14,15 తేదీల్లో విజయమ్మ ఫీజుదీక్ష

హైదరాబాద్, 8 జూలై 2013:

ఫీజు రీయింబర్సుమెంట్‌ పథకాన్ని నీరుగారుస్తూ ప్రభుత్వం శనివారం విడుదల చేసిన జిఓకు నిరసనగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ ఈ నెల 14, 15 తేదీల్లో నిరాహార దీక్ష చేస్తారని పార్టీ కేంద్ర పాలక మండలి, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డాక్టర్‌ ఎం.వి. మైసూరారెడ్డి తెలిపారు. మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని యథావిధిగా అమలు చేయాల‌ని డిమాండ్‌తో ఆమె ఈ దీక్షకు పూనుకుంటున్నట్లు ఆయన వివరించారు. శ్రీమతి విజయమ్మ దీక్ష చేయబోయే వేదికను మరో రెండు, మూడు రోజుల్లో ఖరారు చేసి వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాపరెడ్డి కూడా పాల్గొన్నారు.

డబ్బులు లేని కారణంగా ఎవరూ చదువుకు దూరం కాకూడదన్న సదాశయంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్సుమెంట్‌ పథకాన్ని రూపొందించి, సమర్థవంతంగా అమలు చేశారని మైసూరారెడ్డి తెలిపారు. వెనుకబడిన కులాల విద్యార్థులు ఎంతో మంది ఈ పథకం కారణంగా ఇంజనీరింగ్, వైద్య విద్య లాంటి ఉన్నత చదువులు చదివి, మంచి మంచి ఉద్యోగాల్లో చేరి తమ కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేశారని ఆయన చెప్పారు. మానవ వనరులను అభివృద్ధి చేయడమంటే ఆర్థిక పెట్టుబడి లాంటిదన్నారు. ఇంతటి మహత్తరమైన పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం నీరుగారుస్తున్న తీరుపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ తీవ్రంగా స్ప‌ందిస్తున్నదన్నారు.

ఈ పథకాన్ని ప్రభుత్వం నీరుగారుస్తున్న తీరుకు నిరసనగా 2011లో ఇందిరా పార్కు వద్ద వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి వారం రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన విషయాన్ని మైసూరారెడ్డి గుర్తుచేశారు. అనంతరం జిల్లాల్లో నిరసన దీక్షలు చేసినప్పుడు ఒంగోలు దీక్షలో కూడా ఆయన పాల్గొన్నారన్నారు. 2012లో పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ ఫీజు దీక్ష చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

ఈ సంవత్సరం ప్రభుత్వం ఇచ్చిన జిఓ ప్రకారం ఇంజనీరింగ్ కళాశాలల్లో సుమారుగా రూ. 35 వేల నుంచి లక్షా 13 వేల వరకూ ఫీజులను ఖరారు చేసిందన్నారు. అందులో ఫీజు రీయింబర్సుమెంట్‌ కింద కేవలం రూ. 35 వేలు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తే.. మిగతా ఫీజు అంతా విద్యార్థులే చెల్లించాల్సిన దుస్థితిని తీసుకువచ్చిందని మైసూరారెడ్డి విమర్శించారు. ఇది చాలా ఘోరమైన విషయమని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పథకాన్ని ప్రభుత్వం నీరుగార్చి, చివరికి ఉన్నత విద్యాభ్యాసం చేసేవారు ఫీజు మొత్తం భారాన్ని భరించాల్సిన పరిస్థితి తీసుకురానున్నదని మైసూరారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు.

ఏటా రూ. 60 వేల కోట్లు అదనపు ఆదాయం రాష్ట్ర ఖజానాకు వస్తున్నా పేదలకు ఉపయోగపడి వారు మరింత బలోపేతం అయ్యే ఫీజు రీయింబర్సుమెంట్‌ పథకాన్ని నీరుగార్చాలని ప్రభుత్వం చూడడం దురదృష్టకరం అని ఆయన ఖండించారు. విద్యార్థులపై ఫీజు భారం వేయవద్దని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పా‌ర్టీ చేస్తున్న డిమాండ్‌ను ప్రభుత్వం వినడంలేదు కాబట్టి అందుకు నిరసనగా రెండు రోజుల పాటు నిరాహార దీక్ష చేయాలని పార్టీ నిర్ణయించిందని మైసూరారెడ్డి స్పష్టంచేశారు.

Back to Top