షర్మిల పాదయాత్ర చరిత్రాత్మకం

హైదరాబాద్, 23 జూన్‌ 2013:

తండ్రి రాజన్న ఆశయం కోసం, ప్రజల కొరకు అన్న జగనన్న పడుతున్న ఆరాటం కోసం ఓ ఆడపడుచు‌ శ్రీమతి షర్మిల 2,500 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసి మైలురాయిని తాకుతున్న శుభవేళ ఇది అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీజీసీ సభ్యుడు, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అభివర్ణించారు. కాంగ్రెస్‌, టిడిపిలు రెండూ కుమ్మక్కై ప్రజా కంటకంగా తయారై, ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతూ మహానేత రాజశేఖరరెడ్డి సంక్షేమ కార్యక్రమాల తూట్లు పొడుస్తూ.. అవి చేస్తున్న తుచ్ఛ రాజకీయ క్రీడకు నిరసనగా వైయస్‌ తనయ, శ్రీ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల ఈ చారిత్రక ఘట్టాన్ని నేడు ఆవిష్కరిస్తున్నారని ఆయన వివరించారు. శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 188వ రోజుకు చేరి నేడు తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలోని కాకరాపల్లి వద్ద 2.500 కిలోమీటర్లు పూర్తి చేస్తున్నారని అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సుదీర్ఘ పాదయాత్రలో 91 నియోజకవర్గాలు, 35 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్‌లు, 155 మండలాలు, 1,551 గ్రామాల మీదుగా శ్రీమతి షర్మిల పాదయాత్ర చేశారని భూమన పేర్కొన్నారు. ఈ పాదయాత్ర సందర్భంగా ఇప్పటి వరకూ ఆమె దాదాపు మూడు కోట్ల మంది ప్రజలను నేరుగా కలిసి, వారి గోడు విన్నారని, వారి కన్నీరు తుడిచారని, వారికి భరోసా కల్పించారని ఆయన చెప్పారు. శ్రీమతి షర్మిల చేసిన ఈ సుదీర్ఘ పాదయాత్ర ప్రపంచ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయం అని భూమన అభివర్ణించారు. మహానాయకుడు మన మధ్య లేకున్నా.. జననేత జగనన్నను జైలులో పెట్టినా.. వైయస్‌ కుటుంబం కోరేది ప్రజా క్షేమం అన్నారు. శ్రీమతి షర్మిల చేస్తున్న పాదయాత్రే దీనికి సాక్ష్యం తెలిపారు.

'ఎండ కన్నెరుగని శ్రీమతి షర్మిల ప్రజల కన్నీళ్ళకు కదలి పాదయాత్ర సాగించిన షర్మలమ్మ.. తుడిచింది దీనార్తుల కంటి చెమ్మ' అని భూమన కరుణాకరరెడ్డి అన్నారు. శ్రీమతి షర్మిల పాదయాత్రలో కొన్ని వందల రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించి. ప్రజల కష్టసుఖాలను విని, ప్రజల పట్ల కిరణ్‌ ప్రభుత్వం చేస్తున్న నయవంచనను ఎలుగెత్తి చాటడమే కాకుండా, వారికి భవిష్యత్తు పట్ల భరోసా కల్పించేందుకు ప్రయత్నించారన్నారు. రానున్నది రాజన్న రాజ్యమని, రాజన్న రాజ్యంలో రాజశేఖరరెడ్డిగారి సువర్ణయుగ పాలన మళ్ళీ వస్తుందన్న నమ్మకాన్ని ప్రజలకు శ్రీమతి షర్మిల కల్పించారని పేర్కొన్నారు. శ్రీమతి షర్మిల పాదయాత్ర ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.

అన్యాయం జరిగినప్పుడు, అక్రమాలు పెట్టుబికినప్పుడు, ఆశయాలు మంటగలిసినప్పుడు ఆనాటి వీరనారీమణులు మాంచాలలు, రుద్రమదేవిలు అయితే.. నేటి మహిళలు షర్మిలమ్మలు అవుతారని చరిత్ర నిరూపిస్తుందని భూమన కరుణాకరరెడ్డి అన్నారు. శ్రీమతి షర్మిల పాదయాత్ర ప్రపంచ మహిళలందరికీ ఆదర్శప్రాయం కానున్నదన్నారు. ప్రజల కోసం బ్రతకడం, ప్రజల మధ్య బ్రతకడం, తన తండ్రి ఆశయాన్ని తలకెత్తుకున్న శ్రీమతి షర్మిల అలసట, ఆయాసం మరచి, కుటుంబానికి దూరంగా ఉండి ఈ సుదీర్ఘ పాదయాత్ర చేసింది గిన్నిస్‌బుక్‌లో రికార్డుల కోసం కాదని భూమన స్పష్టంచేశారు. అన్నార్తుల ఆకలి తీర్చటానికి, వారి జీవితాలకు భరోసా కల్పించడానికే శ్రీమతి షర్మిల పాదయాత్ర చేస్తున్నారన్నారు. భవిష్యత్తు పట్ల భద్రత ఉందని ప్రజలకు ధైర్యాన్ని నూరిపోయడానికే ఆమె ఈ సాహసోపేత యాత్ర చేస్తున్నారన్నారు.

