రాష్ట్రంలో దీక్ష చేయడానికి సిగ్గేసిందా?

హైదరాబాద్, 6 అక్టోబర్ 2013:

రాష్ట్రంలో నిరాహార దీక్ష చేసేందుకు సిగ్గేసి ఢిల్లీలో దీక్ష కోసం చంద్రబాబు నాయుడు బయల్దేరుతున్నారని వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ‌ అధికార ప్రతినిధి ఆర్.కె. రోజా ఆక్షేపించారు. రాష్ట్ర విభజన ప్రక్రియను వీలైనంత వేగంగా పూర్తి చేయించాలని చంద్రబాబు ఆరాటపడుతున్నారని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలోని ఆరు కోట్ల మంది ప్రజలు అన్నం తినకుండా ఆందోళన చేస్తున్నా విభజనకు ఆయన సై అంటున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు నీరో చక్రవర్తిలా మారారని ఎద్దేవా చేశారు. చేసిన తప్పులు ఒప్పుకుని సమైక్యాంధ్రకు అండగా నిలవాలని, చరిత్రహీనుడిగా మిగల వద్దని చంద్రబాబుకు ఆమె విజ్ఞప్తి చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
అన్నివిషయాల్లోనూ సమన్యాయం చేయమనే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కోరిందని రోజా గుర్తుచేశారు. ప్రజల పక్షాన నిలబడినందుకే పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్‌రెడ్డి న్యాయం కోసం దీక్ష చేస్తున్నారని ఆమె స్పష్టం చేశారు. ప్రజల కోసం ఎప్పుడూ ఆలోచించే వ్యక్తి శ్రీ జగన్ అని చెప్పారు. రాహు‌ల్‌ను ప్రధానిని చేసేందుకు ఓట్లు, సీట్ల కోసమే రాష్ట్ర విభజనకు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తోంది తప్ప తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవించి కాదన్నారు. కాంగ్రెస్కు పోయేకాలం వచ్చిందని రోజా దుయ్యబట్టారు. కాంగ్రెస్, టిడిపిలను ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని ఆమె అన్నారు.

ఢిల్లీలో నిరాహార దీక్ష చేయడానికి వెళుతున్నానని చంద్రబాబు చెప్పడం అందరికీ అర్థం కాని ప్రశ్నగా మారిందని రోజా వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని విభజించాలని కోరడానికి వెళుతున్నారా? లేక సమైక్యంగా ఉంచాలని చెప్పడానికి వెళుతున్నారా? అనే అయోమయంలో అందరినీ పడేసేలా ప్రకటన చేసి ఢిల్లీ వెళ్ళిపోతున్నారని అన్నారు. విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోలేదని, సమైక్యానికి మద్దతుగా ఉంటానని కూడా చంద్రబాబు నాయుడు చెప్పలేదన్నారు. అయితే.. ఢిల్లీ వెళుతున్నాను.. నిరాహార దీక్ష చేస్తున్నాను.. ఢిల్లీ పెద్దలందరినీ కలుస్తాను అని ఆయన అంటున్నారన్నారు. అంటే.. రాష్ట్రంలో నిరాహార దీక్ష చేయడానికి మీకు సిగ్గేసిందా? చంద్రబాబు నాయుడుగారూ అని రోజా ప్రశ్నించారు.

తొమ్మిదేళ్ళు అధికారంలో ఉన్న చంద్రబాబు ఒక ప్రాంతానికి పూర్తిగా అన్యాయం జరుగుతూంటే.. ఆ ప్రాంత ప్రజల కన్నీళ్ళు తుడవకుండా.. అక్కడి ప్రజలకు భరోసా ఇవ్వకుండా ఢిల్లీలో దీక్ష ఎందుకు చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణకు తాను ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని ఢిల్లీ వెళ్ళే ముందు చంద్రబాబు అన్నారే తప్ప .. సీమాంధ్ర గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్తున్నారంటే.. విభజన తొందరగా చేయండి అనేది ఆయన ఉద్దేశమా అన్నారు. త్వరలోనే ఎన్నికలు వచ్చేస్తున్నాయి.. రెండు చోట్లా తానే గెలిచి అధికారంలోకి రావాలనే తపన చంద్రబాబులో కనిపిస్తోంది తప్ప ప్రజల గురించి ఆయనకు ఏమాత్రం బాధ లేదన్న విషయాన్ని అందరూ నిశితంగా గమనిస్తున్నారన్నారు.

