మౌలాలి ప్రమాదంపై విజయమ్మ దిగ్భ్రాంతి

హైదరాబాద్, 23 జూలై 2013:

సికింద్రాబాద్‌లోని మౌలాలిలో గోడ కూలి రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురు దుర్మరణం చెందిన ఘటనపై వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌర‌వ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆమె సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌లో ఇటీవల సిటీలైట్‌ హొటల్‌ కూలిన ప్రమాదంలో 17 మంది మరణించిన సంఘటనను మరిచిపోక ముందే‌ మరో ఘోరం జరగడం బాధాకరం అని ఒక ప్రకటనలో శ్రీమతి విజయమ్మ విచారం వ్యక్తంచేశారు. పాలమూరు నుంచి పొట్ట చేత పట్టుకుని వచ్చిన కూలీల జీవితాల్లో ఇలాంటి విషాదం జరగడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయి దిక్కులేని వారుగా మారిన అవినాష్ (చింటు), అనూష (లిల్లీ) పరిస్థితి మరింత దయనీయం అన్నారు. ఆ పిల్లల విషయంలో బాధ్యతను ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని శ్రీమతి విజయమ్మ విజ్ఞప్తిచేశారు.

పురాతన భవనాలు, పాత కట్టడాలపై ప్రభుత్వం, నగరపాలక సంస్థ సకాలంలో చర్యలు తీసుకుని ఉంటే ఈ ఘటన జరిగేది కాదని శ్రీమతి విజయమ్మ పేర్కొన్నారు. ఇప్పటికైనా పురాతన భవనాలు, నిర్మాణాల విషయంలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆమె కోరారు.

Back to Top