విభజన ప్రక్రియను తక్షణమే ఆపండి

హైదరాబాద్, 11 సెప్టెంబర్ 2013: రాష్ట్ర విభజన ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమా‌ర్ షిండేకు వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ‌ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ లేఖ రాశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆ లేఖలో ఆమె కోరారు. పెద్ద పదవిలో
ఉండి కూడా అబద్ధాలు ఎలా చెబుతున్నారని షిండేను శ్రీమతి వైయస్‌ విజయమ్మ ప్రశ్నించారు. నిజాలు దాచి
అబద్ధాలు ఎలా వల్లిస్తారన్నారు. విభజనను వైయస్ఆర్‌ కాంగ్రెస్, సిపిఎం, ఎంఐఎం పార్టీలు
వ్యతిరేకిస్తుంటే సిపిఎం మినహా అన్ని పార్టీలు అంగీకరించాయని ఏ విధంగా చెబుతారని
నిలదీశారు. రెండు ప్రాంతాలకూ సమన్యాయం చేయండి అంటే ఒక ప్రాంతానికి
న్యాయం చేయమని అర్థం కాదు కదా అన్నారు. రాష్ట్రాన్ని
విభజించాలని జూలై 30న ప్రకటన వచ్చినప్పటికీ ఆ మేరకు సంకేతాలు అందడంతో
అదే నెల 25 న వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ
ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేశారని ఆమె గుర్తు చేశారు. తాను, శ్రీ జగన్మోహన్‌రెడ్డి
నిరాహార దీక్షలు కూడా చేసిన వైనాన్ని శ్రీమతి విజయమ్మ ఆ లేఖలో ప్రస్తావించారు. రాష్ట్ర విభజనపై
ఇంత వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా ఏకాభిప్రాయం వచ్చిందని ఎలా చెబుతున్నారని అన్నారు. రాష్ట్రంలోని 60 శాతం మంది ప్రజలు
రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేస్తున్నా విభజన ప్రక్రియను ముందుకు ఎలా కొనసాగిస్తారని
ప్రశ్నించారు.

షిండేకు శ్రీమతి విజయమ్మ రాసిన లేఖ పూర్తి పాఠం
ఇదీ..

 గౌరవ కేంద్ర హోం మంత్రి వర్యులు,

శ్రీ సుశీల్ కుమార్ షిండే గార్కి,





శ్రీమతి వైఎస్ విజయమ్మ,



గౌరవ అధ్యక్షురాలు



వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
విభజనపై గత శనివారం (సెప్టెంబర్ 7, 2013) మీడియా కాన్ఫరెన్సులో మీరు చేసినట్లుగా విస్తృతంగా ప్రచురితమైన వ్యాఖ్యలను ఈ సందర్భంగా మీ దృష్టికి
తీసుకువస్తున్నాం.

‘అన్ని రాజకీయ పార్టీలు
రాతపూర్వకంగా తమ ఆమోదాన్ని తెలిపిన తర్వాతే తెలంగాణాకు అనుకూలంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ) నిర్ణయం తీసుకుంది. సీపీఎం మినహా
రాష్ట్రానికి చెందిన అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తెలంగాణాకు తమ మద్దతు ప్రకటించాయి’... మీరు
ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా పత్రికలలో ప్రముఖంగా ప్రచురితమైంది.

ఇలాంటి ఉత్తరం మీకు రాయాల్సి
వస్తుందని బాధ్యత కల్గిన ఒక రాజకీయ పార్టీగా మేం ఊహించలేదు. కానీ, మీరు
ఒక యూనియన్ హోం మినిస్టర్ గా కాకుండా కేవలం
ఒక కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిగా కొన్ని ఓట్ల కోసం,
సీట్ల కోసం మీ అధిష్టానం నిర్ణయాన్ని బలవంతంగా
రుద్దటం కొరకు మీరు వాస్తవాలను వక్రీకరించటానికి సైతం వెనుకాడకుండా సాక్షాత్తూ యూనియన్ హోం మినిస్ట్రీ ప్రతిష్ఠనే దిగజార్చటానికి కూడా వెనకాడని మీ తీరుకు మనసుకు
బాధ అనిపించి- మేము వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మీకు రాసిన లేఖలను, గౌరవ ప్రధాన మంత్రికి రాసిన లేఖలను కూడా ఈ లేఖతో పాటుగా మరోసారి మీకు పంపుతున్నాం.
మీ మాటల్లో వాస్తవ వక్రీకరణలను సరిచేసుకుంటారన్న ఉద్దేశంతోనే ఈ లేఖ పంపిస్తున్నాం.
గతంలో మీకు, గౌరవ ప్రధానికి మేం రాసిన లేఖలను ఈ ఉత్తరంతో పాటు
మీకు పంపుతున్నాం. మీరే మా లేఖలు చూసి చెప్పండి. ఆ లేఖలో మేం పేర్కొన్న ప్రధాన అంశాన్ని
మీ పరిశీలనార్థం మరోసారి యధాతథంగా దిగువున ఇస్తున్నాం...

