పిబి శ్రీనివాస్‌ మృతికి విజయమ్మ సంతాపం

హైదరాబాద్, 14 ఏప్రిల్‌ 2013: ప్రఖ్యాత గాయకుడు పి.బి. శ్రీనివాస్‌ మృతి పట్ల వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ ప్రగాఢ పంతాపం వ్యక్తం చేశారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, సంస్కృతంతో పాటు ఎనిమిది భాషల్లో నిష్ణాతులైన పి.బి. శ్రీనివాస్‌ తన మృదు మధుర గానంతో శ్రోతలను అలరించారన్నారు. ఆయన ఒక విద్వత్‌ గాయకుడు అని, ఆయన నేపథ్య గానంలోని మెలోడీ సంగీత ప్రియలెవరూ మరచిపోలేరని శ్రీమతి విజయమ్మ పేర్కొన్నారు.

1930 సెప్టెంబర్‌ 22న తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జన్మించిన పి.బి. శ్రీనివాస్‌ బహు భాషా కోవిదుడనీ, ప్రణవం పేరుతో ఎనిమిది భాషల్లో వెలువరించిన పుస్తకం ఆయన బహు భాషా పరిజ్ఞానాన్ని చాటుతుందనీ శ్రీమతి విజయమ్మ ప్రశంసించారు. షాబాష్‌ పేరుతో ఉర్దూలో గజళ్ళు రాసిన పి.బి. శ్రీనివాస్‌ ఇంగ్లీషులోనూ కవితలు వెలువరించారన్నారు.

శాంతి నికేతన్‌ అభ్యర్థన మేరకు విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ శత జయంతికి రవీంద్ర గీతాలు రాసిన పి.బి. శ్రీనివాస్‌ పద్యాలు పాడడంలోనూ నేర్పరి అని శ్రీమతి విజయమ్మ కొనియాడారు. గాన సమ్రాట్‌, గానకళా సార్వభౌమ, తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి వంటి పలు బిరుదులు అందుకున్న పి.బి. శ్రీనివాస్‌ స్వర ఝరి దక్షిణాది నుంచి ఉత్తరాదికి కూడా ప్రవహించిందన్నారు.

కర్నాటక సంగీతంలో నవనీత సుధ అనే రాగాన్ని సృష్టించిన విద్వాంసుడు పి.బి. శ్రీనివాస్‌ అని శ్రీమతి విజయమ్మ శ్లాఘించారు. పి.బి. శ్రీనివాస్‌ మృతితో సంగాత ప్రపంచం ఒక స్వర సమ్రాట్టును కోల్పోయిందని ఆమె నివాళులు అర్పించారు. పి.బి. శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులకు శ్రీమతి విజయమ్మ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Back to Top