'పార్టీ గుర్తులతో స్థానిక ఎన్నికలు'

హైదరాబాద్, 18 ఫిబ్రవరి 2013: స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆహ్వానించింది. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం ప్రభుత్వానికి రాజ్యాంగపరమైన బాధ్యత అని వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులతో ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేసింది. పార్టీ గుర్తులతో ఈ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. వైయస్‌ఆర్‌సిపి అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు సోమవారంనాడు పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా ద్రోహానికి పాల్పడిందని నిప్పులు చెరిగారు.

నిజానికి స్థానిక ఎన్నికలు రెండున్నరేళ్ళ క్రితం 2010లోనే నిర్వహించి ఉండాల్సిందని గట్టు తెలిపారు. అయితే, మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం అనేక ఇబ్బందుల పాలు చేస్తున్నదన్నారు. వాటిని నిశితంగా గమనిస్తున్న ప్రజలు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తే ఎక్కడ శిక్షిస్తారో అనే భయంతోనే ఇంతకాలమూ సాకులు చూపించి పారిపోతోందని దుయ్యబట్టారు. స్థానిక ఎన్నికలను ఇక ఎంతమాత్రమూ ఆలస్యం చేయవద్దని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం వ్యవహరించిన తీరు రాజ్యాంగ స్ఫూర్తికి, రాజీవ్‌ గాంధీ స్ఫూర్తికి, మహాత్మా గాంధీ చెప్పిన గ్రామ స్వరాజ్యం స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని గట్టు వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం తీరు వల్ల రూ. 4 వేల కోట్లు పోయాయి:
గత రెండున్నరేళ్ళుగా ఎన్నికలు నిర్వహించని కారణంగా కేంద్ర నుంచి రావాల్సిన సుమారు రూ.4 వేల కోట్లు రాకుండా పోయాయని గట్టు రామచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు నిర్వహించని కారణంగా రెండున్నరేళ్ళుగా స్థానిక పరిపాలన స్తంభించిపోయిందని అన్నారు. స్థానికంగా ఏ పని జరగాలన్నా అధికారుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. గ్రామస్థాయిలో ప్రజా ప్రతినిధులుగా అత్యధికంగా ఉండే బడుగు బలహీన వర్గాలను ఈ ప్రభుత్వం అధికారం నుంచి దూరం చేసిందని ఆయన దుయ్యబట్టారు.

రిజర్వేషన్లు 50 శాతం మించరాదని హైకోర్టు చేసిన సూచనను పట్టుకుని రాజ్యాంగ సవరణ కోరతామంటూ ప్రభుత్వం ఇంతకాలం సాకు చెప్పి స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా తప్పించుకు తిరిగిందని గట్టు ఆరోపించారు. రాష్ట్రంలోని బిసిల సంఖ్యను గాని, వెనుకబాటుతనాన్ని కాన్నిస్పష్టమైన జాబితా తీసుకురమ్మన్న సుప్రీంకోర్టుకు ప్రభుత్వం ఇంతవరకూ ఆ డేటాను ఎందుకు సమర్పించలేదని ఆయన నిలదీశారు. స్థానిక ఎన్నికలు జరిపించాలని 2011 జూన్‌ 15న వైయస్‌ఆర్‌సిపి అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఈ ప్రభుత్వానికి రాసిన లేఖను గట్టు చూపించారు. ఈ విషయంలో అఖిలపక్షాన్ని పిలిచి సూచనలు తీసుకోవాలని కూడా ఆయన సూచించారని చెప్పారు.

ప్రభుత్వం, బొత్స బాధ్యత వహించాలి:
స్థానిక సంస్థలకు రెండున్నరేళ్ళ క్రితం ఎన్నికలు నిర్వహించపోవడానికి బిసి వర్గానికి చెందిన అప్పటి పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి మంత్రి, ఇప్పటి పిసిసి చీఫ్‌ బొత్స సత్యనారాయణ, ప్రభుత్వం బాధ్యత వహించాలని గట్టు డిమాండ్‌ చేశారు. ఒక వైపున స్థానిక ఎన్నికలను కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్వహించకుండా తాత్సారం చేయడం, మరో పక్కన ప్రధాన ప్రతిపక్షం టిడిపి పట్టించుకోకపోవడం, రెండు పార్టీలూ కలిసి స్థానిక ఎన్నికలు జరగకుండా చేశాయని ఆయన ఆరోపించారు.

ప్రజాభిప్రాయానికి, ప్రజాభిమానానికి కట్టుబడదామని, పార్టీ గుర్తులపై ఎన్నికలు నిర్వహించాలని వైయస్‌ఆర్‌సిపి డిమాండ్‌ చేస్తోందని గట్టు పేర్కొన్నారు. స్థానిక ఎన్నికలు నిర్వహించని కారణంగా అప్పటి బడ్జెట్‌లో రాష్ట్రానికి రావాల్సిన నిధులు మురిగిపోయాయని, వాటిని ఈ బడ్జెట్‌లో ఎలా తీసుకువస్తారని ఆయన నిలదీశారు. ఒక బడ్జెట్‌లో మురిగిపోయిన నిధులను మరో బడ్జెట్‌లో తీసుకునే వీలుందా? అని ప్రశ్నించారు.

రైతుల నష్టానికి శాశ్వత పరిష్కారం చూడాలి:
రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా 2.47 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వం ప్రకటించిందని గట్టు తెలిపారు. నష్టపరిహారంగా రూ. 1.50 లక్షలు ఇస్తామని చెప్పిందన్నారు. అయితే, ఈ మాత్రం నష్టపరిహారాన్ని మహానేత వైయస్‌ గతంలోనే ఇచ్చారన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించింది ఆయన ఇచ్చిన దాని కంటే అదనమా? లేక అదేనా అన్నది స్పష్టంచేయాలన్నారు. పంట నష్టపోయిన రైతులకు రుణ మాఫీ చేయాలని, ఇన్‌పుట్‌ సబ్సిడీ పెంచాలని, నష్టపరిహారం మొత్తాన్ని పెంచాలని గట్టు డిమాండ్‌ చేశారు. వైయస్‌ఆర్‌సిపి డిమాండ్‌ చేస్తున్న విధంగా రూ. 3 వేల కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. ప్రత్యేక నిధి ద్వారా పంట నష్టపోయిన రైతులను శాశ్వత ప్రాతిపదికన ఆదుకోవచ్చని గట్టు తెలిపారు.
Back to Top