తొమ్మిది కోట్ల మంది తెలుగు ప్రజల హృదయాలను జయించిన, ఏ చిన్న తప్పూ చేయని, సచివాలయం వైపు ముఖం కూడా చూడని, అధికారంలో కూడా లేని జననేత జగనన్నను జైలులోకి నెట్టి ఏడాది పూర్తయినా.. తప్పుడు కేసులు బనాయించి, అసత్య అభియోగాలు మోపి, శ్రీ ‌జగన్మోహన్‌రెడ్డిని పూర్తిగా జైలులోనే ఉంచాలని తాపత్రయంతో కుట్రలు చేస్తూ, కుతంత్రాలు పన్నుతూ.. కాంగ్రెస్‌, టిడిపిలు పన్నుతున్న పన్నాగాలన్నింటినీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని భూమన హెచ్చరించారు. దుప్పట్లతో సూర్యుడ్ని ఆపగలరా? చప్పట్లతో పిడుగులను నిలువరించగలరా? జననేత జగనన్న పట్ల జనం గుండెల్లో కొలువై ఉన్నఅభిమానాన్ని ఆపగలరా అంటూ ప్రజలంతా షర్మిలమ్మ పాదయాత్రలో ఆమెకు ధైర్యాన్ని నూరిపోస్తున్నారని ఆయన అన్నారు.

నిస్సత్తువతో, నిర్మానుష్యంగా, రాత్రి దెయ్యాలు సంచరించే వేళ 2.500 కిలోమీటర్లకు పైబడి చేసిన చంద్రబాబు పాదయాత్రకు శ్రీమతి షర్మిల పాదయాత్రకు అస్సలు సారూప్యమే లేదని భూమన పేర్కొన్నారు. చంద్రబాబు పాదయాత్రలో ప్రజలకు ఎలాంటి భరోసాని ఇవ్వని యాత్రగా చరిత్ర హీనంగా మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు. కానీ, శ్రీమతి షర్మిల మానవాళి మొత్తం గర్వించే విధంగా మూడు వేల పైచిలుకు పాదయాత్రకు నడుం బిగించి ఎండనకా, వాననకా 2.500 కిలోమీటర్లు పూర్తి చేశారని తెలిపారు. ఏ కష్టాన్నైనా ఎదురొడ్డి నిలిచి ప్రజలకు నమ్మకాన్ని కలిగిస్తూ ఆమె ముందుకు సాగిపోతున్నారన్నారు. శ్రీమతి షర్మిల పాదయాత్ర చైనాలో మావో సే టుంగ్‌ లాంగ్‌ మార్చ్ ను గుర్తుచేసే విధంగా చరిత్రలో మిగిలిపోతుందని అభివర్ణించారు.

వైయస్‌ రాజశేఖరరెడ్డి రెక్కల కష్టం మీద వచ్చిన ఈ ప్రభుత్వం తీరు 'చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరిన చందం'గా ఉందని భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. రాజశేఖరరెడ్డి తెచ్చిన ప్రభుత్వంలో కిరణ్‌కుమార్‌రెడ్డి పాములా వచ్చి కుర్చీలో కూర్చున్నారని విమర్శించారు. పాముల మయం అయిపోయిన ఈ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి మేలూ చేయడంలేదని భూమన వ్యాఖ్యానించారు. మంచి భవిష్యత్తు కోసం ప్రజలంతా ఎదురుతెన్నులు చూస్తున్నారని, అది వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని భూమన కరుణాకరరెడ్డి ధీమా వ్యక్తంచేశారు. ప్రజల కన్నీరు తుడిచే, కడగండ్లు తీరే పాలన ఒక్క శ్రీ జగన్మోహన్‌రెడ్డి ద్వారా మాత్రమే వస్తుందని ప్రజలంతా విశ్వాసంతో ఉన్నారని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా? ఆ రోజున తమ ఓటు సత్తా చూపించి కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా, శ్రీమతి షర్మిల చేస్తున్న పాదయాత్రకు బహుమానంగా కాంగ్రెస్‌, టిడిపిలకు సమాధి కట్టే రోజు కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారని తెలిపారు.

Back to Top