పేద బీసీల పొట్ట కొట్టొద్దు: గట్టు హెచ్చరిక


హైదరాబాద్‌, 3 సెప్టెంబర్‌ 2012 : పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు రాజకీయాలెందుకని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సూటిగా ప్రశ్నించింది. ఫీజు రీయింబర్సుమెంట్‌ విషయంలో ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల కారణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతుంటే బొత్సకు కనీసం చీమకుట్టినట్లయినా లేదా అని ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు నిలదీశారు. ఫీజు రీయంబర్సుమెంట్‌ను యధావిధిగా కొనసాగించాలంటూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఈ నెల 6, 7 తీదీల్లో రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద నిరాహార దీక్ష చేస్తున్నారని ఆయన తెలిపారు. పేద విద్యార్థుల ప్రయోజనం కోసం విజయమ్మ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించడం ద్వారా బొత్స తన నైజాన్ని బయట పెట్టుకున్నారని అన్నారు. 'విజయమ్మ దీక్ష ఎందుకు?' అని ప్రశ్నించిన బొత్సకు అసలు రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదని అన్నారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో గట్టు రామచంద్రరావు బొత్స తీరును తూర్పారబట్టారు. ఇంత అపరిపక్వంగా మాట్లాడుతున్న బొత్స అసలు పిసిసి అధ్యక్షుడెలా అయ్యారో చెప్పాలన్నారు. పెద్ద బీసీ అయిన బొత్స పేద బీసీల పొట్ట కొట్టొద్దని, వారి జీవితాలతో ఆటలాడుకోవడం సరికాదని హెచ్చరించారు.

ఈ రాష్ట్రంలోని ఏ పేద విద్యార్థీ డబ్బుల్లేక చదువుకు దూరం కాకూడదని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్సుమెంట్‌ పథకాన్ని ప్రారంభించారని గట్టు గుర్తుచేశారు. నిరుపేద కుటుంబంలో ఒక్కరైనా ఉన్నత చదువులు చదివితే ఆర్థికంగా నిలదొక్కుకుంటాయన్న సదుద్దేశంతో వైయస్‌ఆర్‌ 'సంతృప్త ఫీజు రీయింబర్సుమెంట్‌' పథకాన్ని ప్రారంభించారన్నారు.

మహానేత వైయస్‌ఆర్‌ పథకం ఫీజు రీయింబర్సుమెంట్‌ను ఎలాగైనా తుంగలో తొక్కేయాలన్న దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని గట్టు రామచంద్రరావు విమర్శించారు. ఫీజు రీయింబర్సుమెంటుకు రకరకాల ఆంక్షలు విధిస్తోందని ఆరోపించారు. ఫీజు చెల్లింపును తగ్గించాలని ఒకసారి, అలస్యం చేసి మరోసారి, ఆదాయ పరిమితి విధించి మరోసారి ఇలా అస్తవ్యస్త విధానమే తన తీరు అని కాంగ్రెస్‌ ప్రభుత్వం చెప్పక చెబుతోందన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్‌ పథకాన్ని యధావిధిగా అమలు చేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తొలి నుంచీ ఆందోళనలు చేస్తున్నదన్నారు. తమ పార్టీ ఉద్యమాల కారణంగానే ఈ పథకం కొనసాగుతోందన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్‌పై మొట్టమొదటిసారిగా ప్రతిస్పందించి ఉద్యమం చేసింది వైయస్‌ఆర్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి అని గట్టు పేర్కొన్నారు.

