ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రానికి కాంగ్రెస్ అన్యాయం

హైదరాబాద్, 14 ఆగస్టు 2013:

రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌ పార్టీ వైఖరిని ఆక్షేపిస్తూ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌కు బుధవారం ఒక లేఖ రాశారు. రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయడానికే కాంగ్రెస్‌ పార్టీ ముందుకు వెళుతోందని ఆ లేఖలో ఆరోపించారు. ఓట్లు, సీట్లు కోసమే అధికార పార్టీ అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. తాను, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి, తమ ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసిన కారణాలను ప్రధానికి శ్రీమతి విజయమ్మ రాసిన లేఖలో వివరించారు.

శ్రీమతి విజయమ్మ లేఖ పూర్తి పాఠం ఇదీ :

అందరికీ ఆమోదయోగ్యంగా, ఎవరికీ అన్యాయం జరగకుండా, ఒక తండ్రిలా నిర్ణయం తీసుకోలేని పక్షంలో కేంద్రంలో పాలకులు రాజ్యాంగం ద్వారా రాష్ట్రాన్ని విభజించే అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకోవటం ధర్మం కాదు. రాష్ట్రాన్ని యథావిధిగా కొనసాగించటమే ధర్మం. రాష్ట్రంలో ఉన్న మూడు పార్టీలు - వైయస్ఆర్‌ కాంగ్రెస్‌, ఎంఐఎం, సిపిఐ (ఎం) ఒకే మాట చెబుతున్నాయి. న్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని విడగొట్టవద్దు, యథావిధిగా కలిపే ఉంచండి అంటున్నాయి. ఒక వైపు రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎం.పి.లు రాజీనామాలు చేస్తున్నప్పుడు, బంద్‌లు, స్ట్రైక్‌లు జరుగుతున్నప్పుడు.. రాజకీయ పార్టీలన్నింటి మధ్య వంద శాతం ఏకాభిప్రాయం సాధించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్‌ పార్టీ ఎలా చెప్పగలుగుతోంది?

రాష్ట్రాన్ని విడగొట్టడానికి ఒప్పుకున్నది - టిడిపి, టిఆర్ఎస్, కాంగ్రెస్, సిపిఐ, బిజెపిలు మాత్రమే.  ఓట్ల కోసం, సీట్ల కోసం అధికార పార్టీ అన్యాయం చేస్తుంటే.. ఓట్లు, సీట్లు పోతాయని, తనకు రావాల్సిన క్రెడిట్‌ రాకుండా పోతుందని ప్రతిపక్షంలో ఉన్న కొన్ని పార్టీలు విభజన ద్వారా జరిగే అన్యాయం గురించి స్పందించకుండా ఉంటే ఇక ఈ రాష్ట్రం తరఫున ఇక్కడి వారి గోడు ఎవరికి చెప్పుకోవాలి?

నెత్తిన తుపాకీ పెట్టి ఒప్పుకుంటారా? చస్తారా? అని అడిగినట్టుగా కేంద్ర ప్రభుత్వం వైఖరి ఉంది. ఒకవేళ అంగీకరించకపోయినా మా ఇష్టం ప్రకారం మేం చెయ్యాల్సింది చేస్తాం అన్నట్టుగా కేంద్రం తీరు ఉంది. రాష్ట్రంలోని రాజకీయ పార్టీల మధ్య దాదాపుగా 100 శాతం ఏకాభిప్రాయం వచ్చిందని కాంగ్రెస్‌ వారు చెప్పటం తప్పుదారి పట్టించటం కాదా? కేంద్రంలో అధికారంలో ఉన్నవారు ఇలా ఎందుకు చెబుతున్నారో? మా రాష్ట్రాన్ని విడగొట్టవద్దని ఇన్ని కోట్ల మంది ప్రాధేయపడుతున్నా... వీరందరి జీవితాలతో చెలగాటం ఆడటం న్యాయమేనా?

మా రాజీనామా సందర్భంలో మేం విడుదల చేసిన లేఖను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తున్నాం. దాన్ని చదివి రాష్ట్రంలోని సమస్యలను అర్ఘం చేసుకునే ప్రయత్నం చేయండి ప్రధానిగారూ అని కోరుతున్నాం. తనకు అధికార బలం ఉంది కదా అని కేంద్ర ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకుంటే.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మనిషి చేసిన ఎడారిగా మారిపోతుంది. అలాంటి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వాన్ని తరతరాలు దోషిగా భావిస్తాయి అని శ్రీమతి విజయమ్మ తన లేఖలో హెచ్చరించారు.

Back to Top