ప్రజల జీవితాలతో కాంగ్రెస్, టిఆర్‌ఎస్ ఆటలు

హైదరాబాద్, 30 జనవరి 2013: రాష్ట్ర ప్రజల జీవితాలతో కాంగ్రెస్, టిఆ‌ర్ఎ‌స్ పార్టీలు‌ ఆటలాడుతున్నాయని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల జీవితాలను అమ్మేయడానికి ఒక పార్టీ, కొనుక్కోవడానికి మరో పార్టీ సిద్ధపడ్డాయని నిప్పులు చెరిగింది. ఓట్లు, సీట్లు, నోట్లుగా ఆ రెండు పార్టీల వ్యవహారం ఉందని విమర్శించింది. ఒక పక్క రాష్ట్రం రావణ కాష్టంలా రగిలిపోతున్నా కాంగ్రెస్‌, టిఆర్ఎస్‌ పార్టీల మధ్య బేరాలు కుదరకపోవడమే తెలంగాణ సమస్యకు పరిష్కారం రాకపోవడానికి కారణమని దుయ్యబట్టింది. వైయస్‌ఆర్‌సిపి అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ రెండు పార్టీల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌, టిఆర్ఎస్‌ పార్టీల స్వార్థం కారణంగానే రాష్ట్రంలో‌ బలిదానాలు పెరిగిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఎత్తుకు పై ఎత్తు ప్రకటనలు:
కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ పార్టీల నాయకులు ఒకరినొకరు దూషించుకుంటున్నట్లు రాష్ట్ర ప్రజలకు భ్రమలు కలిగిస్తున్నారా? నిజంగానే దూషించుకుంటున్నారా? అనే అనుమానం వస్తోందని గట్టు వ్యాఖ్యానించారు. `ముందు రాష్ట్రం ఇవ్వండి.. తర్వాత బేరం కుదుర్చుకుందాం' అని టిఆర్‌ఎస్‌లో రెండో స్థానంలో ఉన్న కె. తారకరామారావు అంటారని, 'ఈ చేత్తో మీరు పార్టీని విలీనం చేస్తే.. ఆ చేత్తో మేం రాష్ట్రం ఇస్తాం' అని రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు చెబుతారని, 'మీరు బేషరుతుగా లేఖ ఇవ్వండి.. రాష్ట్రాన్ని తెచ్చే పని మేం చూసుకుంటాం' అని ఎం.పి. మధుయాష్కి అంటారని రామచంద్రరావు తెలిపారు.

బేరం కుదరాలట!:
ఈ ముగ్గురు మాట్లాడుతున్న మాటల్లో కనిపిస్తున్నదేమిటంటే.. 'బేరం కుదరలేదు కాబట్టి సమస్య పరిష్కారం కాలేద'ని రామచంద్రరావు వ్యాఖ్యానించారు. రాష్ట్రం రావణకాష్టంలా కాలిపోతుంటే ఈ రెండు పార్టీలూ ఇప్పటి దాకా చలిమంటలు కాగుతున్నాయా? అని ఆయన నిలదీశారు. వాయలార్‌ రవి పిలిస్తేనే తాము ఢిల్లీ వెళ్ళామని, తమ పార్టీని విలీనం చేస్తామని చెప్పాం అని కెటిఆర్‌ అంటారన్నారు. ఒక వేళ విలీనం చేయలేదు కాబట్టే రాష్ట్రం ఇవ్వలేదేమో అని కాంగ్రెస్‌ ఎంపిలు చెబుతున్నారన్నారు. తెలంగాణ ఇవ్వడమూ, ఇవ్వకపోవడమూ అనేది ఆ రెండు పార్టీల మధ్య బేరం కుదరడం మీద ఆధార పడి ఉందని అర్థమవుతోందని గట్టు దుయ్యబట్టారు.

అంటే ఈ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని అమ్ముకోవడానికి ఒకరు, కొనుక్కోవడానికి మరొకరు సిద్ధపడుతున్నారన్నమాట అని గట్టు రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం రగిలిపోతోందని, బలిదానాలు పెరిగిపోతున్నా వారికి పట్టవని ఆరోపించారు. ఈ ఆత్మబలిదానాలకు కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ పార్టీలో బాధ్యత వహించాలని గట్టు డిమాండ్‌ చేశారు.

