రేపటి నుంచి షర్మిల 'సమైక్య శంఖారావం'

హైదరాబాద్, 1 సెప్టెంబర్  2013: 

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే పోరాటంలో మరో అడుగు ముందుకు వేసి, సెప్టెంబర్‌ 2 నుంచి తన బిడ్డ శ్రీమతి షర్మిలను 'సమైక్య శంఖారావం' యాత్ర కోసం ప్రజల మధ్యకు పంపిస్తున్నానని శ్రీమతి విజయమ్మ తెలిపారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలి హోదాలో రాష్ట్ర ప్రజలకు ఆమె ఆదివారం ఒక బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు, సీట్లు తప్ప మరో ప్రాతిపదిక లేదని శ్రీమతి విజయమ్మ విమర్శించారు. మన రాష్ట్రాన్ని ఆ పార్టీ అడ్డంగా చీలుస్తోందని ఆమె దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ పార్టీ చారిత్రక తప్పిదం చేస్తుంటే.. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దానిని అడ్డుకోకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రజలకు చేస్తున్న అన్యాయానికి నిరసనగా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేసిన పోరాటాలను ఆమె ప్రస్తావించారు. నిజాయితీ రాజకీయాలు కొనసాగిస్తూ.. తాను గుంటూరులో చేసిన ఆమరణ నిరాహార దీక్షను, జైలు నిర్బంధంలో ఉన్నా శ్రీ జగన్మోహన్‌రెడ్డి చేసిన నిరవధిక నిరాహార దీక్షను అధికార బలంతో భగ్నంచేసిన వైనాన్ని బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

శ్రీమతి విజయమ్మ బహిరంగ లేఖ పూర్తిపాఠం :

కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఓట్లు, సీట్లు తప్ప మరో ప్రాతిపదిక లేకుండా ఈ రాష్ట్రాన్ని అడ్డంగా చీలుస్తోంది. హైదరాబాద్‌ పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, ఆ లోగా సీమాంధ్రలో వేరే రాజధాని కట్టుకోవాలని ప్రకటించి చేతులు దులుపుకొంటోంది. రాష్ట్రాన్ని ఇలా అడ్డగోలుగా విభజిస్తే.. కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సముద్రం నీళ్ళు తప్ప మంచినీళ్ళు ఎక్కడ ఉన్నాయి అనే కనీస ఆలోచన కూడా పక్కన పెట్టారు. కృష్ణా ఆయకట్టులో ప్రజలు రోజూ కొట్టుకున్నా మాకేంటి అన్నట్లుగా, పోలవరానికి నీళ్ళు రాని పరిస్థితి తలెత్తినా అది తమ సమస్య కాదన్నట్లుగా, నిర్లక్ష్య వైఖరితో ఓట్లు, సీట్లు ప్రాతిపదికన కాంగ్రెస్‌ పార్టీ అడ్డగోలు నిర్ణయం తీసుకునేందుకు తెగించింది. ఇలా విభజన చేస్తే.. చదువుకున్న పిల్లవాడు ఉద్యోగం కోసం ఎక్కడకు వెళ్తాడనే ధ్యాస కూడా కాంగ్రెస్‌ పార్టీకి లేదు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఉద్యోగులు, ప్రజల పరిస్థితి ఏమిటి అన్న ఆలోచన లేదు. రాష్ట్ర బడ్జెట్‌లో 50 శాతం నిధులు హైదరాబాద్‌ నుంచే వస్తున్న నేపథ్యంలో ఈ నిధులు రాకపోతే, ఈ నిధులను వేరే రాజధాని కట్టుకోవడానికి దారి మళ్ళిస్తే.. మరి ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాల పరిస్థితి ఏమిటి? ఇప్పుడు కొనసాగుతున్న సంక్షేమ పథకాలు, రేపు అమలు చేయాలనుకుంటున్న సంక్షేమ పథకాల పరిస్థితి ఏమిటి - అన్న ఆలోచనలను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఓట్లు, సీట్లు ప్రాతిపదికన విభజన చేయాలని అనుకున్న కాంగ్రెస్‌ పార్టీ చరిత్రాత్మక తప్పిదం చేస్తుంటే, ప్రతిపక్ష నేతగా ఉండి కూడా ఆ తప్పిదాన్ని అడ్డుకోవాల్సిన చంద్రబాబు నాయుడు, అలా అడ్డు తగలకుంటే చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు. ఎన్జీవోలు చంద్రబాబు దగ్గరికి వెళ్ళి విభజన మీద మీరు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోండని ప్రాధేయపడితే కనికరం లేకుండా కుదరదన్నారు.

