రాష్ట్రాన్ని రావణకాష్టం చేసిన కాంగ్రెస్

హైదరాబాద్, 28 జనవరి 2013: రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చి అందులో కాంగ్రెస్‌ పార్టీ చలిమంట కాగుతోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు నిప్పులు చెరిగారు. ఓట్ల కోసం, సీట్ల కోసం కాంగ్రెస్‌ అధిష్టానం ఏ పని చేయడానికైనా వెనుకాడడంలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బలిదానాలకు కాంగ్రెస్ పార్టీ వైఖరే కారణమ‌ని రామచంద్రరావు విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు.

అవి అన్నీ కాంగ్రెస్‌ హత్యలే:
డిసెంబర్ 9 ప్రకటన తరువాత బలిదానాలు పెరిగాయన్నారు.‌ ఈ బలిదానాలన్నీ కాంగ్రెస్‌ పార్టీ హత్యలే అని గట్టు ఆరోపించారు. తెలంగాణ సమస్యను పరిష్కరించే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదని ఆయన దుయ్యబట్టారు. ప్రజల మధ్య విద్వేషాలనే ఆ పార్టీ కోరుకుంటుందన్నారు. మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తోందన్నారు. నెల రోజుల్లో తెలంగాణ సమస్యను పరిష్కరిస్తామని గత డిసెంబర్‌ 28న ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి సుశీల్‌ కుమార్ షిండే‌ ప్రకటించారని అయితే, ఆదివారంనాడు రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌, షిండే చేసిన ప్రకటనలతో రాష్ట్ర ప్రజలను మరోసారి దారుణంగా మోసం చేసినట్లయిందని గట్టు విచారం వ్యక్తం చేశారు.

ముందే కాంగ్రెస్‌ వైఖరి ఎందుకు తీసుకోలేదు?:
ప్రత్యేక, సమైక్య ఉద్యమాల నేపథ్యంలో రాష్ట్రం అన్ని విధాలా వెనుకబడి నేపథ్యంలో సమస్యను త్వరగా పరిష్కరించాలని అన్ని పార్టీలూ కోరుతున్నాయని గట్టు రామచంద్రరావు పేర్కొన్నారు. అయితే, కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరిస్తున్న తీరు అన్ని ప్రాంతాల వారినీ అవమానించడం తప్ప మరొకటి కాదన్నారు. కాంగ్రెస్ అధిష్టానం తీరు కారణంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ పార్టీలో ఉండడంలేదని అన్నారు. రాష్ట్రంలో చేజారిపోతున్న తన పట్టును నిలబెట్టుకునేందుకే మూడుసార్లు అఖిల పక్ష సమావేశాలు నిర్వహించిన వైనాన్ని రామచంద్రరావు గుర్తుచేశారు. అయితే, మూడు అఖిల పక్ష సమావేశాల అనంతరం కూడా తన వైఖరిని కాంగ్రెస్ స్పష్టం‌చేయలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ పార్టీ అభిప్రాయం చెప్పాలని తాము మొదటి నుంచీ కోరుతూనే ఉన్నామన్నారు. అఖిల పక్షానికి ముందే కాంగ్రెస్‌ పార్టీ ఏదో ఒక వైఖరి ఎందుకు తీసుకోలేదని నిలదీశారు.

ఆజాద్‌ మాటల్లో మూడు ప్రాంతాల మతలబు!:
కాగా, ఆజాద్‌ ఆదివారం చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలో మూడు ప్రాంతాల ప్రస్తావనను కొత్తగా తీసుకువచ్చిన వైనాన్ని గట్టు ప్రస్తావించారు. ఆజాద్‌ మాటలతో మూడు ప్రాంతాల్లోనూ రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టినట్లయిందని దుయ్యబట్టారు. తెలంగాణ సమస్యను పరిష్కరించకుండా తాత్సారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి ఇరు ప్రాంతాల నేతలతో ఆందోళనలు చేయాలని రెచ్చగొడుతోంది కాంగ్రెస్‌ అధిష్టానమే అన్నారు. ఢిల్లీలో కూర్చొని సోనియా గాంధీ తోలుబొమ్మలాట ఆడిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు సోనియా వద్దకు వెళ్ళి ఆమె పాదాల వద్ద తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని గట్టు ఆవేదన వ్యక్తం చేశారు.

సోనియాను ఎందుకు అనరు?:
కాంగ్రెస్‌ అధిష్టానం ఎంతగా అవమానిస్తున్నా టిఆర్ఎ‌స్‌ అధినేత కాని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాని సోనియా గాంధీని పల్లెత్తు మాట ఎందుకు అనడం లేదని గట్టు రామచంద్రరావు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ‌ తెలంగాణను ఇవ్వదలిస్తే ఎవరూ ఆపలేరన్నారు. ఎంత మంది వ్యతిరేకించినా అణు ఒప్పందం, ఎఫ్డిఐ బి‌ల్లులను పార్లమెంట్లో ఆమోదింపజేసుకోలేదా? అని ఆయన అన్నారు. ఇంత మందిని చావగొట్టిన కాంగ్రెస్‌ అధిష్టానం వైఖరి మంత్రి జానారెడ్డికి సానుకూలంగా కనిపిస్తోందా అని గట్టు నిప్పులు చెరిగారు. అలాంటి జానారెడ్డి ఇంటికి కేసీఆర్‌ రోజూ వెళ్ళడంలోని ఔచిత్యాన్ని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్రంలోని మూడు ప్రాంతాల కాంగ్రెస్‌ నాయకులూ సోనియా వద్దకు వెళ్ళి సమస్యకు సత్వర పరిష్కారం చేయించాలని గట్టు రామచంద్రరావు డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీపైన ఒత్తిడి పెంచడం ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలని నాయకులు, ప్రజలకు గట్టు విజ్ఞప్తి చేశారు. అంతే గాని కొట్లాటలు, విద్వేషాల ద్వారా కాదన్నారు.

కాంగ్రెస్‌ నాయకులు ఢిల్లీలో సాగిలపడినంత కాలం, సోనియా పాదాల వద్దే కూర్చున్నంత కాలం తెలంగాణ సమస్య పరిష్కారం కాదని ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు గట్టు బదులిచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు సోనియా చేతిలో కీలుబొమ్మలు, తోలుబొమ్మల మాదిరిగా ఆడుతున్నారని అందుకే సమస్య పరిష్కారం కావడంలేదని మరో ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.

తాజా ఫోటోలు

Back to Top