కేసిఆర్‌ మాట తీరు సరి కాదు:
ఒక ప్రాంతం ప్రజల ఆత్మగౌరవాన్ని అమ్మేసి రాష్ట్రం తెస్తామని కేసిఆర్‌ చెబుతారని గట్టు దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ పార్టీ ఎంపిలకు కూడా తెలియకుండా తెలంగాణను ఆ పార్టీ అధిష్టానం ఇచ్చేస్తోందంటూ ఆయన చెబుతారని, ఆ మేరకు తనకు పూర్తి సమాచారం ఉందంటారన్నారు. మూడు నెలల్లో తెలంగాణ తీసుకువచ్చేస్తున్నట్లు పరకాల ఉప ఎన్నిక సందర్భంగా కేసిఆర్‌ ప్రకటించారని, అయితే ఇంతకాలమైనా ఎందుకు తేలేదని నిలదీశారు. అసభ్య పదజాలం వినియోగించి‌న కేసిఆర్ అదే తెలంగాణ సంస్కృతి అని చెప్పి తెలంగాణ ప్రజలను కించపరిచారని ఆరోపించారు. ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడుతూ, అదేమంటే తెలంగాణ మాండలికం అంటున్నారని, అసభ్య పదజాలం తెలంగాణ మాండలికమా? అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ నడిరోడ్డులో తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలువునా అమ్మేశారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజల మనోభావాలు, ఆత్మగౌరవంతో ఆటలాడుకోవద్దని కేసిఆర్‌ను రామచంద్రరావు హెచ్చరించారు.

దొందూ.. దొందే..!:
నిజానికి కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ తీరు కారణంగా వాటిని విడివిడిగా ‌చూడలేమని గట్టు పేర్కొన్నారు. తెలంగాణ ఇస్తే‌ కాంగ్రె‌స్లో టిఆర్ఎ‌స్ కలుస్తుందట, ఇవ్వకపోతే కాంగ్రెస్ వెళ్లి టిఆ‌ర్ఎ‌స్లో కలుస్తుందట అన్నారు. ఎవరు ఎవరితో కలిస్తే ఏమిటి.. మొత్తానికి కలిసిపోవడమే వాటి లక్ష్యం అన్నారు. టిఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌తో విలీనం చేస్తే సోనియా గాంధీతో తాను మాట్లాడతానని విహెచ్‌ అంటున్నారని, అంటే ఇంతవరకూ తెలంగాణ విషయంలో ఆయన సోనియాతో అసలు మాట్లాడలేదనే కదా అర్థం అన్నారు. కనీసం టిఆర్‌ఎస్‌ను విలీనం చేస్తామని అగ్రిమెంట్‌ ఇస్తే రాష్ట్రాన్ని తీసుకువస్తామని మధుయాష్కి చెప్పడాన్ని చూస్తే అసలు విషయం అర్థం అవుతున్నదన్నారు.

సెంటిమెంటుతో వచ్చే ఓట్ల కోసం టిఆర్‌ఎస్‌, ఓట్లతో వచ్చే సీట్ల కోసం కాంగ్రెస్‌ పార్టీ పాచికలు వేస్తున్నాయే గాని ప్రజల ఇబ్బందుల గురించి పట్టించుకోవడంలేదని వైయస్‌ఆర్‌సిపి అధికార ప్రతినిధి గట్టు ఆరోపించారు. నిజానికి ఆ రెండు పార్టీల వ్యవహారం ఓట్లు, సీట్లే కాకుండా నోట్ల బేరం కూడా కుదరాల్సి ఉందా? అని నిలదీశారు.

కాంగ్రెస్‌ పార్టీ శత్రువని ఇప్పుడే గుర్తొచ్చిందా?:
తెలంగాణ తొలి శత్రువు కాంగ్రెస్సే అని టిఆర్‌ఎస్‌ నాయకులు ఇప్పుడు ప్రకటిస్తున్నారని, బేరం కుదరకపోవడం వల్లే ఆ పార్టీ శత్రువు అయిందని భావించవచ్చా? అని గట్టు ప్రశ్నించారు. మన రాష్ట్రంలో అన్ని సమస్యలకూ ప్రధాన కారణం కాంగ్రెస్‌ పార్టీయే అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ మధ్య కుదిరిన ఒప్పందం ఏమిటని గట్టు ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీతో టిఆర్‌ఎస్‌ లాలూచీ పడిందని స్పష్టమవుతోందన్నారు. ఆ రెండింటి లాలూచీని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎండగడుతుందన్నారు.

ప్రాంతాలకు అతీతంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు ఆదరణ విపరీతంగా పెరుగుతోందన్న భయంతోనే కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ పార్టీలు అసత్య ప్రచారం చేస్తోందని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నకు బదులుగా గట్టు వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల సందర్భంగా వైయస్‌ఆర్‌సిపికి వచ్చిన ఆదరణే ఇందుకు నిదర్శనం అన్నారు. కాంగ్రెస్‌ ఆడుతున్న డ్రామాలో పావు కావాల్సిన అగత్యం తమ పార్టీకి లేదని మరో ప్రశ్నకు గట్టు బదులిచ్చారు.
Back to Top