రీయింబర్సుమెంట్‌ను 35 వేల రూపాయలకే పరిమితం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గట్టు ప్రశ్నించారు. అదీ కూడా బీసీ విద్యార్థి కుటుంబ వార్షికాదాయం లక్ష రూపాయల లోపు అయితేనే వర్తింపచేయాలన్న నిర్ణయం పెద్ద చదువులకు పేదను దూరం చేయడమే తప్ప మరొకటి కాదన్నారు. అందులోనూ పది వేల లోపు ర్యాంకు తెచ్చుకున్న వారికే ఈ పథకం వర్తిస్తుందన్న కాంగ్రెస్‌ సర్కార్ తీరును ఆయన ప్రశ్నించారు. సరైన ఫ్యాకల్టీ, వసతులు లేని కళాశాలల్లో మాత్రమే పేద విద్యార్థుల చదువులు వెళ్ళమారిపోవాలన్నది ప్రభుత్వ నిర్ణయమా అని ఆయన ప్రశ్నించారు. అన్నీ ఉన్న కాలేజీల్లో పెద్దోళ్ళు మాత్రమే చదవాలని నిర్ణయించారా అని నిలదీశారు. పేదల విద్య, పెద్దల విద్య అని విద్యారంగాన్ని ఈ ప్రభుత్వం రెండుగా విభజించిందని గట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్ణయం రాష్ట్రంలో విద్యా హక్కును హరించడం తప్ప మరొకటి కాదన్నారు. తన అసమర్థ నిర్ణయాలతో బడుగు బలహీన వర్గాల అవమానించవద్దని అన్నారు.

దివంగత సీఎం వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఫీజు రీయింబర్సుమెంటు కోసం బడ్జెట్‌కు మించి నిధులు విడుదల చేశారని గట్టు గుర్తుచేశారు. అందువల్లే ఎందరో నిరుపేద విద్యార్థులు ఇంజనీరింగ్‌, మెడిసిన్‌, ఎంబిఎ, ఎంసిఎ లాంటి ఉన్నత వృత్తి విద్యలు అభ్యసించారన్నారు. అయితే, పెద్దల పాదాల కింద మాత్రమే పేదలు బతకాలన్నదే ఈ సర్కార్‌కు ఉద్దేశంగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్సుమెంట్‌పై ప్రభుత్వ నిబంధనల కారణంగా ఎక్కడ తాము విద్యకు దూరమైపోతామో అన్న ఆందోళనతో విద్యార్థులు ప్రాణాలు బలిపెడుతున్నా ఈ సర్కార్‌కు పట్టడం లేదని అన్నారు.

'వెన్నుపోటు లోంచి పుట్టిన పసుపు విషపూరిత మొక్క తెలుగుదేశం పార్తీ' అని గట్టు రామచంద్రరావు దుయ్యబట్టారు. అలాంటి పార్టీ నాయకుడికి 'సేల్సుమేన్'‌లాగా యనమల రామకృష్ణుడు వ్యవహరిస్తున్నారని అభివర్ణించారు. ఫీజు విషయంలో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు అండగా ఉద్యమించాలని యనమలకు ఆయన సూచించారు. తెలుగుదేశం పార్టీ మీ కన్నా ముందుగానే ఫీజుపై ఆందోళన చేస్తున్నది కదా అన్న మీడియా ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు. విద్యుత్‌ సమస్యపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన బంద్‌కు సహకరించవద్దని పిలుపునిచ్చిన చంద్రబాబు ఫీజు పోరులో నిజాయితీ ఎంత ఉంటుందని గట్టు ప్రశ్నించారు. రహేజా స్థలాల విషయంలో చంద్రబాబు చేసిన తప్పులను వైయస్‌ఆర్‌ సరిచేశారని ఆయన ఒక ప్రశ్నకు వివరణ ఇచ్చారు.

ప్రజా సమస్యలపై జగన్మోహన్‌రెడ్డి ఉద్యమాలు చేస్తుంటే ఈ ప్రభుత్వం అక్రమంగా జైలులో పెట్టిందని, అసలు ఆయనను ఎందుకు జైలులో పెట్టారో అన్నది కూడా సర్కార్‌కు అర్థం కాని పరిస్థితి అన్నారు. కన్న తండ్రికి నివాళులు అర్పించే అవకాశం లేకుండా జగన్‌ను ఈ సర్కార్‌ అడ్డుకున్నదని దుయ్యబట్టారు. ఎక్కడో ఒకటి రెండు చోట్ల కొద్ది మంది కాంగ్రెస్‌ నాయకులు మాత్రం వైయస్ఆర్‌కు దండ వేస్తే సరిపోతుందా? అని గట్టు నిలదీశారు.

Back to Top