‘రాష్ట్రంలో ఉన్న
మూడు పార్టీలు - వైయస్ఆర్ కాంగ్రెస్, ఎంఐఎం, సీపీఐ (ఎం) - ఈ మూడు కూడా ఒకే మాట చెప్తున్నాయని...న్యాయం
చేయలేకపోతే రాష్ట్రాన్ని విడగొట్టవద్దు, యధాతథంగా కలిపే ఉంచండి.
రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఒకవైపు రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు,
ఎంపీలు రాజీనామాలు చేస్తున్నపుడు, ఆ రెండు ప్రాంతాల
ప్రజలు, ఉద్యోగులు బంద్ లు, సమ్మెలు చేస్తున్నపుడు...రాజకీయ పార్టీలన్నింటి మధ్య వంద శాతం ఏకాభిప్రాయం
సాధించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్ పార్టీ ఎలా
చెప్పగలుగుతోంది? రాష్ట్రాన్ని విడగొట్టడానికి ఒప్పుకున్నది తెలుగుదేశం
పార్టీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ - ఈ ఐదు పార్టీలు మాత్రమే. ఓట్లు,
సీట్ల కోసం అధికార పార్టీ అన్యాయం చేస్తూంటే....ఓట్లు, సీట్లు పోతాయని, తమకు రావాల్సిన క్రెడిట్ రాకుండా పోతుందని ప్రతిపక్షంలో ఉన్న కొన్ని పార్టీలు విభజన ద్వారా జరిగే అన్యాయాని
గురించి స్పందించకుండా ఉంటే...ఇక ఈ రాష్ట్రం తరఫున ఇక్కడి వారి గోడు ఎవరికి చెప్పుకోవాలి?
ఇక్కడి రాజకీయ పార్టీల మధ్య నూరు శాతం ఏకాభిప్రాయం వచ్చింది అని కాంగ్రెస్ వారు చెప్పటం తప్పుదారి పట్టించటం కాదా?’


ఆంధ్రప్రదేశ్ లో ఇటు
రాజకీయ పార్టీలకు, అటు కోట్ల ప్రజలకు ఆమోదయోగ్యంగా లేనప్పుడు,
కోట్ల మంది తమకు శాశ్వతంగా అన్యాయం జరుగుతుందని ఆక్రందిస్తున్నప్పుడు...
కేంద్ర ప్రభుత్వంగా మీరు ఎలా చెప్పగలరు, విభజనకు అందరి ఆమోదం
ఉందని? ఎవరికీ అన్యాయం జరగడం లేదని. ఇలా చెప్పటం మీకు అన్యాయంగా
అనిపించటం లేదా? కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం జూలై-30న వెలువడితే, అంతకు ముందే... జూలై-25నే మా పార్టీకి చెందిన మొత్తం
ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయం కేంద్ర హోం మంత్రిగా, సీడబ్ల్యూసీలో
సభ్యునిగా ఉన్న మీకు తెలియదంటారా?

మా పార్టీ అధ్యక్షుడు, మా పార్టీ
గౌరవ అధ్యక్షురాలు తమ పదవులకు రాజీనామాలు చేయడమే గాక, విభజనకు
వ్యతిరేకంగా 12 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసింది కూడా కేంద్ర
హోం మంత్రిగా ఉన్న మీకు తెలియదంటారా? మా పార్టీ గౌరవ అధ్యక్షురాలు
శ్రీమతి విజయమ్మ ఆధ్వర్యంలో విభజనకు వ్యతిరేకంగా ఢిల్లీలో ప్రధానిని, రాష్ట్రపతిని, మిగిలిన అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను కలిసి ఒకరోజు ఢిల్లీలో దీక్ష చేసిన సంగతి కూడా మీకు తెలియదంటారా?
గతంలో కూడా మీ పార్టీకి చెందిన దిగ్విజయ్ సింగ్ గారు ఇలానే నిజాలను వక్రీకరించటం ఒక పనిగా పెట్టుకున్నారు. తను మీడియాతో మాట్లాడిన
అంశాలు వాస్తవాలను వక్రీకరించటమే అని తెలియజేస్తూ... ప్రధానమంత్రిగారికి లేఖ రాస్తూ...
మా రాష్ట్రంలో మూడు పార్టీలు విభజనకు వ్యతిరేకిస్తున్నాయి అని సుస్పష్టంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్, సీపీఐ(ఎం),
ఎంఐఎం అని చెబుతూ లేఖ రాశాం. కేంద్ర హోం మంత్రిగా ఉన్న మీకు ఆ లేఖలో
మేము సుస్పష్టంగా  ఏం చెప్పినదీ తెలియదంటారా?

