వాతలు పెట్టి వెన్న రాస్తున్న కిరణ్‌

హైదరాబాద్, 14 సెప్టెంబర్ 2013:

చితి మంటల మీద చలికాచుకున్న విధంగా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి తీరు, మాట్లాడే విధానం ఉందని వైయస్ఆర్ కాంగ్రెస్ ‌లెజిస్లేచర్‌ పార్టీ ఉపనాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు న్యూఢిల్లీ యాత్ర ఎందుకో ప్రజలకు వివరించాలని ఆమె డిమాండ్ చేశారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వై‌యస్ జగన్మోహన్‌రెడ్డి బెయిల్ను అడ్డుకునేందుకా లేక గతంలో తెలంగాణ‌కు అనుకూలంగా ఇచ్చిన లేఖ సరైనదే అని చెప్పుకోవడానికా అని చంద్రబాబును శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె చంద్రబాబు నాయుడు, టిడిపి నాయకుల తీరుపై మండిపడ్డారు. విభజన విషయంలో సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక చేత్తో వాత పెట్టి మరో చేత్తో వెన్న రాస్తున్నారని విమర్శించారు.

సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలో దాదాపు 41 రోజులుగా ఉద్యమం అట్టుడికిపోతుంటే తెలుగుదేశం పార్టీ గొప్పలకు పోతోందని శోభా నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల ప్రజలూ తమ జీవితాలను పణంగా పెట్టి సమైక్యాంధ్ర కోసం ఆందోళను చేస్తుంటే.. చంద్రబాబు నాయుడు తమ పార్టీ ఆఫీసులో నాయకులతో కూర్చొని తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చినందువల్ల అక్కడ ఎన్ని సీట్లు వస్తాయని, సీమాంధ్రలో ఎన్ని వస్తాయని లెక్కలు వేసుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో 30 లోక్సభ సీట్లు గెలుస్తామని చెబుతున్న ‌టిడిపిని చూసి రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు.

రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడు అన్నారు. అలాంటి చంద్రబాబు సీమాంధ్రలో ఎవరి ఆత్మ గౌరవాన్ని ఫోకస్‌ చేయడానికి బస్సు యాత్రకు వెళ్ళారని ప్రశ్నించారు. చంద్రబాబుకు భవిష్యత్తు పట్ల ఏర్పడిన అభద్రతా భావాన్ని పోగొట్టుకోవడానికి సీమాంధ్రలో తిరిగారా? అన్నారు. ఆత్మగౌరవ యాత్ర పేరుతో సీమాంధ్రలో తిరిగిన చంద్రబాబు ప్రతిరోజూ శ్రీ జగన్మోహన్‌రెడ్డి, శ్రీమతి విజయమ్మ, శ్రీమతి షర్మిలను విమర్శించడం తప్ప ప్రజలకు అంతకంటే ముఖ్యమైన సందేశం ఏమి ఇచ్చారని నిలదీశారు. రాష్ట్ర విభజన జరిగితే నష్టపోతామని కోట్లాది మంది ఆందోళన చెందుతుంటే.. తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకుంటామని ఒక్క మాట కూడా చంద్రబాబు మాట్లాడలేదని విమర్శించారు. చంద్రబాబు యాత్ర ఎన్నికల ప్రచారాన్ని తలపించిందే కాని సీమాంధ్ర ప్రాంతాల ప్రయోజనాల కోసం చేసినట్లు లేదని శోభా నాగిరెడ్డి అభివర్ణించారు.

ఒక్క వ్యక్తి శ్రీ జగన్మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక.. వ్యవస్థను భ్రష్టు పట్టించే స్థితికి చంద్రబాబు నాయుడు దిగజారారని శోభా నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాజకీయ ప్రయోజనం కోసం మన రాష్ట్రం ఎన్ని ముక్కలైనా పరవాలేదన్న విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఓట్లు, సీట్ల కోసం, అధికారం కోసం ఆయన అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు ఏమైనా కోపం ఉంటే తమపై చూపాలని, అంతేకాని రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టవద్దని, రాష్ట్రాన్ని విభజించే స్థాయికి తీసుకువెళ్ళవద్దని శోభా నాగిరెడ్డి హితవు పలికారు. తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు.

తాను రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అని గొప్పగా చెప్పుకునే చంద్రబాబు నాయుడి మాటల తీరు చూస్తుంటే.. కనీసం వీధి స్థాయి నాయకుడిగా కూడా కనిపించడం లేదన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు వచ్చిన పెద్ద సమస్యను ఏ విధంగా పరిష్కరించాలన్న దానిపై ఆయన స్పందించడంలేదని శోభా నాగిరెడ్డి విమర్శించారు. బెయిల్‌ పొందడానికి శ్రీ జగన్మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌తో డీల్‌ కుదుర్చుకున్నారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆమె తిప్పి కొట్టారు. శ్రీ ‌జగన్మోహన్‌రెడ్డిని సీమాంధ్రలో సిఎంను చేయడానికి, తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ప్రయోజనం పొందడానికి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ దోహదం చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారంటూ ఆరోపణలు చేయడాన్ని తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీతో‌ చీకటి ఒప్పందం కుదుర్చుకుంది మీరా... మేమా అని చంద్రబాబును ఆమె ప్రశ్నించారు. ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టినప్పుడు టిడిపి ఎమ్మెల్యేలకు విప్‌ ఇచ్చి మరీ ఎందుకు కాపాడారని నిలదీశారు. ఎఫ్‌డిఐ బిల్లుకు సానుకూలంగా వ్యవహరించింది చంద్రబాబు కాదా అన్నారు.