నాయకుడంటే.. ప్రజలకు సమస్య వచ్చినప్పుడు అండగా ఉండాలని రోజా అన్నారు. దాని కోసం పోరాడాలని, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలన్నారు. కానీ, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు తన బాధ్యతను మరచి... కాంగ్రెస్‌ పార్టీ చేసే ప్రతి తప్పుకూ అడుగడుగునా మద్దతు పలుకుతూ.. ఆ ప్రభుత్వాన్ని కాపాడుతూ వస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ను వ్యతిరేకించి, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడితే ఎమ్మార్‌, ఐఎంజి కేసులను వెలికి తీస్తే..  ఈ 66 ఏళ్ళ వయసులో 14 సంవత్సరాలు జైలులో కూర్చోలేననే భయంతోనే కాంగ్రెస్‌కు మద్దతుగా ఉన్నారని రోజా ఆరోపించారు.

జైలు నిర్బంధంలో ఉన్నప్పుడు కూడా‌ జననేతగా శ్రీ జగన్మోహన్‌రెడ్డి, ప్రజాపక్షంగా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతి ప్రజా సమస్యపైనా స్పందిస్తున్నట్లు రోజా తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ అహర్నిశలూ కృషి చేస్తున్న విషయం ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. కానీ జనంలోనే ఉన్న చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖతో ఆరు కోట్ల మందికి అన్నం లేకుండా ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచారని నిప్పులు చెరిగారు. ప్రజలందరి భవిష్యత్తును తీసుకువెళ్ళి జైలులో పెట్టింది చంద్రబాబు కాదా అని రోజా ప్రశ్నించారు.

రాష్ట్రాన్ని విభజిస్తే.. నీరు, రాజధాని, వనరులు, ప్రజల సెంటిమెంటు, వారి భవిష్యత్తు లాంటి ఎన్ని సమస్యలు వస్తాయో తొమ్మిదేళ్ళు అధికారంలో ఉన్న చంద్రబాబుకు తెలుసని రోజా అన్నారు. 2008 అక్టోబర్ 18న, 2102 డిసెంబర్ 27న కేంద్రానికి చంద్రబాబు లేఖలు ఇచ్చారని తెలిపారు. ప్రత్యేక తెలంగాణకు మద్దతు ఇస్తున్నట్లు మాత్రమే ఆ లేఖలో చంద్రబాబు ప్రస్తావించారన్నారు. అయితే.. మరో ప్రాంతంలో అన్యాయం జరుగుతుందని ఎక్కడా పేర్కొనలేదని దుమ్మెత్తిపోశారు. తెలంగాణకు వ్యతిరేకం కాదని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ప్లీనరీలో చెప్పామని, కేంద్ర హోం మంత్రికి ఇచ్చిన లేఖలో అన్ని సమస్యలనూ పరిగణనలోకి తీసుకుని, ఒక తండ్రిలా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని త్వరితగతిన చూపాలని కోరామన్నారు. రాష్ట్రం ఒక్కటిగా ఉంటేనే బాగుంటుందని, ఒక వేళ విభజించాల్సి వస్తే.. అందరికీ సమన్యాయం జరిగిన తరువాతే విభజించాలని శ్రీకృష్ణ కమిటి నివేదిక 5వ అధ్యాయంలో స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని రోజా ఉటంకించారు.

చంద్రబాబును చూసి ప్రజలు అసహ్యించుకుంటుంటే.. శ్రీ జగన్‌ వైపు పరుగులు పెడుతుంటే టిడిపి నాయకులు శ్రీ జగన్‌ మీద అక్కసుతో మాట్లాడుతున్నారే గాని గల్లీ నుంచి ఢిల్లీ వరకూ జరుగుతున్న సమైక్యాంధ్ర పోరాటం గురించి ఏనాడైనా మాట్లాడారా? అని రోజా నిలదీశారు. చంద్రబాబు అబద్ధాల కారణంగా రాష్ట్రం రెండు ముక్కలయ్యే దుస్థితి వచ్చిందన్నారు. 'నీరో చక్రవర్తిలా తయారైన నారా' అని ప్రజలంతా చంద్రబాబును ఈసడించుకుంటున్నారని అన్నారు. ఆ నాడు రోమ్‌ తగలబడిపోతుంటే.. నీరో చక్రవర్తి ఫిడేల్‌ వాయించాడు కానీ, ఈ రోజు చంద్రబాబు నాయుడే అగ్గిపుల్లగా మారి.. కాంగ్రెస్‌ అనే అగ్గిపెట్టెతో జత కలిసి మన రాష్ట్రాన్ని తగలబెట్టారని నిప్పులు చెరిగారు. రాజకీయంగా శ్రీ జగన్మోహన్‌రెడ్డిని అణచివేసి అధికారంలోకి రావాలని చంద్రబాబు ఇలాంటి హీనస్థితికి దిగజారిపోయారని విమర్శించారు.

