాధ్యుడయ్యారన్నారు. 24 ఏళ్ళ నిర్విరామ కృషితో ప్రపంచ దేశాలలో భారత కీర్తిపతాకను సమున్నతంగా ఎగురవేసిన సచిన్‌ టెండూల్కర్‌ క్రికెట్‌ నుంచి విశ్రమించిన సందర్భంగా... మున్ముందు కూడా ఆయనకు అంతా మంచి జరగాలని, జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నట్లు శ్రీ జగన్మోహన్‌రెడ్డి తన సందేశంలో పేర్కొన్నారు. సచిన్‌ అసమాన ప్రతిభకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించడం ముదావహమని శ్రీ జగన్‌ అన్నారు.

ప్రొఫెసర్‌ సీఎన్ఆర్‌ రావుకు అభినందనలు :

ప్రఖ్యాత శాస్త్రవేత్త, సైన్సులో విశేష పరిశోధనలు చేసిన ప్రొఫెసర్‌ సీఎన్ఆర్‌ రావుకు భారత రత్న ప్రకటించడం పట్ల శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు.

Back to Top