చంద్రబాబు మీద వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి సిబ్బంది లేరని నిస్సిగ్గుగా చెప్పిన సిబిఐ శ్రీ జగన్మోహన్‌రెడ్డిపై ఒకే రోజు ఎన్ని బృందాలు, ఎంత మంది అధికారులు దాడులు చేసిందీ అందరికీ తెలిసిందే అన్నారు. విచారణ పేరు మీద శ్రీ జగన్మోహన్‌రెడ్డిని తీసుకువెళ్ళి, అరెస్టు చేసి 16 నెలలుగా జైలులో నిర్బంధించారన్నారు. అయితే చంద్రబాబు నాయుడు ముందస్తు స్టేలు తెచ్చుకుని విచారణ జరగకుండా మేనేజ్‌ చేసుకున్నారన్నారు.
ఇప్పుడు శ్రీ జగన్‌ బెయిల్‌కు పిటిషన్‌ పెట్టుకుంటే.. కాంగ్రెస్‌తో కుమ్మక్కై ఆయనను బయటికి రానివ్వకుండా అడ్డుకుంటున్నది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కై ఉంటే శ్రీ జగన్‌ 16 నెలలుగా జైలులో ఉండాల్సిన అవసరమే లేదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే శ్రీ జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ వేసుకున్నారన్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి విషయంలో టిడిపి వారు అనుకున్న విధంగా జరిగితే అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచేస్తున్నట్లు అనేది చంద్రబాబు అభిప్రాయమా? అన్నారు. శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి బయటకు వస్తున్నారంటే చంద్రబాబుకు ఎందుకంత భయం పట్టుకుంటుందో అర్థంకావడం లేదని శోభా నాగిరెడ్డి అన్నారు. ఇలాగే వ్యవహరిస్తే భవిష్యత్లో ‌టిడిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కబోదని అన్నారు. కాంగ్రెస్, టిడిపిలకు వాతలు పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని శోభా నాగిరెడ్డి హెచ్చరించారు.

రాష్ట్ర విభజన జరగబోతోందని చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుంటే.. కేంద్రంలో చక్రం తిప్పిన చంద్రబాబుకు అర్థం కాలేదా? అని శోభా నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. ముందే రాజీనామాలు చేస్తే విభజన విషయంలో కొంచెమైనా కట్టడి జరుగుతుందని తామంతా పదవులను వదిలేశామని చెప్పారు. చంద్రబాబుకు మతిభ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. సమైక్యాంధ్ర అనమన్న ఉద్యమకారులపై విరుచుకుపడడం కాదు.. తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను ఉపసంహరించుకోవాలని శోభా నాగిరెడ్డి డిమాండ్‌ చేశారు. బెయిల్‌ ఇచ్చేది ప్రభుత్వమా అని టిడిపి నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యాఖ్యలను ఆమె తిప్పికొట్టారు. బెయిల్‌ కోసం వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ లాలూచీ పడిందని మీరే విధంగా ఆరోపిస్తారని నిలదీశారు. చిదంబరాన్ని చంద్రబాబు నాయుడు రహస్యంగా కలవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.

ప్రజల పక్షాన నిలిచి పోరాడుతున్నది వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అని శోభా నాగిరెడ్డి చెప్పారు. అందుకే ప్రజలు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తుంటే అది చూసి ఓర్వలేకే చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఆరోపణలను ప్రజలు నమ్మి ఉంటే.. కడప పార్లమెంటు ఎన్నికల్లో 5 లక్షల మెజారిటీతో శ్రీ జగన్మోహన్‌రెడ్డిని ప్రజలు గెలిపించి ఉండేవారు కాదన్నారు. ఆయన మాటలు నమ్మి ఉంటే.. 2009 తరువాత వచ్చిన అనేక ఉప ఎన్నికల్లో టిడిపికి డిపాజిట్లు పోగొట్టి ఉండేవారు కాదన్నారు. తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను చంద్రబాబు ఢిల్లీ వెళ్ళే లోగా వెనక్కి తీసుకుంటున్నారా? లేదా? ఆయన సమైక్యవాదా? లేక మీరు ఇచ్చిన తెలంగాణ లేఖకు కట్టుబడి ఉన్నారా స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. సీమాంధ్రుల మనోభిప్రాయాలకు చంద్రబాబు ఇచ్చిన గౌరవం ఏమిలో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

రాష్ట్రాన్ని విభజించే నిర్ణయం తీసుకుంటున్నామని సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు కాంగ్రెస్‌ అధిష్టానం ముందే చెప్పిందని శోభా నాగిరెడ్డి అన్నారు. వారికి చెప్పిన తరువాతే నిర్ణయం ప్రకటించిందన్నారు. నిర్ణయం ప్రకటించిన పది రోజుల తరువాత కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్రుల కోసం ఆతృత పడుతున్నట్లు డ్రామా ఆడారన్నారు. కిరణ్‌కు సీమాంధ్ర ప్రాంతంపై అంత అభిమానమే ఉండి ఉంటే.. సిడబ్ల్యుసిలోనే వ్యతిరేకించి ఉండాల్సిందన్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్‌ కొట్టుకుపోతుందని తెలిసిన తరువాత, తమ పార్టీ అధిష్టానం ఆదేశం మేరకే కిరణ్‌రెడ్డి డ్రామా ఆడారన్నారు. కాంగ్రెస్, టిడిపి డ్రామాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు తప్పకుండా వాతలు పెడతారని హెచ్చరించారు.

Back to Top