రాష్ట్ర విభజన నిర్ణయం జరగక ముందే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు ఎలా రాజీనామా చేశారంటూ టిడిపి నాయకులు చేస్తున్న విమర్శలను రోజా తిప్పికొట్టారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ నిర్ణయం తీసుకోబోతోందంటూ.. జూలై రెండవ వారం నుంచే చంద్రబాబుకు సంబంధించిన పత్రికలు సహా అన్నింట్లోనూ స్పష్టంగా వార్తలు వచ్చిన వైనాన్ని ఆమె గుర్తుచేశారు. రాష్ట్ర విభజనను ఆపడం కోసమే వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ‌ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడానికి ముందుకు వచ్చారన్నారు. ఆ తరువాతే శ్రీ జగన్మోహన్‌రెడ్డి, శ్రీమతి విజయమ్మ కూడా రాజీనామాలు చేశారన్నారు. నిరంకుశంగా రాష్ట్రాన్ని విభిజిస్తే.. సీమాంధ్రులకు అన్యాయం జరుగుతుందని, అందుకే సమైక్యాంధ్రగానే ఉంచాలంటూ శ్రీమతి విజయమ్మ, శ్రీ జగన్‌ నిరాహార దీక్షలు చేశారని రోజా పేర్కొన్నారు. జైలు నిర్బంధంలో ఉన్నప్పటికీ శ్రీ జగన్‌ జనం కోసం నిరవధిక నిరాహార దీక్ష చేశారన్నారు.

నాయకుడనేవాడు తన పదవులను కూడా త్యాగం చేసి ప్రజలకు అవసరమైన సమయంలో అండగా ఉండాలని రోజా వ్యాఖ్యానించారు. కానీ చంద్రబాబు, ఆయన ఎమ్మెల్యేలు, ఎంపిలు పదవులను పట్టుకుని వేలాడుతున్నారని విమర్శించారు. అలాగే కిరణ్‌కుమార్‌ రెడ్డి, చిరంజీవి, బొత్స, పళ్ళంరాజు, పురందేశ్వరి లాంటి వాళ్ళంతా కేవలం 'అమ్మ వద్దంది' అని చెప్పుకుని రాజీనామాలు చేయకుండా పదవులను గబ్బిలాల్లా పట్టుకుని వేళ్ళాడుతున్నారని రోజా ఎద్దేవా చేశారు. ఈ నాయకులకు తమ పదవులే ముఖ్యం కాని వారిని ఓట్లేసి గెలిపించిన ప్రజల భవిష్యత్తు ఏమైనా పరవాలేదన్నది స్పష్టం తెలుస్తోందన్నారు. జెండాలు వేరైనా మన అందరి ఎజెండాలు ఒక్కటే ఉండాలని శ్రీ జగన్మోహన్‌రెడ్డి చెప్పారన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికీ ఏ సమస్యా రాకూడదన్నది శ్రీ జగన్‌ విధానం అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో మాతో కలిసి నడవండి, పాలు పంచుకోండని ఆయన పిలిచినా చంద్రబాబు బేఖాతరు చేశారని ఆరోపించారు.

