ప్రజా సమస్యలపైనా వక్రదృష్టా?

రాష్ట్రం ప్రజలను పట్టి పీడిస్తున్న విద్యుత్ సమస్యపై స్పందించకుండా మొద్దునిద్రపోతున్న ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకు ప్రజల మద్దతుతో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌
చేసిన ప్రయత్నాలకు కొన్ని చానళ్లు వక్రభాష్యం చెప్పడం ఎంతవరకు సమంజసమని పార్టీ శాసనసభ ఉపనాయకురాలు భూమా శోభానాగిరెడ్డి ప్రశ్నించారు. ప్రజా సమస్యల పట్ల ఆ చానళ్ల ఉద్దేశమేంటని నిలదీశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు.

‘బంద్‌ విజయవంతం కాలేదంటూ టీవీ 9, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, ఈటీవీ చానళ్ల కూటమి ప్రత్యేక బులిటెన్లతో దుష్ర్పచారం చేయడం చాలా బాధాకరం. విద్యుత్‌ సమస్యతో ప్రజలు నరకం చూస్తున్నారు. పరిశ్రమలకు వారంలో 3 రోజులు పవర్‌ హాలిడే విధిస్తున్నారు. మిగిలిన రోజుల్లో కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. వ్యవసాయానికి రోజులో 3 గంటలు కూడా సక్రమంగా సరఫరా అవడంలేదు. ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో మేం చేసిన బంద్‌ను కొన్ని చానళ్లు వక్రదృష్టితో చూడటం ఎంతవరకు సబబు? అసలు విద్యుత్‌ సమస్యపై ఆ చానళ్ల ఉద్దేశమేంటి? రాష్ట్రంలో కరెంటు సమస్య లేదనుకోవాలా? లేక ప్రభుత్వం మరిన్ని కోతలు విధించాలని చెప్పదలుచుకున్నారా? వాళ్లు ఏం సంకేతం పంపదలుచుకున్నారు?’ అని ధ్వజమెత్తారు. బంద్ నిర్వహణ తమ పార్టీ ప్రయోజనం కోసం చేసిన కార్యక్రమం కాదని, ప్రజల కోసం వారి మద్దతుతో చేసిన కార్యక్రమమని ఆమె స్పష్టంచేశారు. ‘ఎమ్మె ల్యే ధర్మాన కృష్ణదాస్‌‌ చేతిని గాయపరిస్తే అది ఆ మీడియా కంటికి కనపడదు. ఆయన సతీమణిపై పోలీసులు చేసిన దౌర్జన్యాలూ కనపడవు’ అని అన్నారు.

Back to Top