రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారో చూద్దాం రండి

హైదరాబాద్, 8 సెప్టెంబర్ 2013:

రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించలేదని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు భూమా శోభా నాగిరెడ్డి, మేకతోటి సుచరిత పేర్కొన్నారు. ఈ విషయంలో ఒక పార్టీగా మాత్రమే కాంగ్రెస్‌ తన నిర్ణయాన్ని వెల్లడించిందన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజనకు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకుని, తాను రాజీనామా చేసి, తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిల చేత కూడా రాజీనామా చేయిస్తే.. అప్పుడు ఈ కాంగ్రెస్, ఈ కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రాన్ని ఎలా విభజించగలదో చూద్దాం రండి! అంటూ వారు పిలుపునిచ్చారు. ఈ మేరకు వారు ఆదివారంనాడు ఒక బహిరంగ లేఖ రాశారు.

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాష్ట్రంలో 40 రోజులుగా జరుగుతున్న ఆందోళనలు, కోట్ల ప్రజలు వినిపిస్తున్న ఆక్రందనలు ఇప్పటికైనా వినిపించుకోండి అని కాంగ్రెస్, టిడిపిలను వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు. ప్రజలు, ఉద్యోగుల జెఎసిలు, ఉద్యమకారులు అందరూ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి మీద అడుగడుగునా వారి రాజీనామాల విషయంలో ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అక్కడ ఢిల్లీలోనూ, ఇక్కడ రాష్ట్రంలోనూ దొంగ నాటకాలు ఆడుతున్న కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిల మీద ఒత్తిడి పెరుగుతుందన్నారు. ఈ దిశగా సీమాంధ్ర గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ ఒక్కటి కావాల్సిన అవసరం ఉందని ఆ లేఖలో శోభా నాగిరెడ్డి, మేకతోటి సుచరిత తెలిపారు.

ఇప్పటికైనా రాష్ట్రంలో ప్రజలందరి బాగునూ కోరుతూ.. ఇప్పటికైనా కుమ్మక్కు రాజకీయాలను విడిచిపెట్టి నిజాయితీతో కూడిన రాజకీయాలను చేయాలని కాంగ్రెస్, టిడిపిలను తాము కోరుతున్నామని పార్టీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. లేదంటే కోట్లాది మంది ప్రజలకు కుప్పం నుంచి శ్రీకాకుళం వరకూ సముద్రపు నీరు తప్ప మంచినీళ్ళు దొరకని పరిస్థితి వస్తుందన్నారు. నీటి కోసం రోజూ కొట్టుకునే పరిస్థితి వస్తుందన్నారు. చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు లేక వేరే రాష్ట్రాలకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. సంక్షేమ పథకాలు ఆగిపోయి డబ్బులు లేక జీతాలకు కూడా కటకటలాడాల్సిన దుస్థితి ఉత్పన్నం అవుతుందన్న విషయాన్ని అందరూ గుర్తించాలని బహిరంగ లేఖలో శోభా నాగిరెడ్డి, సుచరిత గుర్తుచేశారు.

తాజా వీడియోలు

Back to Top