సిఎం కిరణ్‌ 'దళిత రాబందు'

హైదరాబాద్, 22 ఏప్రిల్‌ 2013: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి 'దళిత రాబందు' అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర కన్వీనర్‌ నల్లా సూర్యప్రకాష్‌ అభివర్ణించారు. రాజమండ్రిలో జరిగిన 'దళిత శంఖారావం'లో కిరణ్‌కు దళిత నాయకులు కొందరు 'దళిత బంధు' బిరుదునివ్వ‌డంపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి దళిత బంధు అయితే.. అంబేద్కర్‌, జగ్జీవన్‌రామ్‌ ఏమవుతారో ఆ బిరుదునిచ్చిన దళిత నాయకులే సమాధానం చెప్పాలన్నారు. దళితుల అభివృద్ధికి దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు రూపొందించి అమలు చేశారన్నారు. దళితుల కోసం కోట్లాది నిధులు మంజూరు చేసింది కూడా ఆ మహానేతే అన్నారు. మహానేత వైయస్‌ఆర్‌ ఆశయాల అడుగుజాడల్లోనే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నడుస్తోందన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సూర్యప్రకాష్‌ మాట్లాడారు.

దళితుల కోసం కిరణ్‌ ఏంచేశారు? :
దళితుల సంక్షేమం కోసం‌ తన రాజకీయ జీవితంలో ఏమీ చేయని కిరణ్‌ కుమార్‌రెడ్డికి బిరుదునివ్వడాన్ని సూర్యప్రకాష్‌ తప్పుపట్టారు. దళిత శంఖారావం సభలో చురుగ్గా పాల్గొన్న ముగ్గురు నాయకులకూ దళిత వ్యతిరేక చరిత్ర ఉందన్నారు. వారిలో అమలాపురం ఎం.పి. హర్షకుమార్‌కు గతంలో అంబేద్కర్‌ విగ్రహాలను పగలగొట్టి, మురికిగుంటల్లో పడేశారని గుర్తుచేశారు. ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు దళితులకు శిరోముండనం చేయించి, అవమానించారన్నారు. త్రిమూర్తులు రాజీనామా చేయాలని, ఆయనను శిక్షించాలంటూ హర్షకుమార్ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారన్నారు. అలాంటి ఈ ఇద్దరూ ఒకే వేదికలో పాల్గొనడంలోని ఔచిత్యాన్ని సూర్యప్రకాష్‌ ప్రశ్నించారు. ఇదే సభలో పాల్గొన్న మంత్రి కొండ్రు మురళీమోహన్‌.. తన ఊరి పక్కనే లక్ష్మీపేటలో దళితులను ఊచకోత కోస్తే పట్టించుకోలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన డిప్యూటి సిఎం దామోదర రాజనర్సింహ దళిత శంఖారావానికి గైర్హాజరైన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత లేనప్పుడే మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి నోడల్‌ ఏజెన్సీ ఏర్పాటు చేసి మూడు నెలలకోసారి సమీక్షలు నిర్వహించిన వైనాన్ని నల్లా సూర్యప్రకాష్‌ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆయన హయాంలోనే ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం పథకాలు అమలయ్యాయన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులను ఎన్నికల యంత్రాల కోసం ప్రస్తుత ప్రభుత్వం మళ్ళించిందన్నారు. దళితుల మధ్య అంతరాలు పోగొట్టాలని చెబుతున్న ప్రస్తుత పాలకుల తీరును ఆయన తూర్పారపట్టారు. దళితుల మధ్య అంతరాలు కాదు.. అగ్రవర్ణాలు - దళితుల మధ్య ఉన్న దూరాన్ని తొలగించాలన్నారు. గోరంత చేసి కొండంతగా చెప్పుకుంటున్నారని కాంగ్రెస్‌ పాలకుల తీరును ఆయన ఎండగట్టారు.

ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికే లోపభూయిష్టం :
అసలు.. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికే లోపభూయిష్టంగా ఉందన్నారు. దాని అమలు తీరు అంతకన్నా బాగోలేదని సూర్యప్రకాష్‌ ఆరోపించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఫీజు రీయింబర్సుమెంటు చేయని కారణంగా దళిత విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న వైనాన్ని ఆయన ప్రస్తావించారు. తెనాలిలో ఓ దళిత మహిళ దారుణంగా హత్యకు గురైందన్నారు. లైంగికదాడికి గురైన మానసిక వికలాంగురాలు జహీరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న సంఘటనా కిరణ్‌ పాలలోనే జరిగిందన్నారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత ఈ ప్రభుత్వం దళితుల కోసం ఏమి చేసిందని నల్లా సూర్యప్రకాష్‌ సూటిగా ప్రశ్నించారు. అసలు ఏ ఒక్క పథకాన్నీ కూడా కిరణ్‌ ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడంలేదని ఆయన దుయ్యబట్టారు.