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మొన్న ప్రధాన మంత్రికి లేఖ రాసినట్లుగా మూడు పార్టీలు (వైయస్ఆర్‌ సిపి, సిపిఎం, ఎంఐఎం) సమైక్యం వైపు ఉన్నాయి. ఐదు పార్టీలు (కాంగ్రెస్, టిడిపి, బిజెపి, టిఆర్ఎస్, సిపిఐ) విభజనకు అనుకూలంగా ఉన్నాయి. ' అయ్యా చంద్రబాబు గారూ... మీరు కూడా ఆ మూడు పార్టీల వైపు రండి, ఆ మేరకు ప్రధాన మంత్రికి లేఖ రాయండి' అని మేం బహిరంగ లేఖ ద్వారా అడిగినా మా వేదన అరణ్య రోదనగానే మిగిలింది. 'అయ్యా చంద్రబాబు గారూ విభజన మీద మీ లేఖ వెనక్కి తీసుకోండి. మీ పదవికి రాజీనామా చేసి మీ ఎమ్మెల్యేలతో ఎంపిలతో రాజీనామా చేయించండి, అప్పుడు ఎలా విభజించగలుగుతారో చూద్దాం' అని మేం చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తూ వచ్చాం. తనకు తాను సీట్లు నష్టపోతారని, తనకు ఓట్లు రాకుండా పోతాయని, తనకు క్రెడిట్‌ దక్కకుండా పోతుందని స్వార్థ రాజకీయాలకు చంద్రబాబు పరాకాష్టగా నిలిచారు. ఇంతటి కీలక సమయంలో, స్పందించవలసిన సమయంలో స్పందించకపోతే చరిత్రహీనులుగా నిలిచిపోతారనే అంశాన్ని కూడా పక్కన పెట్టారు.

ఈ అన్యాయానికి నిరసనగా మా పదవులకు రాజీనామాలు చేయడమే కాకుండా, మా ఎమ్మెల్యేలు, ఎంపిలందరి చేత రాజీనామాలు చేయించాం. అంతేకాక, నేను సైతం గుంటూరులో నిరాహార దీక్షకు కూర్చుంటే ప్రభుత్వం జులుంతో ఆ దీక్షను భగ్నం చేసింది. వైయస్ జగన్‌ కూడా జైలులో ఉన్నా నిజాయితీతో రాజకీయాలు కొనసాగిస్తూ.. కష్టం అనిపించినా, తాను నిరాహార దీక్ష చేశాడు. ఆ దీక్షను కూడా అధికార బలంతో భగ్నం చేశారు. ఈ పోరులో రాష్ట్రానికి న్యాయం జరగని పరిస్థితులలో రాష్ట్రాన్న సమైక్యంగా ఉంచాలనే పోరాటంలో మరో అడుగు ముందుకు వేస్తూ... సెప్టెంబర్‌ 2వ తేదీ నుంచి షర్మిలమ్మను 'సమైక్య శంఖారావం' యాత్ర కోసం మీ మధ్యకు పంపుతున్నాను.

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డిగారి హయాంలో రాష్ట్రం సుభిక్షంగా ఎంతో అభివృద్ధి చెందింది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల ఆకాంక్షల మేరకు వారి అంచనాలకు మించి గ్రామగ్రామాన ఇంటింటికీ సంక్షేమం అందించింది. అలాగే జలయజ్ఞ అయినా, పారిశ్రామిక అభివృద్ధి అయినా అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో ప్రాజెక్టులు, పరిశ్రమలు ప్రారంభించడం జరిగింది. ఆయన ఉన్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ సమైక్యంగా, బలమైన రాష్ట్రంగా, తెలుగువారంతా ఏకంగా, ఎంతో బలంగా కనిపించింది.

ఆయన వారసుడిగా నిజాయితీ, నిబద్ధతలతో, విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ ఆయన వారసత్వ పార్టీకి దశా దిశా నిర్దేశం చేస్తూ, రాష్ట్రాన్ని ప్రాణం కన్న మిన్నగా భావించే నాయకుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డిగారు.‌ ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. అందరూ కలిసి సంతోషంగా ఉండే సువర్ణ యుగం వస్తుంది.

తాజా వీడియోలు

Back to Top