పాదయాత్ర పవిత్రతను మంటగలిపిన బాబు

హైదరాబాద్, 28 ఏప్రిల్‌ 2013: కాలం చెల్లిన రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు అని, ఆయన పాదయాత్ర విఫలమైందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభివర్ణించింది. కాలం చెల్లిన చంద్రబాబుకు, టిడిపికి ప్రజలు మళ్ళీ అధికారం ఇచ్చే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించింది. చంద్రబాబు తనకు తానుగా నిర్దేశించుకున్న పాదయాత్ర లక్ష్యాన్ని చేరక ముందే విరమించుకోవడాన్ని ఎద్దేవా చేసింది. చంద్రబాబు చేసిన 'వస్తున్నా.. మీకోసం' పాదయాత్ర మొత్తం ఆత్మస్తుతి, పరనిందలతో కొనసాగిందని విమర్శించింది. పాదయాత్ర పవిత్రతను చంద్రబాబు మంటగలిపారని దుయ్యబట్టింది. పాదయాత్రలో పసలేని ప్రసంగాలు చేయడమే కాక మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిపై విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. 2014 ఎన్నికల తరువాత దొంగ ఎవరో, దొర ఎవరో ప్రజలే తేలుస్తారని వ్యాఖ్యానించింది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

దొంగలు, దయ్యాలు తిరిగే వేళ బాబు పాదయాత్ర :
పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా చంద్రబాబు నాయుడు మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిలా పాదయాత్ర చేయాలనుకుని భంగపడ్డారని అంబటి ఎద్దేవా చేశారు. మహానేత వైయస్‌ఆర్‌ ఎర్రటి ఎండలో మిట్టమధ్యాహ్నం 1,600 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అయ్యారని, అంతకన్నా ఎక్కువగా నడిస్తే ప్రజలు దేశ ప్రధానిని చేస్తారన్న భావన చంద్రబాబుకు కలిగిందేమో అని విమర్శించారు. దొంగలు, దయ్యాలు తిరిగే రాత్రి వేళలో పాదయాత్ర చేసిన చంద్రబాబుకు రాష్ట్ర ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయని, ఎండిపోయిన పంటలను ఏ విధంగా చూశారో వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. హిందూపురంలో పాదయాత్ర ప్రారంభించినప్పుడు రోజుకు 25 కిలోమీటర్లు నడిచారని అది కర్నూలు వచ్చేసరికి 18 కి తగ్గిందన్నారు. తెలంగాణకు వచ్చేసరికి 12 కిలోమీటర్లకు దిగిపోగా చివరికి 6 కిలో మీటర్లే ఆయన నడవగలిగారని గుర్తుచేశారు. టిడిపికి రానురానూ ఓట్లు తగ్గిపోయిన విధంగానే ఆయన పాదయాత్ర దూరమూ, వేగమూ తగ్గిపోయాయన్నారు. శ్రీకాకుళం జిల్లాలో దివంగత టిడిపి నాయకుడు ఎర్రంనాయుడి సమాధి వద్ద పాదయాత్ర ముగిస్తానని చెప్పిన చంద్రబాబు విశాఖపట్నంతోనే ముగించడం ద్వారా తన లక్ష్యాన్ని మధ్యలోనే వదిలేసి వెనుదిరిగారన్నారు.

పైలాన్‌లు, పసలేని ప్రసంగాలు :
పాదయాత్ర ముగింపు సభలో చంద్రబాబు పసలేని, సుదీర్ఘ ప్రసంగం చేశారని అంబటి ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన పాదయాత్రను మహానేత వైయస్‌ను ఆడిపోసుకోవడానికి, శ్రీ జగన్‌పై బురద చల్లడానికే వినియోగించుకున్న వైనాన్ని తీవ్రంగా ఖండించారు. గతంలో తాను తొమ్మిదేళ్ళు చేసిన పరిపాలనను మళ్ళీ తీసుకువస్తానని చెప్పే ధైర్యం చేయలేదని విమర్శించారు. ఎంతసేపూ ఎక్కువ దూరం నడిచానని‌ చెప్పుకోవడానికి, పైలాన్‌లు వేసుకోవడానికే చంద్రబాబు పాదయాత్ర పరిమితమైందన్నారు. పస లేని తన ప్రసంగాల్లో మహానేత వైయస్‌ఆర్‌ను మోసగాడని వ్యాఖ్యానించడంపై అంబటి తీవ్రంగా నిప్పులు చెరిగారు. ఆరోగ్యశ్రీ పెట్టినందుకు వైయస్‌ఆర్‌ మోసగాడని చంద్రబాబు అన్నారా? సుభిక్షమైన పరిపాలన అందించినందుకు ఆయనను మోసగాడన్నారా? అని చంద్రబాబును నిలదీశారు.