తొమ్మిదేళ్ళ పాటు దళితులను దగా చేసి చంద్రబాబు :
తొమ్మిదేళ్ళ పాటు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు దళితులను దారుణంగా దగా చేశారని సూర్యప్రకాష్‌ ఆరోపించారు. కిరణ్‌ ప్రభుత్వం కూడా బాబు దారినే అనుసరిస్తున్నదని విమర్శించారు.‌ అవిశ్వాసంపై ఓటింగ్‌ సమయంలో కిరణ్ ప్రభుత్వాన్ని పడిపోకుండా కాపాడినందుకే రాజమండ్రి సభలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడని తీరును ఆయన ప్రస్తావించారు. కానీ, తన రెక్కల కష్టంతో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన మహానేత వైయస్‌ఆర్‌ను విమర్శించేందుకే ఎక్కువ సమయాన్ని వినియోగించారని నల్లా సూర్యప్రకాష్‌ నిప్పులు చెరిగారు.

ఇదీ దళితులకు మహానేత వైయస్‌ చేసిన కృషి :
‌మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 9,33,585 స్వయం సహాయక సంఘాలు ఉంటే.. 28,46,316 మంది దళితులు సభ్యులుగా ఉన్నారని సూర్యప్రకాష్‌ తెలిపారు. దళితులకు పావలా వడ్డీ చొప్పున రూ. 1,235 కోట్లు అందజేశారన్నారు. 71 లక్షల మందకి పింఛన్‌గా రూ. 800 కోట్లు ఇస్తే.. అందులో అత్యధికంగా 12,61,124 మంది దళితులకే అందాయన్నారు. పరిశ్రమలు స్థాపించే దళితులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ. 5 కోట్ల వరకూ ఇవ్వాలని మహానేత వైయస్‌ జి.ఓ. ఇచ్చిన సంగతిని సూర్యప్రకాష్‌ గుర్తుచేశారు. దళితులను పారిశ్రామికవేత్తలుగా తయారుచేయాలన్న మహానేత ఆశయాన్ని కిరణ్‌ కుమార్‌రెడ్డి తుంగలో తొక్కారని దుయ్యబట్టారు. పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లను వైయస్‌ఆర్‌ 8 రెట్లు పెంచారన్నారు. ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల్లో ఎస్సీ, ఎస్టీలకు రూ.20 వేలు అదనంగా మహానేత ఆర్థిక సాయం చేశారన్నారు. అందుకు గాను రూ. 440 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రుణ సదుపాయం కోసం అప్పుడే ఆయన రూ. 250 కోట్లు విడుదల చేశారన్నారు. ఆ నిధులన్నీ ఏమయ్యాయో ఈ రోజుకు కూడా కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పడంలేదన్నారు.

జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేశారంటూ టిడిపి, ఇతర నాయకులు అక్కసుతో దుష్ప్రచారం చేస్తున్నారని సూర్యప్రకాష్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే, జలయజ్ఞం నిధుల నుంచి ఎస్సీ, ఎస్టీల కోసం రూ. 800 కోట్లు బదలాయించిన చరిత్ర రాజశేఖరరెడ్డిది అన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ను చంద్రబాబు హయాంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలు చాలా మంది రుణాలు చెల్లించలేని దశలో ఉంటే.. మహానేత రూ. 1120 కోట్లను మహానేత వైయస్‌ మాఫీ చేశారని తెలిపారు. సమకాలీన సమాజంలో అగ్రకులాలతో సమానంగా దళితులు అభివృద్ధి చెందాలని వైయస్‌ భావించారన్నారు. ఆ మహానేత వైయస్‌ బాటలోనే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి కూడా కొనసాగుతున్నారని స్పష్టం చేశారు.

దళితులకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రత్యేక బడ్జెట్‌ :
కుల, మత భేదాలకు అతీతంగా అధిక సంఖ్యలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్న వారిని మళ్ళించుకోవడానికే రాజమండ్రిలో దళిత శంఖారావం సభ నిర్వహించారని నల్లా సూర్యప్రకాష్‌ ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. దళితుల కోసం ప్రత్యేక బడ్జెట్‌ పెడతామని శ్రీ వైయస్‌ జగన్‌ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుత మైనార్టీ ప్రభుత్వం ఇస్తున్న హామీలేవీ అమలయ్యే అవకాశం లేదన్నారు. చంద్రబాబు చేస్తున్న వాగ్దానాలపై ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారని అన్నారు. అలాంటి పరిస్థితే కాంగ్రెస్‌ నాయకులకు కూడా ఎదురవుతుందని హెచ్చరించారు. దళితుల ప్రయోజనాలను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కాపాడుతుందని నల్లా సూర్యప్రకాష్‌ తెలిపారు.

దళితులే వైయస్‌ఆర్ కాంగ్రెస్‌కు పునాది :
మహానేత వైయస్‌ఆర్‌ ఆశయాల్లోనే నడుస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నిజామాబాద్‌లో ఒక దళితుడికి జనరల్‌ స్థానం కేటాయించిందని ఒక విలేకరి ప్రశ్నకు సూర్యప్రకాష్‌ బదులిచ్చారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు దళితులే పునాది అన్నారు. మహానేత వైయస్‌ అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో దళితులకే ఎక్కువ లబ్ధి కలిగిందని నల్లా పేర్కొన్నారు. జ్ఞనం, శీలం లేని వ్యక్తి బిజెపి నాయకుడు ఎన్‌విఎస్‌ ప్రభాకర్‌ అని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నకు బదులుగా నిప్పులు చెరిగారు. అలాంటి వ్యక్తి మాటలకు స్పందించడం కూడా అనవసరం అన్నారు.
Back to Top