ప్రజాకంటకంగా మారిన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి అధికారం నుంచి దించేయాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షం టిడిపిది అన్నారు. అయితే, ఇతర ప్రతిపక్షాలన్నీ ఒక్కటై అవిశ్వాసం పెడితే టిడిపి ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేసి మరీ ప్రభుత్వాన్ని నిస్సిగ్గుగా కాపాడింది చంద్రబాబునాయుడే అని రోజా నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ పార్టీతో అన్ని రకాలుగా కుమ్మక్కై టిడిపి వ్యవహరిస్తున్నదో ప్రజలంతా గమనించాలన్నారు. ప్రజా వ్యతిరేక కాంగ్రెస్‌ ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు అవిశ్వాసం పెట్టినా.. లేదా పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసినా ఈ రోజు మన రాష్ట్ర విభజన జరిగి ఉండేది  కాదన్నారు. రాష్ట్రంలోని 60 శాతం ప్రజలు 66 రోజులుగా రోడ్ల మీదకు వచ్చి పోరాటం చేయాల్సిన అగత్యం పట్టేది కాదన్నారు. విద్యార్థులు, జీతాలను త్యాగం చేసి ఉద్యోగులు, రైతులు, మహిళలు, వృద్ధులు, పిల్లలు ఉద్యమంలో పాల్గొంటున్నారని అన్నారు. వీళ్ళందరి భవిష్యత్తునూ కాలరాసే అధికారం చంద్రబాబు నాయుడికి ఎవరిచ్చారని రోజా ప్రశ్నించారు.

ఓట్లు, సీట్ల కోసం, రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడం కోసమే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని విభజిస్తున్నదని రోజా ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవించి మాత్రం విభజన నిర్ణయం తీసుకోలేదని వ్యాఖ్యానించారు. ఒక ప్రాంత సెంటిమెంట్‌ను గౌరవించినప్పుడు మరో ప్రాంతంలో సమస్య ఎదురైతే ఆ ప్రాంత సెంటిమెంట్‌ను కూడా గౌరవించాలి కదా అన్నారు. రాష్ట్రం 66 రోజులుగా రావణకాష్టంలా రగిలిపోతుంటే.. ఆ సెంటిమెంట్‌ను ఎందుకు గౌరవించడంలేదని, దానినెందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని కాంగ్రెస్‌ పార్టీని రోజా నిలదీశారు. మీ ఇష్టం వచ్చినట్లు రాష్ట్రాన్ని ఏదైనా చేసుకోండంటూ చంద్రబాబు నాయుడ బ్లాంక్‌ చెక్కులా లేఖ ఇచ్చారన్న ధైర్యమేనా అని ప్రశ్నించారు. ఇప్పటికే చరిత్రహీనుడిగా మారిపోతున్న చంద్రబాబు నాయుడు ప్రజలు తనను ఒక మనిషిగా గౌరవించాలంటే.. మీరు చేసిన తప్పులు ఒప్పుకుని, అన్ని ప్రాంతాల వారికీ న్యాయం జరిగే విధంగా సమైక్య ఉద్యమంలోకి రావాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కోరుకుంటోందన్నారు. లేదంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, టిడిపిలను వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ భూస్థాపితం చేయడం ఖాయమని రోజా హెచ్చరించారు.

రాష్ట్రాన్ని విభజిస్తామనడం, తరువాత శ్రీకృష్ణ కమిటి వేయడం.. విభజన చేశాం వెనక్కి తీసుకోం అనడం.. ఆ తరువాత ఆంటోని కమిటీ వేశాం దానికి సమస్యలు చెప్పుకోండి.. పరిష్కరించడానికి ప్రయత్నిస్తామనడం.. ఆ కమిటీ నివేదిక ఇవ్వక ముందు కేబినెట్‌ నోట్‌ పంపించడం.. సూసైడ్‌ నోట్‌లా మీ గొయ్యి మీరే తీసుకోవడం ఇవన్నీ చూస్తుంటే.. కాంగ్రెస్‌ పార్టీకి పోయేకాలం వచ్చిందని స్పష్టంగా ప్రజలందరికీ తెలుస్తోందని రోజా తూర్పారపట్టారు. ఏ ప్రాంతంలోనూ కాంగ్రెస్‌ పార్టీని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. తొమ్మిదేళ్ళు అధికారం ఇచ్చి నిలబెట్టిన ప్రజల రుణం తీర్చుకునే అవకాశం చంద్రబాబు నాయుడికి వచ్చిందని రోజా అన్నారు. ప్రజలకు క్షమాపణ చెప్పి.. ఇప్పటికైనా వారి అండగా నిలబడాలని సూచించారు.

తాజా ఫోటోలు

Back to Top