<strong>హైదరాబాద్, 11 మార్చి 2013:</strong> కర్నాటక శాస్త్రీయ సంగీత దిగ్గజం డాక్టర్ శ్రీపాద పినాకపాణి మృతి పట్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. కర్నాటక సంగీతంలోని స్వచ్ఛమైన బాణీలను ఆంధ్రులకు ఆయన అందించారని శ్రీమతి విజయమ్మ నివాళులు అర్పించారు. సమాజ సేవ కోసం వైద్యం చేసిన ధన్యజీవి డాక్టర్ పినాకపాణి అని ఆమె అభివర్ణించారు.<br/>పద్మభూషణ్, సంగీత కళానిధి, కళా ప్రపూర్ణ వంటి అనేక పురస్కారాలు అందుకున్న బహుముఖ ప్రతిభాశాలి డాక్టర్ పినాకపాణి తుదిశ్వాస విడవడంతో సంగీత ప్రపంచం ఒక ధ్రువతారను కోల్పోయిందని శ్రీమతి విజయమ్మ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. డాక్టర్ పినాకపాణి మరణించడం సారస్వత లోకానికి తీరని లోటు అని ఆమె వ్యాఖ్యానించారు. డాక్టర్ పినాకపాణి కుటుంబ సభ్యులకు శ్రీమతి విజయమ్మ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.