మరి ఇవన్నీ తెలిసి కూడా
మీరు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన హోం మంత్రిగా కాకుండా కేవలం ఒక కాంగ్రెస్ వ్యక్తిగా,
కాంగ్రెస్ నిర్ణయాన్ని మా నెత్తిన తుపాకీ పెట్టి
మా అందరి మీదా రుద్దటానికి మీరు ఇంత అన్యాయంగా విషయాలను వక్రీకరించటం ఎంతవరకు న్యాయం?
మీరు మీ విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీల గొంతు నొక్కడానికి,
వారి వాణి దేశానికి వినపడకుండా చేయడానికి, కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని కోట్ల ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టి వారి నెత్తిన
రుద్దటం కోసం మీరు ఏకంగా నిజాలనే వక్రీకరిస్తున్నారు. అందుకే కదా మీరు ఒక ప్రభుత్వ
కమిటీ వెయ్యలేదు? వేస్తే దేశ ప్రజలందరికీ మీ అన్యాయం తెలిసిపోతుందనే
కదా? ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు మీకు అనుమానాలు ఉంటే
ఎందుకు అన్ని పార్టీలతో క్లారిఫికేషన్ తీసుకోవటం లేదు?
కేవలం మీరు అనుకున్నది చేయటం కోసం, మీరు అనుకున్నది
రుద్దటం కొరకు ఇలా వాస్తవాలను వక్రీకరించి దేశ ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం
చేయటం ఎంతవరకు న్యాయం?

కేంద్ర హోం మంత్రి పదవిలో
ఉన్న మీరు కూడా వాస్తవాలను వక్రీకరిస్తూ కాంగ్రెస్ పార్టీ
నిర్ణయాన్ని అందరి నిర్ణయంగా అందరి మీదా రుద్దేయటం ఎంతవరకు న్యాయం? ఈ రాష్ట్రంలో 60 శాతం మంది ప్రజలు గత 40 రోజులుగా అన్యాయం జరుగుతోందని రోడ్డెక్కి ఆక్రందనలు చేస్తున్నా మీ ప్రభుత్వం
పట్టించుకోవటం లేదు. రాష్ట్రం ఒకటిగా ఉన్నప్పుడే మహారాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత గానీ,
కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంలు నిండితే గానీ కింద ఉన్న మా రాష్ట్రానికి నీరు
వదలని పరిస్థితి. ఇప్పుడు మధ్యలో ఇంకొక రాష్ట్రం వస్తే- శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్ళు
ఎలా వస్తాయి? ఆ తర్వాత వచ్చే నాగార్జున సాగర్ కు నీళ్ళు ఎలా వస్తాయి? కృష్ణా ఆయకట్టులో ఉండే ప్రజలు
రోజూ కొట్టుకునే పరిస్థితి రాదా?

మా రాష్ట్రాన్ని మీరు ఒక ప్రాంతంలో
సీట్లు, ఓట్ల కోసం అడ్డగోలుగా విభజిస్తే... కుప్పం నుంచి శ్రీకాకుళం
దాకా సముద్రపు నీళ్ళు తప్ప మంచి నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? పోలవరం
ప్రాజెక్టుకు జాతీయ హోదా అని కాంగ్రెస్ అంటోంది. మధ్యలో ఇంకొక
రాష్ట్రం వస్తే- పోలవరానికి నీళ్ళు ఎక్కడ నుంచి వస్తాయి? గతంలో,
అప్పటి రాజధాని మద్రాసు నుంచి దూరం చేశారు. ఇప్పుడు పదేళ్ళలో హైదరాబాద్ ను వీడి వెళ్ళిపోమంటున్నారు. హైదరాబాద్ వదిలితే పిల్లలు
ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్ళాలి? మా రాష్ట్ర బడ్జెట్లో 50 శాతం నిధులు హైదరాబాద్ నుంచే
వస్తున్న నేపథ్యంలో ఈ డబ్బే ఖజానాకు రాకపోతే, లేదా ఈ డబ్బే వేరే
రాజధాని నిర్మాణానికి డైవర్టు చేస్తే- అప్పుడు కొత్త రాష్ట్రంలోని
ఉద్యోగులకు జీతాలు ఎలా ఇవ్వాలి?ఇప్పుడు కొనసాగిస్తున్న, ముందు
ముందు అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలకు నిధులు ఎక్కడ నుంచి వస్తాయి? హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ప్రజలు, ఉద్యోగస్తుల పరిస్థితి ఏమిటి?

మా రాష్ట్రంలోనే గ్యాస్ ఉన్నా మా అవసరాలకు వాడుకోనివ్వరు. రాష్ట్రాన్ని విభజించటం ద్వారా కోట్ల మంది
అవసరాలకు బొగ్గును కూడా దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మాకు నీరు ఇవ్వరు... హైదరాబాద్ నగరం ఇవ్వరు... మేం ఎలా బతకగలం? అని కోట్ల మంది గత 40 రోజులుగా పోరాటం చేస్తుంటే- కేంద్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు.
పైగా అన్ని పార్టీలు ఆమోదించాయని అబద్ధాలు ఆడుతున్నారు. ఎందుకంటే వచ్చే సార్వత్రిక
ఎన్నికల్లో కేవలం 10 ఎంపీ సీట్ల కోసం, ఓట్ల
కోసం ఈ రాష్ట్రంలోని కోట్ల ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. మేం మరోసారి చెబుతున్నాం.
ఈ దుర్మార్గమైన ఆలోచనల్ని కట్టిపెట్టండి. మా రాష్ట్రాన్ని విభజించకండి. సమైక్యంగానే
ఉంచండి. మా జీవితాలతో చెలగాటం ఆడవద్దు.

Back to Top