రాజ్యాంగ సంక్షోభంతోనే విభజనకు చెక్

హైదరాబాద్ :

కేవలం రాజ్యాంగ సంక్షోభంతో మాత్రమే రాష్ట్ర విభజన ఆగుతుందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కో ఆర్డినేటర్‌ కొణతాల రామకృష్ణ అన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లుకు సవరణలు, సూచనలను కేంద్రం పరిగణనలోకి తీసుకునే అవకాశం ఏమాత్రం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అడ్డగోలు రాష్ట్ర విభజన ప్రక్రియకు సహకరించడం ద్వారా సీఎం కిరణ్, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారని కొణతాల దుయ్యబట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఉత్తరప్రదేశ్‌ నుంచి ఉత్తరాఖండ్‌ను విడగొట్టినప్పుడు హరిద్వార్‌ను, మహారాష్ట్ర నుంచి గుజరాత్‌ వేరుపడినప్పుడు బొంబాయిని కేంద్ర పాలిత ప్రాంతాలు (యూటీ) చేయాలంటూ వచ్చిన సూచనలను గాని ఆయా శాసనసభల అభిప్రాయాలను గాని కేంద్రం పట్టించుకోని విషయాన్ని ఈ సందర్భంగా కొణతాల ప్రస్తావించారు. తెలంగాణ ముసాయిదా బిల్లు సందర్భంగా జరిగే చర్చ, సూచనలు, బిల్లుపై చేసే సవరణలను కూడా అలాగే విభజన ప్రక్రియ సందర్భంగా లెక్కలోకి తీసుకోబోదని ఆయన అన్నారు. అందుకే కేవలం రాజ్యాంగ సంక్షోభం ద్వారా మాత్రమే రాష్ట్ర విభజన ఆగుతుందన్నారు.

దేశంలో పలు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పటికీ మన రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నంత దారుణంగా అప్రజాస్వామికంగా దేనినీ చేయలేదని కొణతాల రామకృష్ణ ఆగ్రహం వ్యక్తంచేశారు. విభజనకు అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి అయినప్పటికీ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా మన రాష్ట్రం విషయంలో కేంద్రం వ్యవహరిస్తోందని ఆయన నిప్పులు చెరిగారు. రాష్ట్ర అసెంబ్లీకి ముందుగా చర్చించడానికి తీర్మానం పంపించాలని, దానిని పార్లమెంటుకు పంపించిన తరువాత ముసాయిదా బిల్లు రూపొందించి, దానిని మళ్ళీ అసెంబ్లీకి పంపాల్సి ఉంటుందన్నారు. అయితే.. మన రాష్ట్రం విషయంలో ఈ సాంప్రదాయాన్ని కేంద్రం పాటించలేదని కొణతాల అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య విలువలకు యూపీఏ ప్రభుత్వం తిలోదకాలిచ్చిందని కొణతాల ఆగ్రహం వ్యక్తంచేశారు. అసెంబ్లీలో తీర్మానం జరగకుండా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎలాంటి చర్చలోనూ పాల్గొనబోదని ఆయన స్పష్టంచేశారు.

టీ ముసాయిదా బిల్లులో ఎన్నో లొసుగులు ఉన్నాయని కొణతాల తెలిపారు. బిల్లుకు సంబంధించి ఎలాంటి సమాచారమూ ఇవ్వలేదని, ఆర్థిక గణాంకాలేవీ ఇవ్వలేదన్నారు. ముసాయిదాలో ఆస్తులు, అప్పుల పంపకాల గురించి ప్రస్తావించలేదన్నారు. విభజనలో అతి ముఖ్యమైన ప్రాతిపదిక అయిన రెవెన్యూ డివిజన్‌ గురించి అసలు ప్రస్తావనే లేదన్నారు.

జనాభా, ఆదాయం నిష్పత్తి విషయంలో తెలంగాణ, సీమాంధ్ర మధ్య చాలా వ్యత్యాసం ఉందని కొణతాల పేర్కొన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ.. రాష్ట్రపతికి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అఫిడవిట్లు ఇచ్చినప్పుడు విభజనను వ్యతిరేకిస్తున్నసీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ నాయకుల ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని కొణతాల స్పష్టంచేశారు. రాష్ట్రాన్ని విభజించడం మూర్ఖమైన పని  అన్నారు. ఇంతకు ముందు తాను హామీ ఇచ్చినట్లుగా సమైక్యాంధ్ర తీర్మానాన్ని అసెంబ్లీలో ఎందుకు ప్రవేశపెట్టడంలేదో సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. సమైక్య తీర్మానం గురించి చంద్రబాబు, కిరణ్‌ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దురదృష్టకరం అన్నారు. సోనియాగాంధీ నిర్ణయాన్ని అనుమానం రాకుండా అమలు చేసేందుకు వీరిద్దరూ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారని కొణతాల దుయ్యబట్టారు.

జనవరి 23 తరువాత మేధో మథన సదస్సు నిర్వహించి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి ఏమి చర్చిస్తారని కొణతాల ప్రశ్నించారు. ప్రజలకు చేయాల్సిన అన్యాయం అంతా చేసి, రాష్ట్రం విడిపోయిన తరువాత సదస్సులు, చర్చలు నిర్వహించడం కొత్త పార్టీ కోసమా? అని ఆయన నిలదీశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top