ప్రజాభిమానంపై బురద చల్లిన బాబు

హైదరాబాద్, 4 ఫిబ్రవరి 2013: మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిపై అభిమానంతో, జననేత‌ శ్రీ జగన్‌పై ప్రేమతో కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రజలను చంద్రబాబు నాయుడు అవమానించారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. సిబిఐ అక్రమాలకు, పక్షపాత వైఖరికి ప్రజాస్పందనగా కోటి సంతకాలు సేకరణకు పిలుపునిస్తే రెండు కోట్ల మంది స్వచ్ఛందంగా సంతకాలు చేశారని పార్టీ పేర్కొంది. అయితే, అవి 'దొంగ సంతకాలు' అంటూ ఆదివారంనాడు చంద్రబాబు పాదయాత్రలో ఆరోపించడాన్ని పార్టీ తప్పుపట్టింది. కోటి సంతకాలపై చంద్రబాబు తన బినామీ పత్రిక, చానల్‌లో కట్టుకథలు రాయించారని నిప్పలు చెరిగింది. చంద్రబాబు విమర్శలు తీరు 'కోడిగుడ్డు మీద లేని ఈకలు పీకిన చందంగా ఉంద'ని ఎద్దేవా చేసింది. చంద్రబాబు వ్యాఖ్యలపై వైయస్‌ఆర్‌సిపి అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు సోమవారంనాడు పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విరుచుకుపడ్డారు.

నిత్యం చంద్రబాబు జగన్నామ స్మరణం:
పడుతూ... లేస్తూ చేస్తున్న పాదయాత్రలో చంద్రబాబు ప్రతి క్షణమూ జననేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని కలవరిస్తున్నారు, పలవరిస్తున్నారని గట్టు పేర్కొన్నారు. పాదయాత్రలో ప్రజల సమస్యలపై స్పందించకుండా వైయస్‌ఆర్‌సిపిని లక్ష్యంగా చేసుకుంటున్నారన్నారు. చంద్రబాబు తీరు చూస్తుంటే శ్రీ జగన్‌ అంటే భయం పట్టుకుందని తెలుస్తోందన్నారు. పాదయాత్ర సందర్భంగా చంద్రబాబు రెండు విషయాలు ప్రస్తావిస్తున్నారని గట్టు తెలిపారు. అవి.. సిబిఐ అక్రమాలకు, పక్షపాత వైఖరికి ప్రజా స్పందనగా కోటి సంతకాల సేకరణపై విమర్శలు చేయడం ఒకటి కాగా, మైనార్టీలో పడిన ప్రభుత్వంపై టిడిపి ఎందుకు అవిశ్వాసం పెట్టడంలేదని వైయస్‌ఆర్‌సిపి నిలదీస్తుంటే దానిపైన ఆయన విమర్శలు చేయడం రెండోది అన్నారు. తన బినామీ పత్రిక, చానల్‌లో కట్టుకథలు రాయించి, అనంతరం తానూ విమర్శిస్తున్నారని గట్టు ఆరోపించారు. అయితే, ఆ పత్రిక, చానల్‌ కథనాలపై తమ పార్టీ స్పందించాల్సిన అవసరం లేదన్నారు.

ప్రతి పట్టణం, గ్రామం, ఊరిలోనూ టెంట్లు వేసి ప్రజలు స్వచ్ఛందంగా కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొన్న విషయం మీడియాకు కూడా బాగా తెలుసన్నారు. కొందరైతే రక్తంతో కూడా సంతకాలు చేసి వైనాన్ని ఈ సందర్భంగా గట్టు గుర్తుచేశారు. ప్రజా స్పందన వైయస̴్ఆర్‌సిపి పూర్తిగా తృప్తి చెందిందని ఆయన అన్నారు. ప్రజలే న్యాయ నిర్ణేతలని, వారే దైవాలని, చరిత్ర నిర్మాతలు కూడా ప్రజలే అని, అలాంటి వారిని విస్మరించడం సరికాదని గట్టు వ్యాఖ్యానించారు.

బాబుకు అధికార పిచ్చి:
దేశంలోనే 5,45,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన ఒకే ఒక్క లోక్‌సభ సభ్యుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. అలాంటి శ్రీ జగన్‌కు జనం మద్దతు లేదని చంద్రబాబు ఎలా అంటారని గట్టు నిలదీశారు. ప్రజల వద్దకు చంద్రబాబు వెళ్ళరని, జనం మధ్యనే ఉండే శ్రీ జగన్‌ను ఎలా విమర్శిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ రాష్ట్ర ప్రజలు ఆయనను రెండు సార్లు తిరస్కరించారని, ప్రతిపక్ష నాయకుడిగా కూర్చోబెట్టారన్నారు. ఈ సారి కూడా తనకు అధికారం అందివచ్చే దాఖలాలు కనిపించకోవడంతో చంద్రబాబు పిచ్చెక్కిపోతున్నారని గట్టు ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు అధికారం పిచ్చి పట్టుకుందన్నారు. పాదయాత్ర కాదు కదా పండుకొని దొర్లినా ప్రజలు చంద్రబాబును విశ్వసించబోరని అన్నారు.

