నోట్‌కు ముందే సమైక్య తీర్మానం చేయండి

హైదరాబాద్, 21 సెప్టెంబర్ 2013:

రాష్ట్ర విభజనపై కేంద్రం నోట్‌ రాక ముందే అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేసి పంపించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. తక్షణమే అసెంబ్లీని సమావేశపరచాలని విజ్ఞప్తి చేసింది. పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సూచన మేరకు 3,112 కిలోమీటర్లు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర పూర్తిచేసిన శ్రీమతి షర్మిల, ఆమెతో పాటు పాదయాత్రలో పాల్గొన్న వారిని, పాదయాత్రలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరినీ అభినందిస్తూ తీర్మానం చేసినట్లు అంబటి రాంబాబు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ అడ్డగోలుగా చేసిన రాష్ట్ర విభజనపై కేంద్ర హోంమంత్రి నోట్‌ రాక ముందే.. దాన్ని ఆపడం కోసం సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మరో తీర్మానం చేసినట్లు తెలిపారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం విస్తృత స్థాయి సమావేశం ముగిసిన తరువాత రాంబాబు మీడియా ప్రతినిధులకు సమావేశం వివరాలను వెల్లడించారు.

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు గోడ మీది పిల్లిలా చంద్రబాబు ఉండడానికి వీల్లేదని, తక్షణమే ఆయన, టిడిపి ప్రజాప్రతినిధులందరూ రాజీనామాలు చేయాలని డిమాండ్‌చేస్తూ తీర్మానం చేసినట్లు చెప్పారు. చంద్రబాబు సమైక్యవాదో, ప్రత్యేక వాదో చెప్పాలని అన్నారు. యాత్రల పేరుతో డ్రామాలాడవద్దని హితవు పలికారు. సమైక్య వాదిగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫోజు కొడుతున్నారని, కేంద్రం రోడ్‌ మ్యాప్‌లు అడిగినప్పుడు ఇచ్చారని, జూలై 30న సిడబ్ల్యుసి నిర్ణయం తీసుకునే ముందు సిఎంతో అనేక దశల్లో మంతనాలు జరిపిందన్నారు. నిర్ణయం తీసుకున్న తరువాత పది రోజుల దాకా కిరణ్‌ మాట్లాడని వైనాన్ని అంబటి వేలెత్తి చూపించారు. సీమాంధ్రలో ఉద్యమం పెరిగిపోయిన తరువాత తాను కూడా సమైక్య వాదినే అని మాట్లాడడాన్ని రాంబాబు తప్పుపట్టారు. విభజన విషయం ముందే తెలిసినా మౌనంగా ఉన్న కిరణ్‌రెడ్డి ఇప్పుడు మాట్లాడడమేమిటని ప్రశ్నించారు. విభజన నిర్ణయంతో రాష్ట్రం రావణకాష్టంలా మారిపోయిన సమస్య అయిందన్నారు. రాష్ట్రపతి పంపించినప్పుడు తీర్మానం చేస్తామని కాకుండా తక్షణమే అసెంబ్లీని సమావేశ పరిచి, విభజన సమస్యను చర్చించి, ఈ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని తీర్మానం చేసి పంపాలని కాంగ్రెస్‌ పార్టీని, ముఖ్యమంత్రిని డిమాండ్‌ చేస్తూ మరో తీర్మానం చేసినట్లు తెలిపారు.
సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న దశలో జెఎసిలు ప్రజాప్రనిధులు రాజీనామాలు చేసేలా ఒత్తిడులు పెంచాలని పార్టీ విస్తృత సమావేశం డిమాండ్‌ చేసిందని అంబటి చెప్పారు. రాజీనామాలు చేయకుండా సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నామని నాటకాలాడుతున్న వారిని కూడా రాజీనామాలు చేసేలా జెఎసిలు ఒత్తిడి చేయాలని కోరింది.

నెల రోజుల సమైక్య కార్యాచరణ:

సమైక్య ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవడం కోసం వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా అక్టోబర్‌ 1 నుంచి నవంబర్‌ 1 వరకూ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టబోయే ఉద్యమ కార్యాచరణను పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వెల్లడించారు. అక్టోబర్‌ 1న గుంటూరు నుంచి విజయవాడ వరకూ పార్టీ ఆధ్వర్యంలో ట్రాక్టర్ల భారీ ర్యాలి నిర్వహిస్తారు. మహాత్మా గాంధీ జయంతి రోజు అక్టోబర్‌ 2న సీమాంధ్రలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరాహార దీక్షలు చేయాలని పార్టీ కో ఆర్డినేటర్లను ఆదేశించింది. వారితో పాటు ఔత్సాహికులైన వారు నిరవధిక నిరాహార దీక్షలు కూడా చేయాలని సూచించింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ అధ్యక్షతన శనివారం జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించింది.

విభజన విషయంలో రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్న మంత్రులు, కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధుల ఇళ్ళ ముందుకు అక్టోబర్‌ 7 వ తేదీన వెళ్ళి పదవులకు రాజీనామాలు చేసి ప్రజా ఉద్యమంలో భాగస్వాములు కావాలని పుష్పగుచ్ఛాలు ఇచ్చి శాంతియుతంగా డిమాండ్ చేయాలని పార్టీ సమావేశం తీర్మానించింది. 10వ తేదీన అన్ని మండల కేంద్రాల్లోనూ రైతులతో దీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు రాంబాబు తెలిపారు.

17న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సమైక్య నినాదంతో రిక్షాలు, ఆటోలతో ర్యాలీ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఇక 21న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మహిళలతో వంటావార్పూ, ముగ్గులు లాంటి కార్యక్రమాలు, మానవహారాలు నిర్వహించాని తీర్మానించింది. 24వ తేదీన అన్ని నియోజకవర్గాల్లోనూ యువతతో బైక్‌ ర్యాలీలు నిర్వహించనున్నట్లు అంబటి వెల్లడించారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన‌ గ్రామ సర్పంచ్‌లు, సర్పంచ్‌లుగా పోటీచేసి ఓడిపోయిన వారందరితో 26న జిల్లా కేంద్రాల్లో ఒక రోజు నిరాహార దీక్ష చేయాలని పార్టీ సమావేశంలో నిర్ణయించినట్లు చెప్పారు. 29న విద్యార్థులు, యువకులతో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీమాంధ్రలోని అన్ని గ్రామ పంచాయతీలలోనూ సమైక్యాంధ్ర తీర్మానాలు చేయాలని కోరుతూ పార్టీ విస్తృత భేటి నిర్ణయించిందని అంబటి చెప్పారు.

సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఎంత తీవ్రంగా ఉన్నా విభజిస్తామని, నోట్‌ సిద్ధం చేస్తున్నామని చెబుతున్న కేంద్ర మెడలు వంచి అయినాసరే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కృషి చేస్తుందని అంబటి పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని అంబటి రాంబాబు విజ్ఞప్తి చేశారు. పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top