ఇచ్చిన హామీలెందుకు నెరవేర్చలేదు? :
ఆడపిల్ల పుడితే నగదు డిపాజిట్‌ చేస్తానని, పెళ్ళికి రెండు లక్షలు ఇస్తానని చెప్పిన చంద్రబాబు వాటిని ఎందుకు అమలు చేయలేదని అంబటి నిలదీశారు. చంద్రబాబు రాజకీయ జీవితం అంతా మోసాలపుట్ట అన్నారు. మహానేత వైయస్‌ను విమర్శిస్తే ప్రజలు సహించబోరని హెచ్చరించారు. స్థాయి తక్కువ మాటల వల్లే ప్రజలకు తాను దూరం కావాల్సిన దుస్థితి వచ్చిందని చంద్రబాబు గ్రహించాలన్నారు. కాంగ్రెస్‌‌ను దూషించి, దూషించి అసెంబ్లీకి వచ్చిన చంద్రబాబు చివరికి కాంగ్రెస్ కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకునే దుస్థితికి దిగజారిపోయారని అంబటి ఆరోపించారు. పాదయాత్రలో చంద్రబాబు చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోగలరా? అని ఆయన ప్రశ్నించారు.

చీకట్లో జనం కష్టాలేమి తెలిశాయి.. ఎండిన పంటలెలా చూశారు ? :
ఎన్నికల రోజు తనను గుర్తుపెట్టుకుని గెలిపిస్తే ప్రతి కుటుంబంలో పెద్దకొడుకులా ఉంటానన్న చంద్రబాబు అభ్యర్థనను అంబటి ఎద్దేవా చేశారు. చంద్రబాబును పెద్దకొడుకుగా ఊహించుకోలేని ఆ కుటుంబాలు గుండె పగిలి చచ్చిపోతాయని ఆయన వ్యాఖ్యానించారు. చిన్న అల్లుడైనందుకే ఎన్టీఆర్‌కు రాజకీయంగా తలకొరివి పెట్టిన ఘనుడు చంద్రబాబు అని అంబటి రాంబాబు అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు కాంగ్రెస్‌ పార్టీలో చేరి తిట్టిన తిట్టు తిట్టకుండా ఆయనను తిట్టిన విషయాన్ని గుర్తుచేశారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఎన్నికల్లో వాడుకుని కరివేపాకులా వదిలేసిన వైనాన్ని ప్రస్తావించారు. రాత్రిపూట చేసిన పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలేమి తెలుసుకున్నారని చంద్రబాబును అంబటి సూటిగా ప్రశ్నించారు.

చేసిన తప్పులకు పశ్చాత్తాపం లేదా? :
ప్రజా కంటక కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అవిశ్వాసం ఎందుకు పెట్టలేదని టిడిపి కార్యకర్త మంగళగిరిలో నిలదీస్తే సమాధానం చెప్పలేక చంద్రబాబు పారిపోయిన విషయాన్ని అంబటి రాంబాబు గుర్తుచేశారు. ఇంతటి నీచుడు, నికృష్టుడిని ప్రజలు మరోసారి ఎట్టిపరిస్థితుల్లోనూ సిఎంను చేయబోరన్నారు. తొమ్మిదేళ్ళ పాలనలో తాను చేసిన తప్పులను పాదయాత్ర ప్రారంభించినప్పుడు చంద్రబాబు ఒప్పుకుంటారేమో అని ప్రజలు ఎదురు చూశారన్నారు. కనీసం పాదయాత్ర ముగింపునాటికైనా అలాంటి పశ్చాత్తాపం వస్తుందేమో అనుకున్నావారికి నిరాశే ఎదురైందన్నారు. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకునేలా చంద్రబాబు తనను తాను మార్చుకోవాలని అంబటి హితవు పలికారు.

బాబుకు దమ్ముంటే ఐఎంజి భూములపై విచారణ కోరాలి :
శ్రీ జగన్‌ను జైలులో ఎందుకు పెట్టారో చంద్రబాబుకు, కిరణ్‌కుమార్‌రెడ్డికి, రేవంత్‌రెడ్డికి అందరికీ తెలుసని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నకు అంబటి బదులిచ్చారు.‌ సోనియాను, కాంగ్రెస్‌ను ఎదిరించి వీరుడిగా, శూరుడిగా శ్రీ జగన్‌ జైలుకు వెళ్ళారన్నారు. శ్రీ జగన్ పార్టీ పెట్టకపోతే మహానేత వైయస్ దేవు‌డన్నారు. అవిశ్వసానికి మద్దతు ఇచ్చి ఉంటే చంద్రబాబు కూడా జైలుకు వెళ్ళి ఉండేవారని మరో ప్రశ్నకు సమాధాన చెప్పారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే ఐఎంజి భూముల కేసుపై సిబిఐ విచారణ జరిపించాలని కోరి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని మరో ప్రశ్నకు బదులిచ్చారు.
Back to Top