అసలైన క్విడ్‌ ప్రో కో వారిదే!:
ఈ ప్రజా కంటక కాంగ్రెస్ ప్రభుత్వంపై‌ తాను అవిశ్వాసం పెడితే వైయస్‌ఆర్‌సిపి సీట్లు అమ్ముకోవాలని చూస్తోందని చంద్రబాబు ఆరోపిస్తుండడాన్ని గట్టు తిప్పికొట్టారు. సీట్లు అమ్ముకునే చరిత్ర చంద్రబాబుదే అన్నారు. మైనార్టీలో ఉన్న ప్రభుత్వాన్ని తామే కాపాడుతున్నాం అని స్పష్టంగా చెప్పాలని గట్టు డిమాండ్‌ చేశారు. 'మీ ప్రభుత్వాన్ని నేను కాపాడతాను.. నా మీద కేసులు లేకుండా చేయండ'ని చంద్రబాబు కాంగ్రెస్‌తో బేరం కుదుర్చుకున్నారని ఆరోపించారు. అసలైన 'క్విడ్‌ ప్రో కో' జరిగింది చంద్రబాబు- కాంగ్రెస్‌ మధ్యనే అన్నారు. అవిశ్వాసం ఎప్పుడు పెట్టాలో తనకు తెలుసని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై గట్టు ప్రతిస్పందించారు. నిజమే! ప్రభుత్వం కూలిపోదని చంద్రబాబు సంతృప్తి చెందినప్పుడు మాత్రమే అవిశ్వాసం పెడతారన్న విషయం అందరికీ తెలిసిందే అని ఎద్దేవా చేశారు.

బాబును జనం చెత్తబుట్టలో పడేశారు :
చంద్రబాబు చేసిన తప్పుల కారణంగానే ఆయనను ప్రజలు చెత్తబుట్టలో పడేశారని గట్టు విమర్శించారు. చంద్రబాబు రాజకీయాలకు పనికిరారని, త్వరలోనే ప్రతిపక్ష నాయకుని హోదా కూడా ఊడగొట్టి ఇంటిలో కూర్చోబెడతారని ఆయన జోస్యం చెప్పారు. శ్రీ జగన్‌ను అక్రమంగా జైలు పాలు చేసిన కుట్రలో చంద్రబాబు కూడా భాగస్వామి అని గట్టు ఆరోపించారు. ప్రజాభిమానం ఎవరి పక్షాన ఉందో జన క్షేత్రంలో తేల్చుకుందాం రమ్మని చంద్రబాబు రామచంద్రరావు సవాల్‌ చేశారు. తప్పకుండా గెలవగలమన్న 10 సీట్లలో మీ వాళ్ళను రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్దామని, అక్కడ జనం ఎవరి పక్షాన నిలుస్తారో తేలుతుందని అన్నారు. తన రెక్కల కష్టంతో టిడిపిని అధికారంలోని తీసుకువచ్చిన ఎన్టీఆర్‌నే వంచించిన చంద్రబాబు ఆరోపణలను జనం నమ్మే పరిస్థితి లేదన్నారు.

మద్దతిస్తామన్నా.. టిడిపి అవిశ్వాసం ఎందుకు పెట్టదు?:
అవిశ్వాసం పెట్టాలంటే అసెంబ్లీలో కనీసం 30 మంది సభ్యుల బలం ఉండాలని, అంత బలం ఉన్నది టిడిపికి మాత్రమే అని, మిగతా పార్టీలకు పూర్తి బలం లేదని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నకు గట్టు రామచంద్రరావు బదులిచ్చారు. టిడిపి అవిశ్వాసం పెడితే వైయస్‌ఆర్‌సిపి సహా అన్ని పార్టీలూ మద్దతిస్తామని చెబుతున్న విషయాన్ని ఇక్కడ ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వాన్ని పడగొట్ట గల బలం టిడిపికే ఉందని, ప్రభుత్వం పడిపోవడం లేదంటే మద్దతిస్తున్నది ఆ పార్టీయే అని అర్థం అని మరో ప్రశ్నకు సమాధానం చెప్పారు. అవిశ్వాసం పెడితే, ఎన్నికలు వస్తే వైయస్ఆర్‌సిపి గెలుస్తుందని, జనంలో లేరు కాబట్టి ఎలాగూ ఓడిపోతామనే టిడిపి ప్రభుత్వాన్ని పడగొట్టడంలేదని గట్టు వ్యాఖ్యానించారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఎన్నికలు పార్టీల పరంగా జరగంలేదని, వారిని రాజకీయాల్లోకి లాగకూడదనే ఉద్దేశంతోనే ఆ ఎన్నికల్లో పాల్గొనకూడదని తమ పార్టీ నిర్ణయించిందని మరో ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.

తాజా వీడియోలు

Back to Top