పిచ్చాసుపత్రికి టీడీపీ కార్యాలయం మార్చండి

హైదరాబాద్, 23 నవంబర్ 2013:

చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరులు మతి భ్రమించినట్లు మాట్లాడుతున్నారని, వారి కార్యాలయం పిచ్చాసుపత్రిలో పెట్టుకోవడం మంచిదని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు సలహా ఇచ్చారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డికి వస్తున్న విశేష ప్రజాదరణ చూసి చంద్రబాబు, టీడీపీ నాయకులకు మతిపోయిందన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

విభజనకు అనుకూలమా లేక సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నారో ఏదీ చెప్పలేక టీడీపీ వారు పిచ్చిపట్టినట్టుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. విభజన కోసం పోరాటం చేస్తున్న చంద్రశేఖరరావు సమైక్యవాది అని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీవ్రంగా కృషి చేస్తున్న శ్రీ జగన్మోహన్‌రెడ్డి విభజనవాది అంటూ ఒక టీడీపీ నాయకుడు చేస్తున్న వ్యాఖ్యలే వారికి ఎంతగా పిచ్చి ముదిరిపోయిందో చెప్పకనే చెబుతున్నాయన్నారు.

ఏదీ స్పష్టంగా చెప్పలేని చంద్రబాబు ప్రజల మద్దతు పొందలేకపోతున్నారని, జాతీయ స్థాయిలో ఆయనను పట్టించుకునేవారు లేరని అన్నారు. ప్రజలతో పోరాడలేక, అధికార పార్టీతో చంద్రబాబు కుమ్మక్కయ్యారని విమర్శించారు. హైటెక్‌సిటీ ముందు ఫొటో దిగే హక్కు తనకే ఉందని చెబుతున్న చంద్రబాబు ఆ ఫొటోను పోలీస్ స్టేష‌న్లో పెట్టుకోవడం మంచిదని సలహా ఇచ్చారు. హైటె‌క్‌సిటీ కట్టించిన ఎల్ అండ్ టి కంపెనీయే ‌టీడీపీ కార్యాలయం కట్టించిన విషయం మాత్రం చంద్రబాబు చెప్పరన్నారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డిని ఆదర్శంగా తీసుకోవద్దని, సీబీఐకి పెట్టిన డబ్బులన్నీ దండగ అని, అది యూ టర్ను తీసుకుందని చంద్రబాబు చెప్పిన మాటలను గట్టు ఎద్దేవా చేశారు. పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచిన తనను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన చెప్పదలచుకున్నారా? అని ప్రశ్నించారు. చార్లెస్‌ శోభరాజ్, దావూద్ ఇబ్రహీంలాంటి ఇంటలెక్చువల్‌ దొంగలు మాత్రమే చంద్రబాబును ఆదర్శంగా తీసుకుంటారన్నారు. సీబీఐని అక్రమంగా వాడుకుని కాంగ్రెస్‌, టీడీపీలు ఏయే కార్యక్రమాలకు ఉపయోగించుకున్నాయో చంద్రబాబు అప్రూవర్‌గా మారి ఇప్పుడు నిజాలు చెప్పాలని డిమాండ్ చేశారు.

కోట్ల రూపాయల విలువైన ఐఎంజీ భూములను వేల రూపాయలకు అమ్మడం తప్ప చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏమీ లేదని గట్టు విమర్శించారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాక ముందు మన రాష్ట్రం ఐటీ ఎగుమతుల్లో 3వ స్థానంలో ఉండేదని ఆయన హయాంలో అది ఐదవ స్థానంలోకి పడిపోయిన వైనాన్ని గట్టు గుర్తుచేశారు.

హైదరాబాద్లో 14 ఫ్లై ఓవర్లు, పీవీ నర్సింహారావు ఎక్సుప్రెస్‌ వే కట్టించింది‌ మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి అని ఆయన గుర్తు చేశారు. 166 కిలోమీటర్ల ఔటర్‌ రింగ్‌ రోడ్‌ వేయించింది రాజశేఖరరెడ్డి అని తెలిపారు. రాష్ట్రంలో మూడు ట్రిపుల్‌ ఐటీలు పెట్టించారన్నారు. ప్రతి జిల్లాకు ఒక వర్శిటీ ఉండాలని 18 యూనివర్శిటీలు కట్టించారని తెలిపారు. నిరుపేదలైనా సరే ప్రతి ఇంటిలోనూ కనీసం ఒక్కరైనా ఉన్నత విద్య చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడాలన్న సదుద్దేశంతో ఫీజు రీయింబర్సుమెంటు పెట్టారన్నారు.

చంద్రబాబు నాయుడు ఎవరికి మేలు చేశారని, రైతులకు ఉచిత కరెంటు ఇచ్చారా? విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్‌ చేశారా? కూలీలకు మేలు చేశారా? అని గట్టు ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకంపై నిషేధం పెట్టింది చంద్రబాబు కాలంలో కాదా? అన్నారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డికి రాష్ట్రపతి అపాయింట్‌ ఇవ్వడంపై వ్యాఖ్యలు చేసిన టీడీపీ నాయకుడు కోడెల శివప్రసాద్‌పై గట్టు నిప్పులు చెరిగారు. తన ఇంటిలోనే బాంబులు పేలిన శివప్రసాద్‌కు అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని కోరుకుంటున్నారా? అని నిలదీశారు. మహానేత వైయస్ఆర్‌ వారసుడిగా, ప్రజల కోసం తపిస్తున్న నాయకుడిగా శ్రీ జగన్‌కు కాకుండా టీడీపీ నాయకులకు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ ఎలా వస్తుందని ప్రశ్నించారు.

Back to Top